Revanth reddy: రాష్ట్రవ్యాప్తంగా రేపట్నుంచి 'కల్లాల్లోకి కాంగ్రెస్‌': రేవంత్‌రెడ్డి

author img

By

Published : Nov 18, 2021, 4:47 PM IST

Updated : Nov 18, 2021, 11:03 PM IST

congress protest

తెరాస, భాజపా నాటకలాడుతూ ధాన్యం కొనకుండా రైతుల మోసగిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (tpcc president revanth reddy)విమర్శించారు. దిల్లీ జంతర్ మంతర్ వద్ద కార్యాచరణ ఏంటో సీఎం కేసీఆర్​ చెప్పాలని డిమాండ్ చేశారు. ధైర్యముంటే పార్లమెంట్‌ను స్తంభింపచేయాలన్నారు.

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... జేఏసీగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (tpcc president revanth reddy) దుయ్యబట్టారు. జేఏసీ అంటే... జాయింట్ యాక్టింగ్ కమిటీగా ఆయన అభివర్ణించారు. ఏడేళ్లల్లో ముఖ్యమంత్రి కేసీఆర్... 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టారని,... రైతులు... వాటిలో కమీషన్ అడగట్లేదని... పండించిన పంటకు గిట్టబాటు ధర కల్పించాలని మాత్రమే కోరుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు, యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు (Congress Dharna on Paddy Procurement). నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయ శాఖ కమిషనరేట్ వరకు సాగిన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం బషీర్‌బాగ్‌లో వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. కార్యక్రమంలో సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రేపట్నుంచి 'కల్లాల్లోకి కాంగ్రెస్‌': రేవంత్‌రెడ్డి

ర్యాలీలో ఉద్రిక్తత

ధాన్యం కొనుగోలు పూర్తిస్థాయిలో చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. వ్యవసాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసేందుకు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కమిషనర్‌ కార్యాలయం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని కాంగ్రెస్‌ శ్రేణులు ముందుకు వచ్చే ప్రయత్నం చేయటంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే ధర్నా చేపట్టారు. ఇందిరా పార్క్ వద్ద తెరాస చేపట్టిన ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌... రైతుల పక్షాన మాట్లాడతారని ఎదురు చూశామని, మోసపూరిత వైఖరినే కొనసాగించారని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు.

'వ్యవసాయ కమిషనర్​కు రైతుల సమస్యలపై వినతి పత్రం ఇద్దామని వచ్చాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. జేఏసీగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయి. జేఏసీ అంటే..జాయింట్ ఆక్టింగ్ కమిటీ...3లక్షల కోట్లు అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టినవ్ కదా.. వాటిలో కమిషన్ అడగట్లేదు.... పండించిన పంటకు గిట్టబాటు ధర కల్పించాలని కోరుతున్నాం. ఇందిరా పార్క్ వద్ద కేసీఆర్.. రైతుల పక్షాన మాట్లాడతాడని ఎదురు చూసినం. ఇందిరా పార్క్ వద్ద ఏర్పాట్లు చూస్తే.. పరేషాన్ అవుతారు. ఏసీలతో ధర్నాలు, దీక్షలు చేస్తారా.. రైతుల పక్షాన పోరాటం చేయాలంటే.. రైతుల కల్లాల వద్దకు వెళ్లాలి. లేదంటే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలి. బండి సంజయ్, కిషన్ రెడ్డి మీరు దిల్లీకి వెళ్లి మోడీని నిలదీయాలి. ఒకరినొకరు కొట్టుకున్నట్లు చేసి ప్రజలను చంపే ప్రయత్నం చేస్తున్నారు.' -రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

'ధాన్యం కొనకపోతే ప్రగతి భవన్​ గోడలు బద్దలు కొడతాం'

ప్రతి గింజ కొనే వరకు కాంగ్రెస్ ఉద్యమం ఆగదని రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ధాన్యం కొనకపోతే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతామని హెచ్చరించారు. కల్లాల్లో కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మార్కెట్‌యార్డులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో పర్యటించాలని పిలుపునిచ్చారు.

'ఈ నెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. జంతర్ మంతర్ వద్ద నీ కార్యాచరణ ఏంటి..? పార్లమెంట్​ను స్తంభింపచేయి. కేసీఆర్ నీకు ధైర్యముంటే.. అసెంబ్లీలో తీర్మానం చేద్దాం. కరవొస్తే.. కాపాడడానికి ఎఫ్​సీఐ గోదాములను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కరీఫ్ ధాన్యం కొంటవా లేదా చెప్పు అంటే.. యాసంగి పంట ముచ్చట చెబుతుండు. అదాని, అంబానీల కోసమే మోదీ సర్కార్. వరి పంట కొనకుండా.. అదానీ, అంబానీ పాట పాడుతున్నారు... రేపటి నుంచి కల్లాలోకి కాంగ్రెస్ ఉద్యమం...23 వరకు కల్లల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ఉంటుంది. రేపు నేను కామారెడ్డి కలాల్లోకి వెళ్లి రైతులతో ఉంటా...23 వరకు కేసీఆర్​కు సమయం ఇస్తున్నాం.. 23 తర్వాత రైతులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తాం.. ప్రతి గింజ కొనే వరకు కాంగ్రెస్ ఉద్యమం ఆగదు.. కేసీఆర్ ధాన్యం కొనకపోతే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతాం.' -రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇదీ చూడండి: Congress Dharna: 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయి'

Last Updated :Nov 18, 2021, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.