తెలంగాణ

telangana

bjp focus on munugodu : మునుగోడుపై భాజపా ఫోకస్​.. నాలుగో 'ఆర్​' కోసం వ్యూహాలు..!

By

Published : Aug 4, 2022, 8:11 AM IST

bjp focus on munugodu : రాష్ట్రంలో ట్రిపుల్‌ ఆర్‌ (ఆర్​ఆర్​ఆర్​)కు తోడుగా మరో ఎమ్మెల్యేను గెలిపించుకోవాలని పట్టుదలతో ఉంది భాజపా. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటనతో మునుగోడుపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌లు ‘ట్రిపుల్ ఆర్’గా ప్రాచుర్యం పొందారు. ఇప్పుడు మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని గెలిపించి.. భాజపా ఖాతాలో నాలుగో 'ఆర్‌'ను చేర్చుకోవాలని వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

మునుగోడుపై భాజపా ఫోకస్​.. నాలుగో 'ఆర్​' కోసం వ్యూహాలు..!
మునుగోడుపై భాజపా ఫోకస్​.. నాలుగో 'ఆర్​' కోసం వ్యూహాలు..!

bjp focus on munugodu: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై, ఉప ఎన్నిక వస్తే ఎలా ముందుకెళ్లాలనే అంశంపై భాజపా రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న బండి సంజయ్ భోజన విరామ సమయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ ఇన్​ఛార్జి మురళీధర్ రావు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా, ఉప ఎన్నిక అంశంపై చర్చించారు. తెరాసను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా రాష్ట్ర శ్రేణులను సమాయత్తం చేస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర(praja sangrama yathra)లోనూ మునుగోడు ఉపఎన్నిక అంశాన్ని బండి సంజయ్ జనంలోకి తీసుకెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ కోసం జరిగే ఈ ఎన్నికలో ప్రజలు భాజపాకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మళ్లీ ఆ లక్కీ హ్యాండ్​కే బాధ్యతలు.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో చౌటుప్పల్‌, గట్టుప్పల్‌, చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ, నారాయణపూర్‌ మండలాలు ఉన్నాయి. చౌటుప్పల్‌, చండూర్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. మునుగోడు ఉపఎన్నికకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి రాష్ట్ర నాయకులతో కమిటీని ఏర్పాటు చేయాలని భాజపా భావిస్తోంది. దుబ్బాక, హుజూరాబాద్‌ తరహాలో పార్టీని సమన్వయం చేసేందుకు.. సీనియర్ నేతను ఇన్‌ఛార్జీగా నియమించాలని భావిస్తున్నారు.

జితేందర్‌ రెడ్డి లక్కీ హ్యాండ్‌ అని భావిస్తున్నందున ఆయనకే బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే కోర్‌ కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఇతర సీనియర్‌ నాయకులతో సంప్రదించి ఓ నిర్ణయానికి రానున్నారు. మండలాలు, మున్సిపాలిటీలకు సైతం ఇన్‌ఛార్జీలను నియమించాలని బండి సంజయ్ యోచిస్తున్నారు. మునుగోడులో నెలకొన్న పరిస్థితులపై సీనియర్‌ నాయకుడు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకులు, కార్యకర్తలతో ఇప్పటికే బండి పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

సర్వేల ఆధారంగా ముందుకు..: మునుగోడు నియోజకవర్గం(Munugodu Constituency)లో సామాజికవర్గాలకు అనుగుణంగా ఇన్‌ఛార్జిలను నియమించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయిలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై పలు సంస్థలతో వివిధ అంశాలపై సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వీటి ఆధారంగా వ్యూహ రచన చేస్తూ ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికపై కేంద్ర నాయకత్వానికి ఇప్పటికే పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ఒక నివేదికను పంపినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దీని ఆధారంగా ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కేంద్ర నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది.

ABOUT THE AUTHOR

...view details