తెలంగాణ

telangana

సందర్శకుల తాకిడి పెరుగుతున్నా కనీస సౌకర్యాలేవీ.. కోయల్​సాగర్​ను పట్టించుకునేదెవరు..?

By

Published : Oct 9, 2022, 10:46 AM IST

Koil Sagar irrigation project: చుట్టూ కొండలు, పచ్చని పొలాలు, మధ్యలో జలాశయం. పడవల్లో విహారం, హోరెత్తించే నీటి ప్రవాహం. ఇవే మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కోయల్‌ సాగర్‌ సాగు నీటి ప్రాజెక్టు వద్ద కనిపించే అందాలు. గేట్లు ఎత్తారంటే చాలు.. పర్యాటక శోభ సంతరించుకుంటుంది. సందర్శకుల తాకిడి వేలల్లో ఉంటుంది. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అన్ని అవకాశాలున్నప్పటికీ.. కనీస మౌలిక వసతులు లేకపోవడంతో నిరాదరణకు గురవుతున్న కోయల్ సాగర్‌ పర్యాటకంపై ప్రత్యేక కథనం..

Koyal Sagar
Koyal Sagar

సందర్శకుల తాకిడి బాగుంది.. మరి కోయల్​ సాగర్​ని పట్టించుకునేదెవరు?

Koil Sagar irrigation project: మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏకైక మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు కోయల్‌ సాగర్‌. 1945-48 మధ్య కాలంలో అప్పటి నిజాం ప్రభుత్వం రూ.80 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మించింది. 12 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో రెండు కొండల మధ్య పెద్దవాగుపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. గేట్లు ఎత్తినప్పుడు దిగువకు విడుదలయ్యే నీటి ప్రవాహంతో కోయల్‌ సాగర్‌కు పర్యాటక శోభ సంతరించుకుంటుంది. గేట్లు ఎత్తకపోయినా ప్రాజెక్టు అందాల్ని వీక్షించేందుకు సెలవు దినాల్లో, పండుగ రోజుల్లో సందర్శకులు పోటెత్తుతూనే ఉంటారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సహా హైదరాబాద్, రాయచూర్ వంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం వచ్చి కోయల్‌ సాగర్‌ ప్రకృతి అందాలు ఆస్వాదించి వెళ్తుంటారు.

మూత్రశాలలు లేక మహిళలు అవస్థలు: కోయల్‌ సాగన్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్నది ఎన్నో ఏళ్ల డిమాండ్. హామీలు, ప్రతిపాదనలు తప్ప పర్యాటక అభివృద్ధికి అడుగులు ముందుకు పడటం లేదు. ఇటీవలే రాష్ట్ర పర్యాటక శాఖ పర్యాటకులను ఆకర్షించేందుకు ఇక్కడ బోటింగ్‌ను ప్రారంభించింది. కానీ మౌలిక వసతుల కల్పనను మాత్రం విస్మరించింది. సాగర్‌ అందాలను వీక్షించేందుకు వచ్చిన సందర్శకులకు సేద తీరేందుకు నీడ ఉండదు. తాగేందుకు మంచి నీళ్లు దొరకవు. తిందామంటే తిండి కూడా కష్టమే. ప్రత్యేక గదులు, మూత్రశాలలు లేకపోవడంతో నానా అవస్థలు పడాల్సిందే. అందుకే ఇక్కడికి వచ్చే వారు కనీస సదుపాయలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు.

అభివృద్ధికి ప్రతిపాదనలు..:బోటింగ్‌తో పాటు హోటల్‌, ఆహ్లాదం కోసం పచ్చదనం, పిల్లల ఆట స్థలం లాంటి సదుపాయలు కల్పించాలని ప్రతిపాదనలు ఉన్నా.. ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తే మహబూబ్‌ నగర్‌ జిల్లాకే తలమానికంగా కోయల్‌ సాగర్‌ నిలుస్తుందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. కోయల్‌ సాగర్‌ కోసం సుమారు రూ.8 కోట్లతో పర్యాటక అభివృద్ధి చేపట్టాలని ప్రతిపాదనలున్నప్పటికీ.. అవి అమల్లోకి రాకపోవడం సందర్శకులను, స్థానికులను నిరాశకు గురిచేస్తోంది. ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి దిశగా ఆలోచించాలని వారు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details