తెలంగాణ

telangana

Kaleshwaram: కాళేశ్వరం పుష్కర ఘాట్లను తాకిన గోదావరి పరవళ్లు

By

Published : Jun 17, 2021, 3:59 PM IST

Updated : Jun 17, 2021, 6:44 PM IST

మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి జలకళ సంతరించుకుంది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీరాంసాగర్‌ జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాణహితకు ప్రవాహ ఉద్ధృతితో...కాళేశ్వరం బ్యారేజీల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

triveni sanghamam
కాళేశ్వరం త్రివేణి సంగమం పుష్కర ఘాట్లను తాకిన ప్రవాహం

కాళేశ్వరం త్రివేణి సంగమం పుష్కర ఘాట్లను తాకిన ప్రవాహం

గోదారిలో గంగమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలో జోరుగా కురుస్తున్న వర్షాలతో వరద దిగువకు వస్తోంది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో ఎస్సారెస్పీ జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శ్రీరాంసాగర్ జలాశయంలో ప్రస్తుతం 20 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉంది.

త్రివేణి సంగమం వద్ద జలకళ

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలతో... కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నీటి ప్రవాహం పుష్కర ఘాట్లను తాకి ప్రవహిస్తోంది. వర్షాలు, వరదలతో 5.54 మీటర్ల మేర నీటిమట్టం పెరిగింది. వర్షాకాలం ప్రారంభంలోనే త్రివేణి సంగమం వద్ద జలకళతో సందడి నెలకొంది.

కాళేశ్వరంలో ఎత్తిపోత ప్రారంభం

మేడిగడ్డ బ్యారేజీకి వరద కొనసాగుతోంది. 16.17 టీఎంసీలకుగాను 7.5 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. రెండ్రోజుల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో కాళేశ్వరంలో నీటి ఎత్తిపోత ప్రారంభమైంది. వానాకాలం ప్రారంభంలోనే నీటిని తరలించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు. కన్నెపల్లి వద్ద ఉన్న లక్ష్మీ పంపుహౌస్‌లోని 17 మోటార్లకుగాను 1, 2, 5, 7 నంబరు మోటార్లను ప్రారంభించారు. 8 పంపుల ద్వారా ఎత్తిపోస్తున్న నీరు...అన్నారం బ్యారేజీకి తరలుతోంది.

మధ్యమానేరుకు జలాలు

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుంచి రెండు బాహుబలి పంపులతో 6000 క్యూసెక్కుల జలాలను ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం.. అక్కడి నుంచి అండర్‌ గ్రౌండ్‌ టన్నెళ్ల ద్వారా గాయత్రి పంప్‌హౌజ్‌కు జలాలు చేరుకుంటున్నాయి. మధ్య మానేరు ప్రాజెక్టు నిల్వ జలాలు కనిష్ఠ స్థాయికి చేరడంతో లక్ష్మీపూర్‌ వద్ద ఉన్న గాయత్రి పంప్‌ హౌజ్‌ నుంచి మొదటి, మూడో బాహుబలి పంపుసెట్లతో ఎత్తిపోతలు చేపట్టారు. ఇక్కడి నుంచి ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా మధ్య మానేరు ప్రాజెక్టుకు ఎత్తిపోతల జలాలు తరలిస్తున్నారు.

ఇదీ చదవండి: Yadadri Temple: అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు ఖర్చు... మరో 200 కోట్లు అవసరం!

Last Updated : Jun 17, 2021, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details