తెలంగాణ

telangana

Harish Rao: ఏడున్నరేళ్లు మంత్రిగా ఉండి ఏం చేశావ్​? ఈటలకు హరీశ్​ ప్రశ్న

By

Published : Aug 27, 2021, 9:43 AM IST

హుజూరాబాద్‌ ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలి అని ఈటల రాజేందర్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలో గురువారం తెరాస ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్​రావు పాల్గొన్నారు.

What did you do after being a minister for seven and a half years?
ఏడున్నరేళ్లు మంత్రిగా ఉండి ఏం చేశావ్​ ?

ఏడున్నరేళ్లు మంత్రిగా ఉండి సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేని ఈటల రాజేందర్​.. మళ్లీ గెలిస్తే ఏం చేస్తారని? అసలు రాజీనామా ఎందుకు చేశావు? అని మంత్రి హరీశ్​ రావు ప్రశ్నించారు. రైతులు, ప్రజలకు వ్యతిరేకంగా చట్టాలు చేసిన భాజపాలో చేరిన ఈటల ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలన్నారు. ఈటల తన బాధను ప్రపంచ బాధగా చిత్రీకరించి ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్​లో గెల్లు శ్రీనివాస్‌ గెలిస్తే నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని.. ఈటల గెలిస్తే ప్రతిపక్షంలో కూర్చోవడం తప్ప చేసేదేమి ఉండదని హరీశ్ రావు అన్నారు.

ఎంపీ సంజయ్‌ తీరు విడ్డూరం..

ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించే గొప్ప నేత సీఎం కేసీఆర్​.. కాబట్టి గెల్లు శ్రీనివాస్​ను గెలిపించి బహుమతిగా ఇద్దామని హరీష్‌ రావు పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్‌ అసహనంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. గెలిచి రెండు సంవత్సరాలైనా ఒక్క గ్రామంలో పైసా పని చేయని ఎంపీ బండి సంజయ్‌కుమార్‌... పాదయాత్ర చేస్తాననడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ఎల్‌ఐసీలను అమ్మడం తప్ప భాజపా చేసిందేమీ లేదని విమర్శించారు.

సచ్చేదిన్ వచ్చాయి

అమ్మకానికి పెట్టింది పేరు భాజపా అయితే.. నమ్మకానికి పెట్టింది పేరు తెరాస అని హరీశ్​ రావు చెప్పారు. భాజపా ప్రభుత్వంలో అచ్చేదిన్ కాదు.. సచ్చేదిన్ వచ్చాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప కేంద్రంలోని భాజపా ప్రభుత్వం చేసిందేమి లేదని పేర్కొన్నారు. చావు నోట్లో తలపెట్టి దిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్​ను బలపరిచేందుకు గెల్లు శ్రీనివాస్​ను గెలిపించాలని ఈ సందర్బంగా హరీశ్​ రావు కోరారు. ఈ సమావేశంలో హుజూరాబాద్‌ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.

ఏడున్నరేళ్లు మంత్రిగా ఉండి ఏం చేశావ్​ ?

ఇదీ చదవండి:BANDI SANJAY: 'తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగుతోంది'

ABOUT THE AUTHOR

...view details