తెలంగాణ

telangana

విషాదాంతమైన వలస కార్మికుడి ప్రయాణం

By

Published : May 5, 2020, 6:45 PM IST

కుటుంబ పోషణ కోసం వలస వెళ్లిన ఇంటి పెద్ద, ఇంటికి తిరిగొచ్చాడని కుటుంబసభ్యులు ఆనందించేలోపే... తిరిగిరాని లోకాలకు వెళ్లి.. వారిని శోకసంద్రంలో ముంచేశాడు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేటలో వలస కార్మికుడు చంద్రయ్య మరణవార్త గ్రామంలో విషాదఛాయలు నింపింది. ఇంటికి చేరుకోవడానికి 8రోజుల పాటు ప్రయాణించి, 200కి.మీ. సైకిల్ తొక్కి... అతడు చేసిన ప్రయాణాన్ని ఆ 55ఏళ్ల గుండె తట్టుకోలేక.. ఆగిపోయింది.

The sad end to a migrant labour's journey
విషాదాంతమైన వలస కార్మికుడి ప్రయాణం

కుటుంబపోషణ కోసం నాగర్​కర్నూల్​ నుంచి వలస వెళ్లిన చంద్రయ్య అనే కార్మికుడు లాక్​డౌన్ వల్ల అక్కడే చిక్కుకుపోయి, నానా అవస్థలు పడ్డాడు. చేసేందుకు పని లేదు. తినేందుకు తిండి లేదు. ఎలాగైనా సరే ఇంటికి వెళ్దామనుకుంటే రవాణా మార్గమూ లేదు. ఇటువంటి అయోమయ పరిస్థితుల్లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అక్కడి అధికారుల సూచనల మేరకు ఏప్రిల్​ 23న సైకిల్​పై తన సొంత ఊరికి ప్రయాణం మొదలుపెట్టాడు. అలా సైకిల్​పై సుమారు 200కి.మీ., ఆ తర్వాత లారీలో కొంత దూరం ప్రయాణించి చివరికి ఇంటికి చేరుకున్నాడు. 55 ఏళ్ల వయసులో 8రోజుల పాటు సైకిల్ తొక్కి రామగుండం వరకు చేరుకున్నాడు. అక్కడి నుంచి ఓ లారీలో పటాన్​చెరుకు వచ్చాడు. పూర్తిగా అలసిపోవడంతో పటాన్​చెరు నుంచి తన సైకిల్​ ప్రయాణాన్ని కొనసాగించలేకపోయాడు.

విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, వివరాలు సేకరించి... అతని కుమారుడికి సమాచారం అందించారు. పోలీసుల మద్దతుతో తనయుడితో కలిసి చంద్రయ్య శుక్రవారం ఇంటికి చేరుకున్నాడు. ఈ సుదూర సైకిల్​ ప్రయాణానికి అతడి 55 ఏళ్ల గుండె తట్టుకోలేకపోయిందేమో... రెండు రోజులపాటు విశ్రాంతినిచ్చినా తిరిగి కోలుకోలేకపోయింది. అనారోగ్యంగా ఉన్న చంద్రయ్యను... ఆదివారం నాగర్​కర్నూల్​ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో తనువు చాలించాడు. వైద్యులు అతడిని పరీక్షించి గుండెపోటుతో మరణించినట్లు ధ్రువీకరించారు.

ఇవీ చూడండి : 'విజయ్​​.. ఇలాంటి వార్తలను పట్టించుకోవద్దు'

ABOUT THE AUTHOR

...view details