తెలంగాణ

telangana

అధికారులు కావలెను: ఇన్​ఛార్జీల పెత్తనం.. పరిపాలనపై ప్రభావం

By

Published : Oct 7, 2020, 10:56 AM IST

అధికారులు కావలెను.. అవునండి.. నాగర్​కర్నూలు జిల్లాలో వివిధ శాఖల అధికారుల స్థానంలో ఖాళీలు పెరగడంతో వారి స్థానంలో ఇన్​ఛార్జీలు ఆయాశాఖల బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. రెండు శాఖలకు న్యాయం చేయలేకపోతున్నారు. దీంతో నాగర్ కర్నూలు జిల్లాలో పాలన వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది. ఇంఛార్జీలతో నాగర్ కర్నూలు జిల్లా సతమతమవుతోంది. ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాకు అధికారులు కావలెను.. అనే బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Additional liabilities for in-charges in Nagar Kurnool District
ఖాళీలతో ఇన్​ఛార్జీలకు అదనపు బాధ్యతలు.. పరిపాలనపై తీవ్ర ప్రభావం

నాగర్​కర్నూల్​ జిల్లాలోని చాలా శాఖల అధికారులు ప్రస్తుతం ఇన్​ఛార్జ్​లు గా వ్యవహారిస్తున్నారు. ఉన్న కొద్ది మంది ఉద్యోగస్తులు పదవి విరమణ, బదిలీలతో వెళ్లిపోతే... ఇక్కడికి కొత్తవారిని అపాయింట్మెంట్ చేయకపోవడం... ఇతరులు రాకపోవడం వల్ల ఆ శాఖల అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో జిల్లాలో వారి పాలనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పర్యవేక్షణలోకి శాఖల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఆ అధికారులు అందుకోలేక పోతున్నారు. కొంతకాలంగా జిల్లా అధికారులు పోస్టులు ఖాళీ అవుతూ వస్తున్నాయి. కలెక్టరేట్లో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్లు ఎనిమిది మందికి గాను... ఒక్కరూ లేరు. పన్నెండు శాఖల్లో ఇన్​ఛార్జీల పాలనలో జిల్లా కొనసాగుతోంది.

ఒక్కో అధికారికి మరో అదనపు శాఖను అప్పగించారు. వారికి పనిభారం, ఒత్తిడి పెరిగి పోయి పర్యవేక్షణలోపిస్తుంది.కరోన వ్యాప్తి భయంతోనూ పర్యవేక్షణను పూర్తిగా తగ్గించేశారు. పలువురు జిల్లా అధికారులు సిబ్బంది లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు.

జిల్లా శాఖ పర్యవేక్షణ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. భూసేకరణ అధికారి శ్రీరాములు రెండు నెలల క్రితం ఉద్యోగ విరమణ చెందారు. ఆ శాఖకు ఇన్​ఛార్జీగా డీఆర్వో మధుసూదన్ నాయక్ వ్యవహరిస్తున్నారు. డీఆర్వో మరో శాఖ ఎస్సీ కార్పొరేషన్ కూడా ఇన్​ఛార్జీగా రెండేళ్లుగా కొనసాగుతున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో సీఈవోగా ఉన్న నాగమణి ఉద్యోగ విరమణ ఇటీవలే చెందారు. ప్రస్తుతం ఆ పోస్ట్ ఖాళీగా ఉండటంతో అదనపు కలెక్టర్ మను చౌదరి అదనపు బాధ్యతలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖకు మూడేళ్లుగా అదనపు బాధ్యతగా సుధాకర్ లాల్ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారిగా మహబూబ్​నగర్​ మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప ఇన్​ఛార్జీగా వ్యవహరిస్తున్నారు.

అదనపు బాధ్యతలు

మైనార్టీ శాఖ అధికారిగా బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాశ్​ అదనపు బాధ్యతలు చేపట్టారు. కీలకంగా ఉన్న జిల్లా వ్యవసాయ శాఖలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బదిలీపై వెళ్లడంతో కల్వకుర్తి నియోజక వర్గ ఏడిఏకు వెంకటేశ్వర్లకు వ్యవసాయ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. మరో వైపు జిల్లా వ్యవసాయ శాఖలో ఉన్న సిబ్బందిలో ముగ్గురు వివిధ కారణాలతో బదిలీపై వెళ్లడంతో పాలనపై ప్రభావం పడింది. గనుల శాఖలో సహకార శాఖ అధికారులు లేకపోవడంతో ఇన్​ఛార్జీగా పెద్దపల్లి జిల్లాకు చెందిన మైనింగ్ అధికారి ఇన్​ఛార్జీగా వ్యవహరిస్తున్నారు. నల్లమలలో కీలకంగా ఉండే ఐటీడీఏ పీఓగా ఎవరూ లేకపోవడంతో ఎస్సీ సంక్షేమ అధికారి అఖిలేశ్​ రెడ్డికి అదనపు బాధ్యతలను అప్పజెప్పారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణారెడ్డి ఇటీవలే ఉద్యోగ విరమణ పొందడంతో వనపర్తి అధికారికి ఇన్​ఛార్జీ బాధ్యతలు అప్పచెప్పారు.

విద్యుత్ శాఖలో ఇన్​ఛార్జీలుగా అధికంగా ఉన్నారు. రాజేంద్రనగర్ ఎస్సీ మురళీకృష్ణ నాగర్ కర్నూల్ ఎస్ఈ ఇన్​ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టెక్నికల్ డీఈగా ఉన్న శ్యాంసుందర్ రెడ్డి ఆపరేషన్ డీఈగా కన్ట్రక్షన్​ డీఈగా ఇన్​ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి పాలమూరులో నాగర్ కర్నూలు జిల్లా పెద్దది అన్నీ పోస్టుల్లో ఇన్​ఛార్జి ఉండడం ఇబ్బందిగా మారింది. కలవాలంటే రాజేంద్రనగర్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. జిల్లా డివిజన్ స్థాయి అధికారులు కరోన బారిన పడడంతో పాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు జిల్లా అధికారులు... ఇద్దరు డివిజన్ అధికారులు కరోనాకు గురయ్యారు. సిబ్బంది పరిస్థితి ఇంచు మించు ఇంతే. కలెక్టరేట్లోని ఇప్పటికే పది మంది వరకు కొవిడ్ బారినపడ్డారు. కీలక శాఖల అధికారులకు కరోనా సోకడంతో ఇళ్లకు పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే గురువారం నాడు జిల్లా కలెక్టర్ శర్మన్ అనారోగ్య కారణాలతో 21 రోజులపాటు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 19 వరకు సెలవుల్లో వెళ్లడంతో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్​గా అదనపు బాధ్యతలను వనపర్తి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎస్కే యాస్మిన్ భాషకు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ జీవోను విడుదల చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను చేరుకొని పాలనాపరంగా ముందుండాలంటే అన్ని శాఖలకు పూర్తి స్థాయి అధికారులను నియమిస్తే జిల్లాలో పాలన గాడిలో పడే అవకాశం ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details