తెలంగాణ

telangana

Dharani Portal News: ధరణి అమలెలా జరుగుతోంది? రెవెన్యూ ఆఫీసుల్లో అసలేం జరుగుతోంది?

By

Published : Oct 14, 2021, 9:54 AM IST

ధరణి.. సర్కారెంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం. తరాల తరబడి పేరుకుపోయిన భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన కార్యక్రమం. 'ఇక.. ప్రతి ఎకరాకూ లెక్క పక్కా..' అని కేసీఆర్ పూనిన సంకల్పం! కానీ.. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ధరణి అంటే అయోమయం.. గందరగోళం.. అనే పరిస్థితి నెలకొంది. రెవెన్యూ యంత్రాంగానికే అంతుపట్టని ఓ ఫసిల్​లా మారిపోయింది. ఖమ్మం జిల్లాలో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగే రైతులను చూస్తే.. ధరణి ఏమాత్రం ధరహాసం ప్రదర్శిస్తుందో ఇట్టే అర్థమైపోతోంది!

land-issues-piled-up-on-the-dharani-portal-in-khammam-district
land-issues-piled-up-on-the-dharani-portal-in-khammam-district

Dharani Portal News: ధరణి పోర్టల్‌లో కుప్పలుగా భూ సమస్యలు.. రెండేళ్లుగా రైతుల వెతలు

తెలంగాణలో భూ సమస్యలకు చెక్ పెట్టడంతోపాటు, ప్రతీ అంగుళం భూమి లెక్క పక్కాగా ఉండేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌కు శ్రీకారం చుట్టింది. రికార్డులు తారుమారుకు అవకాశం లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో రికార్డుల్లో అనేక తప్పులు దొర్లాయి. వాటిని సవరించే అధికారి జిల్లా స్థాయిలో కలెక్టర్‌కు సైతం లేనంతగా నిబంధనలు పొందుపరిచారు. జిల్లాల్లో సమస్యల ఆధారంగా ఆన్‌లైన్‌లో సవరణలకు ఐచ్చికాలు విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలో దాదాపు అన్ని మండలాల నుంచి భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వేలాది మంది రైతుల్లో కొంతమంది పట్టా భూములు నిషేధిత జాబితాలో చేరాయని, మరికొంతమంది తమ పట్టాదారు పాసు పుస్తకంలో పేర్లు తప్పుగా నమోదుకావడం, సర్వే నెంబర్ల తేడా, భూమి హెచ్చుతగ్గులకు సంబంధించి దరఖాస్తులు చేసుకున్నారు.

రికార్డులతో కుస్తీ

ధరణి పోర్టల్‌లో భూములకు సంబంధించి ఖమ్మం జిల్లాలో సుమారు 10 వేలకుపైనే దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా నిషేధిత భూముల జాబితాలోనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ కార్యాలయాల్లో కొన్ని రోజులుగా రికార్డుల పరిశీలన జోరుగా సాగుతోంది. రేయింబవళ్లు కార్యాలయాల్లోనే తిష్టవేసి రికార్డులతో కుస్తీ పడుతున్నారు.

నాకు వారసత్వంగా వచ్చిన భూమి.. 26 వ సర్వే భూమిలో 2 ఎకరాల 20 కుంటలు ఉంది. ధరణిలో ఎక్కి ఉంది. కేసీఆర్​ పాస్​ బుక్​ కూడా వచ్చింది. మొన్న చూసుకోగా.. ప్రోహిబిషన్​లో ఉందని తేలింది. నేను అధికారులను సంప్రదించగా.. అదంతా మాకు తెలియదు అంటున్నారు. ఇలాంటి సమస్య.. నాకు ఒక్కడికే కాదు.. చాలా మంది రైతులకు ఇలాంటి సమస్యే ఎదురవుతున్నాయి.

- ఓ రైతు

రైతుల తీవ్ర ఆందోళన

పట్టా భూములు నిషేధిత జాబితాలో చేరడం, మ్యూటేషన్లు కాకపోవడం, గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్ సంబంధింత సమస్యలు, వ్యవసాయ భూములు..వ్యవసాయేతర భూముల జాబితాలో నమోదుకావడం వంటి అనేక సమస్యలు వేలాది మంది రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల చేపట్టిన రికార్డుల ప్రక్షాళన త్వరలోనే పూర్తవుతుందని అన్నిరకాల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు అంటున్నారు. ధరణి పోర్టల్‌లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:Dharani portal problems: రిజిస్ట్రేషన్‌ పూర్తయినా హక్కుల చిక్కు

ABOUT THE AUTHOR

...view details