తెలంగాణ

telangana

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నత్తనడకన రైతు వేదికల నిర్మాణాలు

By

Published : Oct 29, 2020, 5:09 AM IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. వనపర్తి జిల్లా మినహా.. మిగతా ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు వెనకబడ్డాయి. దసరా నాటికి ప్రారంభించాలని ప్రభుత్వం భావించినా.. వివిధ కారణాలతో మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అధికారుల ఒత్తిడితో పలుచోట్ల గుత్తేదారులు నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

delay in farmer platforms constructions in mahaboobnagar district
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నత్తనడకన రైతు వేదికల నిర్మాణాలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నత్తనడకన రైతు వేదికల నిర్మాణాలు

రాష్ట్రవ్యాప్తంగా రైతులను సంఘటితం చేయటమే లక్ష్యంగా.. ప్రభుత్వం చేపట్టిన రైతువేదికల నిర్మాణాలు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదు. దసరా నాటికి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించాలని భావించినా.. ఈ వేదికల నిర్మాణాల్లో జాప్యం కొనసాగుతోంది. ఒక్క వనపర్తి జిల్లాలో 71 నిర్మాణాలకు... ఇప్పటి వరకూ 66 పూర్తికాగా... మరో రెండు మూడ్రోజుల్లోనే మిగతావి పూర్తయ్యే అవకాశముంది. జోగులాంబ గద్వాల జిల్లాలో 97 వేదికలకు గాను.. ఇప్పటి వరకూ 77 పూర్తి చేశారు. మరో 20 అసంపూర్తిగా మిగిలాయి. 10 చోట్ల పైకప్పు పూర్తయి చివరి దశ పనులు మిగులగా.. 8 వేదికల్లో పైకప్పు వేస్తున్నారు. 2 వేదికలు లెంటల్ లెవల్ లో ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో పనులు నత్త నడకన సాగుతున్నాయి. 77 రైతు వేదికలకు గాను ఇప్పటికి 16 మాత్రమే పూర్తిచేశారు. మిగిలిన 61 వివిధ దశల్లో ఉన్నాయి.

ప్రధాన ఆటంకంగా భారీ వర్షాలు

ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలు రైతు వేదికల నిర్మాణానికి ప్రధాన ఆటంకంగా నిలిచాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకూ నెలలో కనీసంగా 10 రోజుల పాటు వర్షాలు కురిశాయి. దీంతో పనులు ముందుకు సాగలేదు. ఇసుక అందుబాటులో లేకపోవటం వల్ల.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ పనులు మందకొడిగా సాగాయి. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో సమీప వాగుల్లోంచి ఇసుకను తరలించుకునేందుకు అనుమతులు మంజూరు చేయడం వల్ల ఇసుక సమస్య తీరింది. దసరా గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేకాధికారులను రంగంలోకి దింపి క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించారు. అదనపు మానవ వనరులు, యంత్రాలు వినియోగించుకోవాలని కోరారు.

నాణ్యతా ప్రమాణాలపై అనుమానాల వెల్లువ

దసరాకు రైతువేదికలను పూర్తి చేయాలన్న సంకల్పంతో అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగం... ప్రజాప్రతినిధులను, గుత్తేదారులను పరుగులు పెట్టించింది. దీంతో చాలాచోట్ల నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. త్వరగా పూర్తి చేయాలన్న తొందరలో సరిగ్గా క్యూరింగ్ చేయకుండానే పనులు చేశారన్న ఆరోపణలున్నాయి. ఇంజినీరింగ్ అధికారులతో నాణ్యతపై నిఘా ఉంచామని అధికారులు చెబుతున్నా.. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమయం పట్టే అవకాశం

ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి ప్రభుత్వం 22లక్షల రూపాయలు కేటాయించగా.. కొన్నిచోట్ల ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాన్ని మించి ఖర్చయిందని ప్రజాప్రతినిధులు, గుత్తేదారులు చెబుతున్నారు. కాగా నవంబర్ తొలి రెండు వారాల్లోనే రైతు వేదికల పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా.. వ్యవసాయశాఖకు భవనాలు అప్పగించడానికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

ఇవీ చూడండి: రాష్ట్రంలో ఇంజినీరింగ్​ రెండో విడత కౌన్సిలింగ్​ ఆపాలి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details