తెలంగాణ

telangana

మైనార్టీ గురుకులాల్లో డీఎల్సీల తొలగింపు

By

Published : Dec 4, 2020, 7:47 PM IST

మైనార్టీ గురుకులాల్లో ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన నియమించిన డీఎల్సీలను తొలగించి నూతన నిర్ణయాలను తీసుకుంది.

removal-of-dlcs-in-minority-gurukuls-in-karimnagar-district
మైనార్టీ గురుకులాల్లో డీఎల్సీల తొలగింపు

మైనార్టీ గురుకులాల్లో ఎట్టకేలకు ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన నియమించిన డీఎల్సీ (జిల్లా స్థాయి సమన్వయకర్త)లను తొలగించడంతోపాటు, పలు నిర్ణయాలను తీసుకుంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 19 మైనార్టీ గురుకులాలుండగా, 7 వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో మైనార్టీ గురుకులాలు మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల (బాలుర), జగిత్యాల (బాలికలు), ధర్మపురి గురుకులాలున్నాయి.

2017లో ఈ గురుకులాలను ఏర్పాటు చేయగా, ఆర్‌ఎల్‌సీ (రీజనల్‌ లెవల్‌ కో - ఆర్డినేటర్‌) ఆధ్వర్యంలో నడిచేలా ఏర్పాటు చేశారు. 2018-19లో ఆర్‌ఎల్‌సీలను తొలగించి ఆ స్థానంలో జిల్లాకు ఒకరు చొప్పున డీఎల్సీ (డిస్ట్రిక్టు లెవల్‌ కోఆర్డినేటర్‌)లను నియమించారు. అప్పటి నుంచి ఇదే పద్ధతి కొనసాగుతోంది.

ఈ క్రమంలో డీఎల్సీలుగా విశ్రాంత ఉద్యోగులు, ఇతరత్రా వారిని నియమించగా, తాత్కాలిక ఉద్యోగ నియామకాల్లో, తొలగింపుల్లో నిబంధనలకు తిలోదకాలిచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పాటు నూతన నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవలకు పాల్పడుతున్నట్లు ఉన్నతాధికారులకు, సంబంధిత మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి.

దీంతో మైనార్టీ గురుకులాల ఉన్నతాధికారులతో సమీక్ష చేసి, సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా డీఎల్సీలను తొలగించారు. వీరి స్థానంలో రెండు జిల్లాలకు ఒకరు చొప్పున ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జగిత్యాల, సిరిసిల్లకు ఒకరిని, కరీంనగర్‌, పెద్దపల్లిలకు ఒకరిని మొత్తం ఇద్దరిని నియమించారు.

నూతనంగా నియామకమైన లెక్చరర్లకు రీజనల్‌ కో ఆర్డినేటర్ల బాధ్యతలను అప్పగించారు. దీంతో పాటు విజిలెన్స్‌ బృందానికి కూడా త్వరలో మంగళం పాడే వీలుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్సీలుగా నూతనంగా నియమితులైన జెఎల్‌లను నియమించగా, వారికి పరిపాలన, నియమ నిబంధనలు, విధి విధానాలు త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి :కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య వివాదం

ABOUT THE AUTHOR

...view details