తెలంగాణ

telangana

అంబులెన్స్​ సైరన్​ వినిపిస్తే... అమ్మానాన్నలేమోననే ఆశగా చూస్తోంది!

By

Published : May 23, 2021, 7:05 AM IST

అంబులెన్స్ సైరన్ వినిపిస్తే .. ఆ చిన్నారి ఉలిక్కిపడి లేస్తోంది. ఆసుపత్రికి వెళ్లిన అమ్మానాన్న అందులో వస్తున్నారని.. అమ్మమ్మ దగ్గరికి వెళ్లి ఆశగా చెబుతోంది. ఆ మాటలు విన్న అమ్మమ్మ, తాతయ్యలు దుఃఖాన్ని దిగమింగుకుంటూ.. ఆ పాపను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మానాన్నలు కరోనా బారినపడి చనిపోయారని తెలియని ఆ పసిప్రాణం..... అమ్మమ్మా .. నిన్ను అమ్మా అని పిలవచ్చా అని ముద్దుగా అడుగుతుంటే.. ఆ పండుటాకుల హృదయాలు బరువెక్కుతున్నాయి. 15 రోజుల క్రితం హస్తినాపురంలో నివాసం ఉంటున్న భగవంత్‌రెడ్డి, నిర్మల దంపతుల ఇంట నెలకొన్న ఈ విషాదకర ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది.

human angle story from nalgonda
human angle story from nalgonda

అంబులెన్స్​ సైరన్​ వినిపిస్తే... అమ్మానాన్నలేమోననే ఆశగా చూస్తోంది!

కరోనా మహమ్మారి ఎంతో మందిని బలితీసుకుంటోంది. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. ఈ కల్లోలంలో అప్యాయతను పంచే అమ్మలేక... ఆపద సమయంలో నేనున్నాని ధైర్యం చెప్పే నాన్న దూరమైన ఎంతో మంది పిల్లలు చేష్టలుడిగి చూస్తున్నారు. వారిలో కొందరికి అమ్మమ్మ తాతయ్య ఆసరా.. మరికొందరికి బంధువుల భరోసా లభిస్తోంది. కానీ, కన్నవారు లేనిలోటు ఎప్పటికైనా వెలితే. అలాంటి విషాదకర సంఘటనే రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ పురపాలక సంఘం పరిధిలో 15 రోజుల క్రితం జరిగింది.

ఒకరు తర్వాత ఒకరు..

మన్నెగూడలో నివాసం ఉంటున్న దండెం గోపాల్‌రెడ్డి చిన్నచిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ కుటుంబంతో హాయిగా జీవించేవాడు. భార్య దీప, ఇద్దరు పిల్లలు సాత్విక్, హన్వి, తల్లి భారతమ్మతో కలిసి సందడిగా గడిపేవారు. ఈ క్రమంలో కన్నుకుట్టిన కరోనా వైరస్ గోపాల్‌రెడ్డి కుటుంబం ఊపిరి తీసింది. గోపాల్‌రెడ్డి తల్లి భారతమ్మకు కరోనా సోకింది. తల్లిని కరోనా నుంచి కాపాడుకునే ప్రయత్నంలో గోపాల్‌రెడ్డి, అతని భార్య దీప వైరస్ బారినపడ్డారు. ఆమె చనిపోయిన మూడు రోజులకే గోపాల్‌రెడ్డి కన్నుమూశాడు. అప్పటికే చికిత్స పొందుతూ కోమాలో ఉన్న దీప పదిరోజుల తర్వాత ప్రాణాలొదిలింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు మరణించడంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.

ఆస్పత్రి నుంచి శ్మశానానికి..

తమ పిల్లలను హస్తినాపురంలోని దీప తల్లిదండ్రులు భగవంత్‌రెడ్డి, నిర్మల వద్ద వదిలేసి పరీక్షలకు వెళ్లారు. అలా వెళ్లిన అల్లుడు గోపాల్‌రెడ్డి, కూతురు దీప ఒకరి తర్వాత ఒకరు కన్నుమూశారు. ఇద్దర్నీ బతికించుకునేందుకు భగవంత్‌రెడ్డి ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. తెలిసిన వాళ్ల దగ్గర, బంధువులు, స్నేహితుల సహకారంతోపాటు ఆస్తులన్నీ కరిగించి సుమారు 40 లక్షల వరకు ఖర్చు చేశారు. కానీ, కూతురు, అల్లుడు ప్రాణాలతో తిరిగిరాలేదు. కడసారి చూపునకూ నోచుకోలేదు. ఆస్పత్రి నుంచే నేరుగా శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాలేవి తెలియని చిన్నారులు సాత్విక్, హన్విలను 15 రోజుల తర్వాత ఫొటోల దగ్గరకు తీసుకెళ్లి చూపించారు. అమ్మానాన్న తిరిగివస్తారని భావించిన ఆ పసిహృదయాలు తల్లడిల్లిపోయాయి.

దుఃఖాన్ని దిగమింగుకుంటూ..

రెండు వారాల వ్యవధిలోనే ఇంట్లో ముగ్గురు మృత్యవాత పడటం ఇంకా ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. దుఃఖాన్ని దిగమింగుకుంటూ పిల్లలిద్దరినీ అమ్మమ్మ తాతయ్య ఓదారుస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తమకు పిల్లల బాధ్యత తీసుకోవడం కొంత భారంగానే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల పోషణ, చదువుకు ఇక్కట్లు తప్పేలా లేవని చెబుతున్నారు.

కరోనా కాటుకు బలైన తమ కుటుంబాన్ని ఆదుకొని పిల్లల చదువులకు దాతలెవరైనా సహకరించాలని ఈ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు.

ఇవీచూడండి:అమానవీయం: ఆకలితో అలమటించి వృద్ధ దంపతులు మృతి

ABOUT THE AUTHOR

...view details