తెలంగాణ

telangana

Bandi Sanjay Letter To Kcr: 'సాగునీటి ప్రాజెక్టులపై చర్చిద్దాం పాలమూరుకు రండి'

By

Published : Apr 16, 2022, 12:21 PM IST

Bandi Sanjay Letter To Cm Kcr: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు రావాలని అందులో పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay Letter To Cm Kcr: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. సాగునీటి ప్రాజెక్ట్‌లపై చర్చించేందుకు పాలమూరుకు రావాలని బహిరంగ లేఖ విడుదల చేశారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయడం, వలసల నివారణకు చర్యలు చేపట్టడం గురించి లేఖలో పేర్కొన్నారు. యాత్రలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా సాగునీటి సమస్యలను, వలసలు, ఉపాధిపై ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తున్నారని అన్నారు. అక్కడి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో యాత్ర చేపడితే కేటీఆర్ సహా తెరాస నాయకులు పాదయాత్రపై విషం చిమ్ముతున్నారన్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి హామీలు అమలు చేయలేదని లేఖలో బండి ఆరోపించారు. పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాలేదని, గత ప్రభుత్వాలు పూర్తిచేసిన ప్రాజెక్టులను తెరాస ఖాతాలో వేసుకొని పాలమూరు సస్యశ్యామలమైందని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. వలసలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. అంతర్జాతీయ జల సదస్సు నియమాల ప్రకారమైన, బచావత్‌ అవార్డ్‌ ఆదేశాల మేరకు పరివాహక ప్రాంత ప్రజల అవసరాలు తీర్చాకే ఇతర ప్రాంతాలకు జలవనరులు కేటాయించాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.

ప్రాజెక్టులేవి:నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని అటకెక్కించారని.. రాజోలి బండ ద్వారా చుక్కనీరు అందడం లేదని.. నెట్టెంపాడు, భీమ, కోయిల్‌ సాగర్‌ వంటి పథకాల ద్వారా కూడా సద్వినియోగం కావడం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో నీళ్ల సమస్య కూడా ఒక ప్రధాన కారణమని... 2014లో తెలంగాణ ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన మీరు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రాజకీయంగా ఉపయోగించేందుకు ప్రజల్లో సెంటిమెంట్‌ను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

డబ్బు ఎక్కడ పోయింది: ఎనిమిదేళ్ల పాలనలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిన సుమారు 2 లక్షల కోట్ల రూపాయల డబ్బు ఎక్కడ పోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని.. ఈ పథకం ద్వారా కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా భారీగా నష్టపోనుందన్నారు. తెలంగాణకు జరగుతున్న అన్యాయంపై సహించలేదని... ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీంతో స్పందించిన కేంద్ర మంత్రి అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం పొందే వరకు ప్రాజెక్టులను కొనసాగించడాన్ని నిలిపివేయాలని కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వానికి తెలిపిందన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలుగుతున్నా.. ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఏపీకి దోచిపెట్టేందుకే: ఏపీకి సహకారం అందించి నీటి వాటాను దోచి పెట్టేందుకు తెరాస ప్రయత్నించిందన్నారు. ఇప్పటికే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకంలో 90 శాతం పనులు పూర్తయ్యాయని.. దీనికి తెరాసనే పూర్తి భాద్యత వహించాలన్నారు. కృష్ణా జలాల్లోని 811 టీఎంసీల్లో తెలంగాణకు 555 టీఎంసీలు రావాల్సి ఉన్నా... కేవలం 299 టీఎంసీలకే అంగీకరించి కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాలరాశారన్నారు. న్యాయమైన నీటి హక్కులను కాపాడడంలో తెరాస విఫలమైందని... ఇప్పుడు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రాన్ని నిందించడం శోచనీయమన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లు పూర్తికాకపోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రైతులు ఇప్పటికి బోర్లు, వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో తెరాస ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలమూరు ప్రజల పట్ల జరుగుతున్న వివక్షపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని.. దీనిపై చర్చించడానికి తెరాస సిద్ధమా అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని, వలసలు అరికట్టి ప్రజలకు ఉపాధి కల్పించే చర్యలు చేపట్టాలని భాజపా డిమాండ్‌ చేస్తోందని... ప్రభుత్వం స్పందించని పక్షంలో పాలమూరు ప్రజల పట్ల వివక్షను, నిర్లక్ష్యాన్ని కొనసాగించేందుకే నిర్ణయించుకున్నట్లు భావించాల్సి వస్తోందన్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details