తెలంగాణ

telangana

congress protest on paddy: కాంగ్రెస్‌ పోరుబాట.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం

By

Published : Nov 25, 2021, 9:41 PM IST

Updated : Nov 25, 2021, 9:50 PM IST

congress protest on paddy
కాంగ్రెస్‌ పోరుబాట

congress leaders on farmers problems: అన్నదాతల ధాన్యం గోసపై కాంగ్రెస్‌ పోరుబాట పట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపైఒకరు నెపం నెట్టుకుంటూ .. రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ ఆందోళనలు చేపట్టింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కష్టాలను తెలుసుకున్న నేతలు... అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రభుత్వ కార్యాలయాల ముందు కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నాకు దిగాయి.

అన్నదాతల దాన్యం గోసపై కాంగ్రెస్‌ పోరుబాట

congress leaders protest on paddy: అన్నదాతల సమస్యలపై కేంద్రంతో తేల్చుకుంటామని దిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ రిక్త హస్తాలతో తిరిగొచ్చారని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలు పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ... జగిత్యాలలో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ నిర్వహించింది. నెలల తరబడి కొనుగోళ్లు నిలిపివేయడం వల్ల రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందని జీవన్‌రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయని మండిపడ్డారు. తెరాస, భాజపాలు ఒకరిపైఒకరు నెపం నెట్టుకంటున్నారని విమర్శించారు.

కలెక్టర్​కు వినతిపత్రం
పెద్దపల్లిలో జరిగిన ఆందోళనలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి... అధికారులకు వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్ కాంగ్రెస్‌ నేతలు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పాల్గొన్నారు. రైతు సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించారు.

ఆదిలాబాద్​లో ఉద్రిక్తత

ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించిన పార్టీ శ్రేణులు.. ఒక్కసారిగా కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నా ముందుకు దూసుకెళ్లారు. ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి... ప్రభుత్వతీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంచిర్యాలలో కాంగ్రెస్‌ శ్రేణులు నిర్వహించిన ఆందోళనలో ఆ పార్టీ సీనియర్‌ నేత విహెచ్​, మాజీ మంత్రి వినోద్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు.

హనుమకొండలో కలెక్టర్​కు వినతిపత్రం
హనుమకొండలో ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్‌ శ్రేణులు.. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మహబూబాబాద్‌లో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళన చేపట్టారు. భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆ పార్టీ నేత గండ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ములుగులో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన ర్యాలీ చేశారు.

ధాన్యానికి నిప్పు

నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ముందు మాజీ ఎంపీ మల్లు రవి నేతృత్వంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అంతకుముందు మార్కెట్ యార్డును సందర్శించిన నేతలు... అక్కడి రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడిలో రోడ్డెక్కిన అన్నదాతలు... ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా హాలియాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్‌ నేతలు సందర్శించారు.


ఇవీ చూడండి:

Last Updated :Nov 25, 2021, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details