తెలంగాణ

telangana

పాలమూరు వాసులకు తప్పని నీటి కొరత... అధికారులకు కొత్త అనుభవం

By

Published : Nov 4, 2020, 8:29 AM IST

దాదాపుగా 20 రోజుల నుంచి మహబూబ్​నగర్ జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. మరో 20 రోజుల పాటు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఈ తరుణంలో జిల్లాలోని పది మండలాల్లో ప్రత్యామ్నాయం లేకపోవడంతో స్థానికంగా ఉన్న బోర్లే దిక్కయ్యాయి. ఏలూరు జలాశయం వద్ద బోర్లు మునిగిపోవడంతో స్థానికులకు నీటి ఇక్కట్లు మొదలయ్యాయి. ప్రత్యామ్నాయ సదుపాయాలున్నా అమలు చేయకపోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులకు సరికొత్త అనుభవ పాఠాలు నేర్పిందని అధికారులు అంటున్నారు.

mission bhagiratha water problems at few mandals in mahaboobnagar district
ఏలూరు వద్ద మునిగిన బోరు... తప్పని నీటి కొరత

మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజలకు మరోసారి తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. ఏలూరు వద్ద బోరు మునిగిపోవడంతో జలాశయం నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. జడ్చర్ల మండలం నాగసాల 77 ఎంఎల్​డీ నీటి శుద్ధి కేంద్రం నుంచి జిల్లాలోని పది మండలాల్లోని 466 గ్రామాలకు నీరు సరఫరా జరుగుతుంది. దాదాపు ఐదు లక్షల జనాభాకు మంచి నీటిని అందిస్తోంది.

తీరని ఇక్కట్లు

మిషన్ భగీరథ అమలులోకి వచ్చాక ఇదివరకు తాగునీటిని అందించిన రామన్​పాడుని మూసివేశారు. మిషన్ భగీరథ నీళ్లు ఆగిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. స్థానికంగా ఉన్న బోర్లను తిరిగి పునరుద్ధరించారు కానీ చాలా వరకు బోర్లు పని చేయడం లేదు. కొన్నిచోట్ల పైపులైను పగిలిపోవడం తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. జిల్లాలోని జడ్చర్ల, భూత్పూర్ పురపాలికల్లో రెండు వారాలైనా కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా జరగడం లేదు. కొన్నిచోట్ల ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు. మరికొన్ని చోట్ల ట్యాంకర్లతో సంపు... అనంతరం నల్లాల ద్వారా సరఫరా చేస్తున్నారు. అయినా నీటి సమస్యలు తీరలేదు.

చర్యలు అవసరం

ప్రత్యామ్నాయంగా రామన్​పాడు పథకం ఉన్నా అవరోధాలు ఏర్పడడంతో అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. సమృద్ధిగా వర్షాలు పడడంతో స్థానిక బోర్లలో నీళ్లు ఉన్నాయని... ఎండాకాలంలో నీటి మట్టం తగ్గిపోతుందని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దిశగా చర్యలు చేపట్టకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. వెంటనే చర్యలు చేపట్టి తాగునీటి సమస్య తీర్చాలని కోరుతున్నారు.

కొత్త అనుభవం

మిషన్ భగీరథ నీటి సరఫరాకి మరో 20 రోజులు పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. అప్పటివరకు రామన్​పాడుని పునరుద్ధరించి నీరు సరఫరా చేస్తామని మిషన్ భగీరథ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ పథకంలో కొత్త అనుభవాలు ఎదురయ్యాయని... రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:తీరని గిరి పుత్రుల దాహార్తి... అలంకారప్రాయంగా నల్లాలు

TAGGED:

ABOUT THE AUTHOR

...view details