తెలంగాణ

telangana

దండంపెల్లి లెదర్‌పార్కుకు పునరుజ్జీవం

By

Published : Aug 1, 2020, 1:58 PM IST

నల్గొండ జిల్లా దండెంపల్లిలో పదిహేనేళ్ల క్రితం మూతపడిన లెదర్ పార్కును తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ పరిశ్రమను మళ్లీ ఉపయోగంలోకి తీసుకొస్తే... తోలు పరిశ్రమల అభివృద్ధితో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి కూడా కల్పించవచ్చని సర్కారు యోచిస్తోంది.

dandampally leather park reopen
దండంపెల్లి లెదర్‌పార్కుకు పునరుజ్జీవం

నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని దండెంపల్లిలో దాదాపు దశాబ్దంన్నర క్రితం మూతపడిన లెదర్‌పార్కును పునః ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 450 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలో తోలు ఉత్పత్తుల పరిశ్రమలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్న సర్కారు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటుచేసి స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని సంకల్పించింది. ఇందులో భాగంగా 25.06 ఎకరాల్లో 18 ఏళ్ల క్రితం ఏర్పాటుచేసి అనంతరం మూతపడిన లెదర్‌పార్కులో త్వరలోనే కార్యకలాపాలను నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర తోలు పరిశ్రమాభివృద్ధి సంస్థ (టీఎస్‌ లిడ్‌క్యాప్‌) సన్నాహాలు చేస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002 అక్టోబరు 26న అప్పటి ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉమామాధవరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ చర్మ పరిశ్రమాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మినీ లెదర్‌ పార్కును ప్రారంభించారు. కోదాడ, హుజూర్‌నగర్‌, సూర్యాపేట, భువనగిరి ప్రాంతాలకు చెందిన దాదాపు 30 మంది వరకు చెన్నైలోని కేంద్ర లెదర్‌ పరిశోధన సంస్థ (సీఎల్‌ఆర్‌ఐ) ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. చెన్నైలో శిక్షణ పొందిన వారు రెండేళ్ల పాటు ఉమ్మడి జిల్లాలోని మరికొందరికి శిక్షణ ఇస్తూనే ఇందులోనే చెప్పులు, బూట్లు, బ్యాగులు, కీచైన్లు, బెల్టులు తయారు చేసేవారు. స్థానికంగా దాదాపు 350 మంది వరకు అప్పట్లో ఉపాధి లభించేది. అనంతర పరిణామాలతో పరిశ్రమకు సరైన నిధులు రాకపోవడంతో కాంగ్రెస్‌ హయాంలో 2005లో మూతపడింది. అప్పట్లో కొనుగోలు చేసిన యంత్రాలన్నీ ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. ఇటీవలే దాదాపు ఆరు యంత్రాలు దొంగతనానికి గురికాగా పోలీసులు కేసు నమోదు చేసి దొంగలను పట్టుకొని వాటిని తిరిగి రాబట్టారు.

దండంపెల్లి లెదర్‌పార్కుకు పునరుజ్జీవం

రూ.10 కోట్ల వరకు నిధులు

ఈ పరిశ్రమను పునరుజ్జీవింప చేయడానికి ప్రభుత్వం సుమారు రూ.10 కోట్ల నిధులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. దీనివల్ల ఇప్పటికే ఉన్న భవనానికి తోడు అవసరమైతే మరో భవన నిర్మాణం, మౌలిక వసతులు, భూమిచుట్టూ ప్రహరీని నిర్మించనున్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుండటంతో వీలైనన్ని నిధులు కేటాయించి ఉత్పత్తులు సైతం అదే విధంగా ఉండేలా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. ఇందులో భాగంగా స్థానిక దళిత యువకులకు అవగాహన, ప్రదర్శనల నిర్వహణ, నైపుణ్య శిక్షణ కార్యకలాపాలను నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమాలకు లెదర్‌ ఉత్పత్తులను వినియోగించే సంస్థలు హాజరుకానున్నాయి. వీటివల్ల రాష్ట్రంలోనే కాకుండా దేశ, విదేశాల్లో ఇక్కడి ఉత్పత్తులకు గిరాకీ పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త పరిశ్రమ ఏర్పాటులో అక్కడి మానవ వనరుల లభ్యత, యంత్రాలు, ముడిసరకు, డీపీఆర్‌, వ్యాపార ప్రణాళికలు ఇలా పలు అంశాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఇక్కడ ఇప్పటికే ఓ వ్యవస్థ రూపాంతరంగా ఉండినందునా పునః ప్రారంభ అంశం పెద్ద కష్టం కాకపోవచ్చునని... అన్ని కుదిరితే ఈ ఏడాది ఆఖరులోగా పరిశ్రమ ప్రారంభమయ్యే అవకాశముందని సంబంధిత అధికారి ఒకరు ‘ఈనాడు’కు వెల్లడించారు.

ఆక్రమణలకు గురైన లెదర్ పార్కు భూమి...

పరిశ్రమలో కార్యకలాపాలు సాగక దశాబ్దంన్నర పైన కావడంతో విలువైన 25 ఎకరాలలో కొంత భూమి ఆక్రమణలకు గురవుతోంది. లిడ్‌క్యాప్‌ అధికారులు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించడం, జిల్లా అధికారులు ఈ పరిశ్రమ భూమిపై సరైన అజమాయిషి లేకపోవడంతో స్థానికంగా కొందరు నేతలు స్థలాన్ని తమ భూమిలో కలిపేసుకుంటున్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలకు ఈ భూమిలోనే ఇటీవల అర ఎకరం కేటాయించగా, మరో రెండున్నర ఎకరాల్లో పల్లెప్రగతి కార్యక్రమం కింద మొక్కలు పెంచుతున్నారు. ఇప్పుడు పరిశ్రమ కింద కాగితాలలో 22 ఎకరాల వరకు ఉండగా... క్షేత్రస్థాయిలో దాదాపు రెండు ఎకరాల వరకు ఆక్రమణలో ఉందని తెలిసింది. ఇందులో ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఇటీవలే లిడ్‌క్యాప్‌ అధికారులు జిల్లా కలెక్టరును కలిసి విన్నవించినట్లు సమాచారం.

స్థానికులకూ ఉపాధి...

ఈ పరిశ్రమ వల్ల మా గ్రామానికి చెందిన 200 మంది వరకు గతంలో ఉపాధి లభించేది. తిరిగి ఈ పరిశ్రమను ప్రారంభించడానికి ప్రభుత్వం ముందుకు రావడం సంతోషం. త్వరితగతిన పరిశ్రమను ప్రారంభిస్తే ఈ సంక్షోభ కాలంలో చాలామందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఇవీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details