తెలంగాణ

telangana

'ఆ నలుగురిని వదలొద్దు..' సాత్విక్ సూసైడ్‌ నోట్​లో విస్తుపోయే విషయాలు

By

Published : Mar 1, 2023, 5:39 PM IST

Updated : Mar 1, 2023, 8:08 PM IST

Satvik Suicide Note Found: ఇంటర్ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న సాత్విక్ వద్ద సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. ప్రిన్సిపల్‌, కళాశాల ఇంఛార్జ్‌, లెక్చరర్‌ విద్యార్థులకు నరకం చూపిస్తున్నారని... వారు వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సాత్విక్‌ సూసైడ్ నోట్​లో పేర్కొన్నారు. ప్రైవేటు కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నివేదిక అందగానే.. చర్యలు తీసుకుంటామని మంత్రి సబితా తెలిపారు.

Satvik commits suicide
Satvik commits suicide

Satvik Suicide Note Found : నగర శివారులో గల నార్సింగిలోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ విద్యార్థి తరగతి గదిలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా సాత్విక్ వద్ద లభ్యమైన సూసైడ్ నోట్​లో పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్‌లో ఉంటున్న ప్రిన్సిపల్‌, కళాశాల ఇంఛార్జ్‌, లెక్చరర్‌ అయిన కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేష్ విద్యార్థులకు నరకం చూపిస్తున్నారని... వారు వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సాత్విక్‌ తన సూసైడ్ నోట్​లో పేర్కొన్నారు.

'అమ్మానాన్న.. నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలని ఉద్దేశం నాకు లేదు. మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. అన్నా.. అమ్మానాన్నలను నువ్వే బాగా చూసుకోవాలి. అన్నా.. నేను లేనిలోటును అమ్మానాన్నలకు రానీయకు. ప్రిన్సిపల్, ఇన్‌ఛార్జ్, లెక్చరర్ల వల్లే చనిపోతున్నా. కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేశ్‌ వేధింపులు తట్టుకోలేక పోతున్నా. ఈ ముగ్గురూ హాస్టల్‌లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. నన్ను వేధించిన ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోండి. అమ్మా, నాన్న లవ్ యూ, మిస్ యూ ఫ్రెండ్స్.'-సూసైడ్ నోట్​లో సాత్విక్‌ మాటలు

నన్ను వేధించిన ఆ నలుగురిపై చర్యలు తీసుకోండి: సాత్విక్‌

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలోని శ్రీచైతన్యం జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కేశంపేట మండలం కొత్తపేటకు చెందిన 'రాజప్రసాద్-అలివేలు' దంపతులు వ్యాపారం నిమిత్తం షాద్‌నగర్‌లో ఉంటున్నారు. వీరి కుమారుడు సాత్విక్‌... నార్సింగిలోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల శివరాత్రి సెలవులకు ఇంటికి వెళ్లి వచ్చిన సాత్విక్... మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో తరగతి గదిలో ఉరేసుకున్నాడు.

వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి : సాత్విక్ వసతిగృహంలో కనిపించకపోవడంతో స్నేహితులు... క్లాస్ రూమ్​ల్లో వెతికారు. తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు గుర్తించిన తోటి విద్యార్థులు వెంటనే కళాశాల సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లారు. ఎవరూ స్పందించపోవటంతో సాత్విక్‌ను వారే భుజాలపై ఎత్తుకుని బయటికి తీసుకొచ్చారు. ఇతరులను లిఫ్ట్‌ అడిగి... ఆస్పత్రికి తరలించగా, అప్పటికే సాత్విక్‌ మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. తోటి విద్యార్థుల ముందే అవమానించేలా మాట్లాడటం, దుర్భాషలాడటంతో సాత్విక్‌ మానసికంగా కుంగిపోయాడని కుటుంబసభ్యులు వాపోయారు. సాత్విక్ మృతికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సాత్విక్‌ మృతికి కారణమైన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. బాధిత కుటుంబసభ్యులతో కళాశాల ముందు బైఠాయించిన పలువురు విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ ఇంటర్ బోర్డు ముందు ఆందోళనకు దిగిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు... గేటు లోపలికి వెళ్లేందుకు యత్నించగా... పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నించిన యువజన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవటంతో వాగ్వాదం నెలకొంది.

విద్యార్థుల ఆత్మహత్యలను ఇంటర్ బోర్డ్ పట్టించుకోవట్లేదని... విద్యార్థులను వేధించే కళాశాలలను మూసివేయాలని యువజన కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. షాద్‌నగర్‌లోనూ విద్యార్థి సంఘాల శ్రేణులు రహదారిపై ధర్నా నిర్వహించారు. నార్సింగిలోని శ్రీచైతన్య కళాశాల వద్ద బైఠాయించిన సాత్విక్‌ కుటుంబసభ్యులకు, బంధువులకు పోలీసులు నచ్చజెప్పారు. కళాశాల యాజమాన్యం పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్న హామీతో వారు శాంతించారు. ఉస్మానియా మార్చురీలో సాత్విక్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.

నివేదిక అందగానే.. చర్యలు తీసుకుంటాం : ప్రైవేటు కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సాత్విక్‌ ఆత్మహత్య ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆరా తీశారు. విద్యార్థి మృతికి గల కారణాలపై విచారణ జరిపి... నివేదిక సమర్పించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను మంత్రి ఆదేశించారు. నివేదిక అందగానే.. చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడికి గురి చేయవద్దని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తిరుపతిరావు కమిటీ నివేదిక ఆధారంగా ప్రతిపాదనలు సిద్ధం చేశామని.. గతంలో మాదిరిగా న్యాయపరమైన చిక్కులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated :Mar 1, 2023, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details