తెలంగాణ

telangana

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 18 కరోనా కేసులు

By

Published : Jul 6, 2020, 10:52 AM IST

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం మొత్తం 18 కరోనా కేసులు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలో 9, మహబూబ్‌నగర్‌లో 6, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ముగ్గురు కొవిడ్‌ బారిన పడ్డారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మహమ్మారి బాధితుల సంఖ్య 28కి చేరింది.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 18 కరోనా కేసులు
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 18 కరోనా కేసులు

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చాపకింద నీరులా కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం మొత్తం 18 మంది కరోనా బారిన పడ్డారు. వనపర్తి జిల్లాలో 9, మహబూబ్‌నగర్‌లో 6, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులు 28కి చేరాయి.

వనపర్తి జిల్లా కేంద్రంలో ఆరు కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరు ఖిల్లా గణపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఏఎన్‌ఎం, ఆమె భర్త ఉన్నారు. గతంలో కరోనా బారిన పడ్డ వ్యక్తి నుంచి పట్టణంలోని రాయిగడ్డలో ఒక వ్యక్తికి, బ్రహ్మంగారి వీధిలో ఒకరికి ప్రైమరీ కాంటాక్ట్‌ ద్వారా పాజిటివ్‌ వచ్చింది. వనపర్తిలోని నందిహిల్స్‌లో ఓ వృద్ధుడికి కరోనా సోకింది. కొత్తకోటలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. ముగ్గురూ పురుషులే, పెద్దమందడి మండలం మద్దిగట్లలో వృద్ధురాలికి పాజిటివ్‌గా తేలింది.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం నమోదైన ఆరు కేసులన్నీ జిల్లా కేంద్రానికి చెందినవే. సుభాశ్‌నగర్‌లోని ఓ అపార్టుమెంటులో తల్లీ కూతుళ్లు కరోనా బారిన పడ్డారు. టీడీగుట్టలోని మహిళా హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స కోసం రాకపోకలు సాగించడం వల్ల పాజిటివ్‌గా తేలింది. రాంనగర్‌లో ఓ మహిళకు కరోనా సోకింది. ఈమె భర్త 104లో ఉద్యోగం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతుండగా ప్రైమరీ కాంటాక్టు ద్వారా భార్యకు పాజిటివ్‌ వచ్చింది. జిల్లా కేంద్రం సంజయ్‌ నగర్‌లో నివాసముండే పోలీసు కానిస్టేబుల్‌కు కరోనా వచ్చింది. ఈయన హైదరాబాద్‌లో పనిచేస్తారు. పద్మావతి కాలనీలో ఒక వ్యక్తి కరోనా బారిన పడ్డారని జిల్లా వైద్యాధికారి డా.కృష్ణ తెలిపారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే స్టాఫ్‌నర్సు కొవిడ్‌ మహమ్మారి బారిన పడ్డారు. తిమ్మాజిపేట మండలం గుమ్మకొండకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ఓ వ్యక్తి కరోనా మహమ్మారి బారిన పడ్డారని వైద్యాధికారి సుధాకర్‌లాల్‌ వెల్లడించారు.

ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్

ABOUT THE AUTHOR

...view details