ETV Bharat / state

ELECTION RECORD BREAK:హుజూరాబాద్‌ రికార్డులు.. భారీస్థాయిలో కేంద్ర బలగాలు..!

author img

By

Published : Oct 26, 2021, 5:17 AM IST

హుజూరాబాద్ ఉపఎన్నిక రాష్ట్రంలో ప్రభంజనం సృష్టిస్తోంది. రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. ఎన్నికల ఖర్చుతో మొదలుకొని ఓటర్లకు తాయిలాలు ఇవ్వడంలో సరికొత్త రికార్డు నమోదు చేసుకొంటోంది. భద్రత విషయంలోను ఈ నియోజకవర్గం ప్రత్యేక రికార్డు నెలకొల్పుతోంది.

Huzurabad by election breaks
హుజూరాబాద్‌ రికార్డులు

హుజూరాబాద్ ఎన్నికలు అన్నింటా రికార్డులు సృష్టిస్తోంది. ఎన్నికల ఖర్చుతో మొదలుకొని ఓటర్లకు తాయిలాలు ఇవ్వడంలో సరికొత్త రికార్డు నమోదు చేసుకొంటోంది. దాదాపు అయిదు నెలల 25 రోజులుగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది. పోలింగ్ పూర్తయ్యేనాటికి సరిగ్గా ఆరునెలల్లో ఒక నియోజకవర్గ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేసుకోవడం విశేషం కానుంది. దాదాపు ఐదున్నర నెలలకుపైగా ప్రచార హోరుతో దద్దరిల్లిన నియోజకవర్గంలో అన్ని వింతలే చోటు చేసుకుంటున్నాయి. ఇతర నియోజకవర్గాలకు చెందిన అయిదుగురు మంత్రులు.. పది మంది ఎమ్మెల్యేలు పూర్తిగా బాధ్యత తీసుకొని అభివృద్ది పనులు చేపట్టడంతో పాటు ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. భద్రత విషయంలోను ఈ నియోజకవర్గానికి ప్రత్యేక రికార్డు నెలకొల్పుతోంది. సాధారణ ఎన్నికల బందోబస్తుకు మించి ఇక్కడ పారా మిలటరీ బలగాలను మోహరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 నియోజకవర్గాల్లో ఎన్నికల బందోబస్తు కోసం 17 కంపెనీల బలగాలు మాత్రమే వినియోగిస్తే హుజురాబాద్ ఉప ఎన్నికల నిర్వాహణకు మాత్రం 20 కంపెనీల బలగాలను ఎన్నికల కమిషన్‌ పంపించింది. 13 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల కోసం మోహరించిన పారా మిలటరీ బలగాల కన్నా అదనంగా 3 ప్లాటూన్లు హుజురాబాద్‌కు రావడం సరికొత్త రికార్డు నెలకొల్పింది.

మావోయిస్టుల కాలంలో కన్నా అధికం

మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న సమయంలో కూడా ఇంత పెద్ద ఎత్తున బలగాలు మోహరించినట్టు లేదన్న చర్చ జరుగుతోంది. గతంలో పీపుల్స్ వార్, జనశక్తి నక్సల్స్‌కు పట్టున్న నియోజకవర్గాల్లో వారిని ఏరివేసేందుకు ప్రత్యేకంగా పారా మిలటరీ బలగాలు ఉండేవి. ఎన్నికల సమయంలో వీరితో పాటు అదనంగా మరికొన్ని కంపెనీలను రంగంలోకి దిగేవి. పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయని భావించి అదనపు బలగాలను రప్పించే వారు. నక్సల్స్‌కు పట్టున్న సమయంలో 1989, 1994, 1999లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా కేవలం ఎన్నికల నిర్వహణ కోసమే ఈ స్థాయిలో బలగాలను దింపిన దాఖలాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికలు సాఫీగా జరిపేందుకు ఒక్క నియోజకవర్గానికే 20 కంపెనీల పారా మిలటరీ బలగాలను దింపడం రికార్డేనని చెప్పాలి. ఇది హుజురాబాద్ ఉప ఎన్నికల్లోనే జరగడం సరికొత్త రికార్డుగా నిలుస్తోంది.


