తెలంగాణ

telangana

Crops Damage : వాన దంచికొట్టింది.. కష్టమంతా కొట్టుకుపోయింది

By

Published : May 2, 2023, 11:22 AM IST

Crops Damage in karimnagar : యాసంగిని పగబట్టినట్లు ప్రకృతి వ్యవహరిస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈదురుగాలులు, వడగండ్లు కర్షకులను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు భారీగానే ప్రారంభించినా.. కొనుగోళ్లు మాత్రం మందకొడిగా సాగడంతో కర్షకులకు కష్టాలు తప్పడం లేదు.

Crops Damged
Crops Damged

అకాల వర్షాలకు.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం

Crops Damage in karimnagar : అకాల వర్షాలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అతలాకుతలం అయింది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో పాటు వడగండ్ల వాన సృష్టించిన బీభత్సం అంతా ఇంతాకాదు. మొన్నటికి మొన్న కురిసిన వర్షంతో వరి నేలకొరగగా.. ఎండ కొడితే కొద్దోగొప్పో వడ్లుచేతికి వస్తాయని ఆశించిన రైతులను.. మరోసారి కురిసిన వాన అతలాకుతలం చేసింది. నేల కొరిగిన పొలాల్లోకి.. వర్షపునీరు చేరడంతో పంట మునిగిపోతోంది. అమ్మకం కోసం తెచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో.. కాంటాల్లోకి చేరకుండా వర్షపు నీరుతో కొట్టుకుపోతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా నత్తనడకన కాంఠాలు సాగుతుండుటంతో అన్నదాతలకు కష్టాలు తప్పట్లేదు.

ఆరబోసిన ధాన్యం వరుణుడి పాలు: జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మారం, బుగ్గారం, వెలగటూరుతో పాటు.. పలు మండలాల్లో ధాన్యం ఆరబోసేందుకు సరైన స్థలం లేకపోవడంతో రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ల లేకపోవడం వల్ల ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుంది. ఇంటిల్లిపాది అక్కడే పనిచేయాల్సి వస్తోందని వాపోతున్నారు. పెద్దపల్లి జిల్లా మార్కెట్‌ యార్డుల్లో వర్షం కురుస్తుంటే కప్పుకోవడానికి కనీసం టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి ధాన్యం కొట్టుకుపోతుంటే నీళ్లలో నుంచి తీసి ఆరబెట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు వాపోతున్నారు.

ప్రతిపక్షాలు అలా.. అధికార పక్షం ఇలా:కొనుగోలు కేంద్రాల్లో ఎనలేని నిర్లక్ష్యం కనిపిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆర్భాటంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడమే తప్ప.. కాంటాలు ప్రారంభించట్లేదని మండిపడుతున్నాయి. ఒకేసారి రైతులంతా ధాన్యం తెచ్చినందు వల్లే టార్పాలిన్లు సరఫరా చేయలేక పోతున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం నిబంధనలు సడలిస్తే ధాన్యం కొనుగోలుకు సిద్ధమని స్పష్టంచేశారు.

కరీంనగర్‌ జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలను.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సందర్శించారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలో ఐకేపీ సెంటర్లని పరిశీలించి రైతులతో మాట్లాడారు. నెలరోజుల కిందటే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తే.. ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. ఇప్పుడు రైతుల పరిస్థితి చూస్తే కన్నీరు వస్తోందని ఆవేదన చెందారు. తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

"కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించినప్పుడే.. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేయడానికి అవకాశం ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతును ఆదుకోవాలని సంకల్పం ఉంటే ఈ నిబంధనలను సడలిస్తారు. లేకపోతే రైతు పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వమే పట్టించుకోవాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టం కింద రూ. 10000లను అందిస్తోంది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా రూ. 10000 సాయం చేస్తే రైతుకు మేలే కదా." - దాసరి మనోహర్‌రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details