తెలంగాణ

telangana

మిర్చి రైతులకు సవాల్‌ విసురుతున్నతెగుళ్లు.. తోటలు దున్నేస్తున్న వైనం

By

Published : Nov 22, 2022, 3:42 PM IST

Chilli Farmers Problems: గతేడాది మిర్చి పంట మిగిల్చిన నష్టాల నుంచి ఈ సారైనా గట్టెక్కుదామని కోటి ఆశలతో సాగు చేసిన అన్నదాతలకు.. ఈ సారీ పరిస్థితులు పరీక్ష పెడుతున్నాయి. గతేడాది కోలుకోలేని దెబ్బతీసిన తెగుళ్లు.. ఈసారి పూత కాత దశలోనే వ్యాప్తి చెందటంతో పంట జీవం కోల్పోతోంది. గత సీజన్‌లో బెంబేలెత్తించిన తామర పురుగు తెగులుకు తోడు ఈసారి వేరుకుళ్లు సోకటంతో రైతులు హడలెత్తిపోతున్నారు. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో అలమటిస్తున్నారు.

Chilli Farmers
Chilli Farmers

మిర్చి రైతులను వెంటాడుతున్న కష్టాలు

Chilli Farmers Problems: ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ఖమ్మం జిల్లాలో 83 వేల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19 వేల 249 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. గతంతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో ఈసారి మిర్చి సాగు విస్తీర్ణం తక్కువే. గత సీజన్‌లోనే ఉమ్మడి జిల్లాలో 2 లక్షల ఎకరాల వరకు మిర్చి సాగైంది. అయితే గతేడాది తామర పురుగు ఉద్ధృతితో మిర్చి పైర్లు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. పంట ఏపుగా పెరిగి పూత కాత వచ్చిన తర్వాత తామరపురుగు దెబ్బకు ఎకరాకు 70 వేల వరకు పెట్టిన పెట్టుబడులన్నీ నష్టపోవాల్సి వచ్చింది.

దీంతో.. ఈ సీజన్‌లో మిర్చి సాగు వైపు అంతగా మొగ్గుచూపలేదు. ఉభ‍య జిల్లాల్లో సాగు సగానికి తగ్గింది. అయినా తెగుళ్ల దాడి తప్పడం లేదు. ప్రస్తుతం మిర్చి కాత, పూత దశలో ఉండగా... వివిధ రకాల తెగుళ్లు పైర్లపై మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. తామర పురుగు, వేరుకుళ్లు తెగుళ్లతో పైర్లన్నీ రంగుమారి పోతున్నాయి. మిర్చి సాగుకు అధికంగా పెట్టుబడి ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. ఎకరా సాగుకు 40 వేల నుంచి 70 వేల వరకు ఖర్చు చేస్తుంటారు. గతేడాది నుంచి మార్కెట్‌లో మిర్చికి డిమాండ్ ఉందన్న ఉద్దేశంతో గతేడాది నష్టాలు మిగిల్చినప్పటికీ ఈ సారి మళ్లీ మిరప సాగు చేశారు. ఆశించిన దిగుబడులు వస్తే గత నష్టాలు పూడ్చుకుని నిలదొక్కుకోవచ్చని భావించారు. కానీ.. మిర్చి సాగుదారులకు ఈ సారి మరిన్ని సవాళ్లు తప్పడం లేదు.

'రెండు నెలల క్రితం మిర్చి తోట వేశాం. ఇప్పుడు పంట కాపు టైంలో తెగులు వచ్చింది. మూడుసార్లు మందు పిచికారి చేశాం అయినా ఫలితం లేదు. ఎకరానికి రూ.50వేలు ఖర్చు అవుతుంది. పురుగు మందులకే డబ్బులు అధికంగా పెట్టాం. వేరు కుళ్లు వచ్చి వేర్లన్ని మాడిపోవడం. కాపు దశలో రావడంతో ఏం చేయలేకపోతున్నాం. పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం లేదు. మిర్చిని తీసి వేరే పంట వేసే పరిస్థితి లేదు. ఇప్పుడు వేరుకుళ్లు తెగులు వచ్చింది. తర్వాత చెట్లు ఎండిపోతున్నాయి. తామర పురుగు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఎండిపోయిన తర్వాత కాపు రాదు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలి.'-బాధిత మిర్చి రైతులు

గతంలో ఒక్క తామర పురుగుతోనే ఇబ్బందులు తలెత్తితే.. ఈ సారి వేరుకుళ్లు, ఇతర తెగుళ్లు పైర్లను ఆనవాళ్లు లేకుండా చేస్తున్నాయి. కాత, పూత దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వేలకు వేలు వెచ్చించి పురుగుమందులు పిచికారి చేస్తున్నా తెగుళ్ల ఉద్ధృతి తగ్గడం లేదు. దీంతోఇప్పటికే కొందరు రైతులు పంటపై ఆశలు వదులుకుని తోటలు దున్నేస్తున్నారు. ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. కష్టకాలంలో ఉన్న తమకు వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. సర్వే చేసి నష్టాలు అంచనా వేసి తగిన ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details