తెలంగాణ

telangana

Huzurabad By Election 2021: హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్​ ప్రచారం లేనట్లే!

By

Published : Oct 27, 2021, 8:26 AM IST

హుజూరాబాద్ ఉపఎన్నికల(Huzurabad By Election 2021) నేపథ్యంలో నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం లేనట్లేనని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ తెలిపారు. ఈసీ నిర్ణయం వల్లే కేసీఆర్‌ సభ పెట్టలేకపోయామని వెల్లడించారు. హుజూరాబాద్‌లో చివరిరోజు ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తాలని, మరింత ఉత్సాహంతో పనిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ పార్టీ శ్రేణులకు సూచించారు.

Huzurabad By Election 2021, cm kcr campaign
హుజూరాబాద్‌లో సీఎం ప్రచారం,

హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల(Huzurabad By Election 2021) ప్రచారానికి తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెళ్లడం లేదు. ఈసీ నిబంధనల మేరకు బుధవారం రాత్రి ఏడు గంటల వరకు గడువుండగా ప్రచారంపై మంగళవారం రాత్రి వరకు నిర్ణయం వెలువడలేదు. కాగా కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల కారణంగానే తాము సీఎం కేసీఆర్‌ సభను నిర్వహించలేకపోయామని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ మంగళవారం రాత్రి తెలిపారు. ‘‘ఉప ఎన్నికల్లో వేయి మందితోనే హుజూరాబాద్‌లో ప్రచార సభ జరపాలనే ఈసీ నిబంధన ఆచరణ సాధ్యం కాదు. దీనికి ప్రత్యామ్నాయంగా పొరుగు జిల్లాలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో సభ పెట్టాలనుకున్నాం. భూమి చదును ప్రారంభించిన తర్వాత ఈసీ పొరుగు జిల్లాలనూ ఎన్నికల కోడ్‌ పరిధిలోకి తెచ్చింది. దీంతో అక్కడ సభ నిర్వహించడానికి వీలు కాలేదు’’ అని అన్నారు.

చివరి రోజు ప్రచారం హోరెత్తాలి: సీఎం కేసీఆర్‌

హుజూరాబాద్‌లో(Huzurabad By Election 2021) చివరిరోజు ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తాలని, మరింత ఉత్సాహంతో పనిచేయాలని ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతి ఒక్క ఓటరును కలిసి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి, పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు ఓటు వేసేలా అభ్యర్థించాలన్నారు. మంగళవారం ఆయన మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విప్‌ బాల్కసుమన్‌ తదితర నేతలతో టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చివరి రోజు మండలాల వారీగా అనుసరించాల్సిన వ్యూహాన్ని వివరించారు. బుధవారం తెల్లవారుజామున పార్టీనేతలతో మరోసారి టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామని సీఎం తెలిపారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కేసీఆర్‌ వర్తమానం.. కేటీఆర్‌ భవిష్యత్తు: శ్రీనివాస్‌గౌడ్‌

తెలంగాణ రాష్ట్ర సమితికి పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ వర్తమానంలో తిరుగులేని నేత అని, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు భవిష్యత్తు అని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి కేసీఆర్‌ లాంటి నాయకుడు తమకూ కావాలని ఆంధ్రప్రదేశ్‌ సహా అన్ని రాష్ట్రాల ప్రజలూ కోరుకుంటున్నారన్నారు. మంగళవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ ఆణిముత్యం లాంటి నేత అని, ఆయన సమర్థతను గుర్తించే ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఆ దేశానికి ఆహ్వానించిందన్నారు. హైదరాబాద్‌లో తెరాస ప్లీనరీ విజయవంతమైందని, పార్టీ మరో 25 ఏళ్లకు పైగా అధికారంలో ఉంటుందనే భరోసా కలిగిందన్నారు. ఇది ప్రతిపక్షాలకు కడుపుమంటగా మారి, తమ పార్టీపై అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details