తెలంగాణ

telangana

ఏఎంజీ గోట్ ఫామ్.. ఇక్కడ అన్ని రకాల విదేశీ మేకలు లభించును

By

Published : Mar 29, 2023, 2:26 PM IST

Goat Farm at bhoothpur in Mahabubnagar : మేకల్ని పెంచాలనుకుంటే ఒకేజాతివి పెంచుతాం. లాభం ఉందంటే రెండు, మూడు జాతుల్ని కలిపి పెంచుతాం. పాలమూరు జిల్లాలో మాత్రం పదికిపైగా జాతుల్ని ఒకేచోట పెంచుతున్నారు. అందులో ఆఫ్రికా, న్యూజిలాండ్‌ లాంటి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న జాతులు, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మహరాష్ట్రలకు చెందిన స్వదేశీ జాతులు, వాటితో ఏర్పడిన జాతులు వందల సంఖ్యలో ఉంటాయి. ఇంతకీ ఎందుకు ఇన్ని రకాల జాతుల్ని పెంచుతున్నారో మనమూ తెలుసుకుందాం.

Goat Farm at bhoothpur
Goat Farm at bhoothpur

Goat Farm at bhoothpur in Mahabubnagar : మహబూబ్​నగర్ జిల్లా భూత్పూర్‌లోని ఓ ప్రైవేటు మేకల ఫామ్ విభిన్నజాతుల మేకలతో ఆకట్టుకుంటోంది. 160కి పైగా జీవాలతో పాటు 10రకాల దేశీ, విదేశీ సంకర జాతులు ప్రధానాకర్షణగా నిలుస్తున్నాయి. విదేశాలనుంచి దిగుమతి చేసుకుని మనదేశంలో అభివృద్ధి చేసిన ఆఫ్రికన్‌ బోయర్, న్యూజిలాండ్ జాతితో సంకరం చేసిన బార్బరీ, బ్యాంటం, రాజస్థాన్‌కు చెందిన సోజత్, మేవాతి, సిరోయి, పంజాబ్‌కు చెందిన బీటల్, హైదరాబాదీ లాంటి జాతులు అక్కడ ఉన్నాయి. ఒక్కో జాతిది ఒక్కో ప్రత్యేకత. ప్రధానంగా వీటన్నింటి మాంసం, పాల ఉత్పత్తి కోసం అక్కడ పెంచుతున్నారు. ఒక్కో జాతిని మరో జాతితో సంకరం చేసి కొత్తజాతుల్ని సైతం ఉత్పత్తి చేస్తున్నారు. విభిన్నమైన సంకరజాతి మేకలతో ఫామ్ పలువురిని ఆకర్షిస్తోంది.

'భిన్నజాతులతో సంకరం చేసి.. కొత్త జాతి సృష్టి'.. గోట్ ఫాం

మేకల పెంపకం డబ్బులిచ్చే యంత్రం లాంటిది:2018లో ఫామ్‌ను ప్రారంభించారు. విభిన్నజాతులను పెంచేందుకు ఇప్పటివరకు 25లక్షలు ఖర్చు చేశారు. ఇంతకీ ఎందుకు ఇన్ని జాతుల్ని పెంచుతున్నారని అడిగితే.... మేకల పెంపకమంటే డబ్బులిచ్చే యంత్రం లాంటిది అంటారు ఫామ్ యజమాని అన్వర్. ప్రస్తుతం అంతరించిపోతున్న మేకల పెంపకం దృష్ట్యా తక్కువ స్థలంలో ఎక్కువ జీవాల్ని పెంచడమెలాగో ప్రయోగాత్మకంగా చేపట్టానని తెలిపారు. మేకల్ని పెంచితే మాంసం, పాల ఉత్పత్తి అధికంగా ఉండాలని.. పెంపకం వల్ల రైతులు లాభపడాలని చెబుతున్నారు. అందుకే అధిక లాభాలు ఇచ్చే మేలైన జాతుల్ని దిగుమతి చేసుకుని, స్థానిక జాతులతో సంకరం చేయడం ద్వారా కొత్తజాతుల రూపకల్పన కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

"బీటల్, బార్బరీ ఇలా 10రకాలు మేకలున్నాయి. స్టాల్ ఫీడింగ్, ఎలివేటెడ్ సిస్టమ్​లా చేసి అక్కడ మేకలను పెంచుతున్నాం. మొదట ఒక్క మేకతో ఫాంను మొదలు పెట్టాము. తర్వాత వాటి సంఖ్యను పెంచుతూ ఇప్పడు వాటి సంఖ్య 160కి వచ్చింది. ఇప్పటికే 100 మేకలను కూడా అమ్మేశాం. వాటి నుంచి మంచి లాభాలను పొందాం. ప్రస్తుతం అమ్మటం లేదు. 2సంవత్సరాల తర్వాత మేకలను అమ్మటం ప్రారంభిస్తాం. డాక్టర్ల సలహాలతో మేకలతో పెంచుతున్నాం. సూపర్​నేపి, దశరథ గడ్డి, వేస్తాము."­ - మహ్మద్ అబ్దుల్ సుభాన్, ఫామ్ యజమాని

ప్రత్యేక కేజ్​లతో.. పరిశుభ్రత:ఫామ్‌లో మేకల్ని పెంచేందుకు కేజ్ సిస్టమ్ వినియోగిస్తున్నారు. భిన్నజాతుల్ని దేనికవే వేరుచేసి వాటికి ప్రత్యేకంగా ఒక కేజ్‌ని కేటాయిస్తున్నారు. నేలపై పెంచకుండా 3, 4 అడుగుల ఎత్తులో రంధ్రాలతో కూడిన ప్లాస్టిక్ ఫ్లోర్‌ని ఏర్పాటు చేశారు. దీనివల్ల మేకల మల, మూత్రాలు ఆ రంధ్రాల ద్వారా ఎప్పటికప్పుడు కింద పడిపోతాయి. అపరిశుభ్రత వల్ల రోగాలకు అవకాశం ఉండదు. కేజ్​ల వల్ల ఒకదాని నుంచి మరో మేకకు వ్యాధులు సోకవు. దాణాగా ఎండుగడ్డి, పచ్చిగడ్డి సహా పోషకాలు అందిస్తున్నారు. కేజ్ విధానంలో నిర్వాహణ భారం తక్కువ. కేవలం ఇద్దరు వ్యక్తులతో 300 మేకల్ని పెంచవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.

పేదలకు ఖర్చు చేయడమే లక్ష్యం:ప్రస్తుతం ఫామ్ లో 160జీవాలే ఉన్నాయి. దేశ,విదేశీ జాతుల్ని సంకరం చేయడం ద్వారా వచ్చిన మేకల్లో మంచి ఫలితాలివ్వని జీవాల్ని ప్రస్తుతానికి అమ్మేస్తున్నారు. బోయర్, బార్బరీ, బీటల్, సిరోయి జాతులపై ప్రస్తుతం ప్రయోగాలు శాస్త్రీయ పద్ధతిలో చేస్తున్నారు. మూడేళ్ల తర్వాత అమ్మకాలు ప్రారంభించి వచ్చే లాభంలో 33శాతం పేదలకు ఖర్చు చేయడమే లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. భవిష్యత్‌లో దశలవారీగా విస్తరించి 10వేల మేకల్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మేకలపెంపకంపై ఆసక్తి ఉన్న రైతులొస్తే సహకారం అందిస్తామని చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details