తెలంగాణ

telangana

Huzurabad by-Election: పార్టీ ఏదైనా.. ఓటర్ల మొగ్గు ఈటల వైపే..

By

Published : Nov 3, 2021, 6:53 AM IST

హుజురాబాద్ ఉపఎన్నిక.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరుగా సాగింది. ధాన్యం కొనుగోళ్లు, పెట్రో ధరల పెరుగుదల అంశాలే ప్రధానాస్త్రాలుగా మలచుకున్నాయి. రెండు అంశాల్లోనూ పరస్పర విమర్శలతో ఉపఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించారు. సవాళ్లు-ప్రతిసవాళ్లు చేసుకున్న నేతలు మీరంటే మీరే కారణమని దుయ్యబట్టుకున్నారు. హోరాహోరీగా సాగిన ఈ రేసులో కమలం విజయపథంలో దూసుకెళ్లింది.

Huzurabad by-Election
ఈటల రాజేందర్

హుజురాబాద్ పోరులో ఎక్కువగా వినిపించింది గ్యాస్‌ సిలిండర్‌, పెట్రో ధరల పెంపు అంశాలే. సిలిండర్‌ సబ్సిడీని కేంద్రం క్రమంగా ఎత్తివేయడం.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. బండ వెయ్యి దాటి సామాన్యునికి గుదిబండగా మారిందని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఓటు వేసే ముందు సిలిండర్‌కు దండం పెట్టాలని సూచించారు. గ్యాస్‌ సిలిండర్‌తో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పెట్రో ధరలు, గ్యాస్‌ సిలిండర్‌ భారంలో రాష్ట్ర ప్రభుత్వమూ భాగస్వామేనని భాజపా తిప్పికొట్టింది. సిలిండర్‌లో రాష్ట్ర ప్రభుత్వ పన్నే అధికమని ఈటల రాజేందర్‌ తిప్పికొట్టారు. పెట్రోల్‌పై పన్నులు రాష్ట్రప్రభుత్వం తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని ఎదురుదాడికి దిగారు.

వరిసాగు, ధాన్యం కొనుగోళ్ల అంశాలుభాజపా-తెరాస మధ్య తారాస్థాయి విమర్శలకు దారితీశాయి. రెండు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతుండగానే సిద్దిపేట కలెక్టర్‌ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసేలా చేశాయి. వరి విత్తనాలు విక్రయించవద్దంటూ వ్యాపారులను కలెక్టర్‌ హెచ్చరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కలెక్టర్‌ వ్యాఖ్యలను అస్త్రంగా మార్చుకున్న భాజపా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇది కాస్తా భాజపా-తెరాస ప్రచారాస్త్రాలుగా మారాయి.

కేంద్రం ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పిందని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అందుకే ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకోవాలని చెబుతున్నామని తెలిపింది. వరివేస్తే ఉరే అని సర్కార్‌ ఎలా అంటుందని భాజపా గళమెత్తింది. ఇదే అంశాన్ని ప్రశ్నిస్తూ బండి సంజయ్‌ దీక్షకు దిగారు. ఉప్పుడు బియ్యం మినహా ధాన్యం కొనుగోలు చేయబోమని ఎక్కడే చెప్పలేదన్నారు. సంజయ్‌ దీక్షను ఎద్దేవా చేస్తూ మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయిస్తామనే హామీ తీసుకురావాలని సూచించారు. లేదంటే పదవులకు రాజీనామా చేయాలని సవాల్‌ చేశారు. కేంద్రం ధాన్యం కొనకపోయినా ప్రతీగింజా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నదాతలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. హోరాహోరీగా సాగిన రేసులో కారు వెనకపడిపోయింది. తెరాసను విడిచి.. భాజపా నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్​ వైపే ప్రజలు మొగ్గు చూపారు. సిలిండర్, పెట్రో రేట్లతో ప్రచారం చేసిన తెరాస.. విజయాన్ని అందుకోలేకపోయింది.

ఇదీ చూడండి:వేడెక్కిన 'వరి' రాజకీయం... భాజపా, తెరాస సవాళ్లు, ప్రతి సవాళ్లు!

ABOUT THE AUTHOR

...view details