ఎన్నికల నియమావళిలోనూ సరికొత్త రికార్డు

హుజూరాబాద్ ఉప పోరులో ఎన్నికల నియమావళిలోను పలుసార్లు మార్పులు చేర్పులు చేపట్టింది. గతంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల వేళ కరోనా విజృంభించిన నేపధ్యంలో అనేక జాగ్రత్తలు తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనితో ఎన్నికల నియమావళిలోను పలుసార్లు అనేక మార్పులు చేర్పులు చేశారు. కరోనా విజృంభించకుండా మొదటి నుంచి కూడా ఎన్నికల కమిషన్‌ కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటోంది. అయితే వివిధ రాజకీయ పార్టీలు నిబంధనలు అమలుచేసినా స్పూర్తిని మాత్రం కొనసాగించలేదు. దీంతో ఎన్నికల కమిషన్‌ పలుసార్లు నియమాలలో మార్పులు చేర్పులు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు టీకాలు పూర్తి చేసిన వారికి మాత్రమే నామినేషన్ వేయాలనే నిబంధనల నుంచి మొదలుకొని ప్రచారంలోను అనేక మార్పులు తీసుకొచ్చింది. మాస్కులు ధరించాలని, ప్రచార తారలు పాల్గొనే సమావేశాలకు 1000 మందికి మించి హాజరు కారాదని, బహిరంగ సమావేశాలకు కూడా అనేక మార్గదర్శకాలను రూపొందించి కఠినంగా అమలు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రమే రోడ్‌షో, బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించింది. అంతేకాకుండా ప్రచార సమయాన్ని కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకేనంటూ మార్పులు తీసుకొచ్చింది.

స్పూర్తిని దెబ్బతీసినందుకు మరోసారి ఆంక్షలు

ప్రజలు పెద్దెత్తున ఒకే చోట గుమిగూడితే కరోనా విజృంభించే అకావశం ఉందన్న ఉద్దేశ్యంతో నియోజక వర్గ పరిధిలో సభలపై ఎన్నికల కమిషన్‌ ఆంక్షలు విధించింది. అయినప్పటికి పలు ప్రాంతాల్లో సమావేశాలు యథావిధిగా సాగాయి. మరోవైపు ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గానికి సమీపంలో ఆత్మీయ సమ్మేళనాలు, సభలు నిర్వహించడం వివిధ ప్రాంతాల నుంచి జనాలను తరలించడం కొనసాగింది. దీంతో ఎన్నికల నియమావళి స్పూర్తికి విఘాతం కలిగే ఆస్కారం ఏర్పడింది. తొలుత ఒకే పార్టీ ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినా ఎన్నికలు సమీపించే కొద్ది ఇతర పార్టీలు కూడా ఇలాంటి సన్నాహాలు చేస్తుండటంతో ఎన్నికల కమిషన్ తాజా నియమావళి విడుదల చేసింది. గతంలో కేవలం ఎన్నికలు నిబంధనలు జరుగుతున్న నియోజవర్గానికే పరిమితం చేసిన ఎన్నికల కమిషన్‌ మరోసారి మార్పులు చేస్తూ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. కరీంనగర్ జిల్లాతో పాటు ఇరుగుపొరుగు జిల్లాలోను నిబంధనలు అమల్లో ఉంటాయని తేల్చి చెప్పింది. అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకంపై కూడా ఆంక్షలు విధించింది.

పోటాపోటీ ఫిర్యాదులతో అప్రమత్తం..

కేంద్రంలో ఉన్న భాజపా రాష్ట్రంలో ఉన్న తెరాస రెండు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లనే అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు భావిస్తున్నారు.ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఓటు కీలకం కావడంతో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఐదు నెలలకు పైగా సాగిన ప్రచార పర్వంలో రాజకీయ పార్టీలు వ్యవహరించిన తీరు ప్రచ్ఛన్న యుద్ధాన్నే తలపించింది. ఎవరి ఉనికిని వారు కాపాడుకునే ప్రయత్నంలో ప్రత్యర్థి పార్టీల కదలికలకు బ్రేకులు వేయాలని ఉబలాటపడ్డాయి. ఈ క్రమంలో కొన్నిసంఘటనలు చోటుచేసుకున్నాయి.ఫిర్యాదుల పరంపరలో జమ్మికుంట సీఐ రాంచదర్‌రావుపై బదిలీ వేటు పడింది.

ఇదీ చూడండి:

Huzurabad constituency Voters 2021 : అంతుచిక్కని ఓటరు ఆంతర్యం.. అంతర్మథనంలో అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.