తెలంగాణ

telangana

ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్‌ భూముల అమ్మకం!

By

Published : Jun 23, 2021, 4:50 AM IST

ఖాదీ వస్త్రాలకు డిమాండ్ తగ్గిందంటూ సంస్థకు చెందిన విలువైన భూముల విక్రయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లు విలువ చేసే భూములు గుట్టుచప్పుడు కాకుండా పాలకుల సన్నిహితులు కొనేందుకు పావులు కదిపారని విమర్శలొస్తున్నాయి. జగిత్యాల జిల్లా పూడూరు ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్‌ భూములు.. లీజుకు ఇస్తామని నమ్మించి తక్కువ ధరకు విక్రయించారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే వాటి రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

khadi p
ఖాదీ

కరీంనగర్-జగిత్యాల మార్గమధ్యలో పూడూరులోని ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్ భూములు గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు 12కోట్లు విలువైన ఎకరన్నర భూమిని బహిరంగ వేలం వేయకుండా... ఏకపక్షంగా కోటీ 30లక్షలకు విక్రయించారని కార్మికులు చెబుతున్నారు. కార్మికులు సంస్థ నుంచి నూలు ఇతరత్రా సామగ్రి తీసుకెళ్లి వస్త్రాలను తయారు చేసేవారు. కాలక్రమేణ కార్మికుల సంఖ్య తగ్గుతూ రాగా.... డిమాండ్‌కు అనుగుణంగా పవర్‌లూమ్స్‌ ఏర్పాటు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాలకులు పట్టించుకోకపోగా... విలువైన భూములపై దృష్టిసారించారని కార్మికులు విమర్శించారు. 2020 అక్టోబర్ 4వ తేదీన సంస్థకు సంబంధించిన 57గుంటల స్థలం విక్రయించే హక్కును.... కార్యదర్శికి అప్పగిస్తున్నట్లు ఛైర్మన్‌ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఆదేశాలిచ్చారు. వాస్తవానికి భూములు లీజుకు ఇస్తామని చెప్పి విక్రయించారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆదుకోవాలంటూ కార్మికుల ఆవేదన

సిరిసిల్లలో చేనేత కార్మికులు పవర్‌లూం ఏర్పాటు చేసుకొని యజమానులుగా మారుతున్నారు. తమను కూడా ఆదుకోవాలంటూ పూడూరు చేనేత కార్మికులు ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించారు. కార్మికుల గోడును పట్టించుకోని అధికారులు.... ప్రధాన రహదారి వెంట ఉన్న భూములను విక్రయించేందుకు పూనుకున్నారని వాపోయారు. మొత్తం 6 వేల 897 చదరపు గజాలు స్థలాన్ని పాలకుల సన్నిహితులకు అమ్మారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఈ వృత్తిపై ఆధారపడ్డ తమ పరిస్థితేంటని వాపోతున్నారు.

అమ్మకాలు తక్షణమే రద్దు చేయాలి

ఖాదీ గ్రామోద్యోగ్‌కు చెందిన భూముల అమ్మకాలు తక్షణమే రద్దు చేయాలని చేనేత కార్మికులు డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు మెట్‌పల్లి ఖాదీ ఛైర్మన్‌ విద్యాసాగర్‌ రావుకు వినతిపత్రం అందించారు.

ఇదీ చదవండి:'ప్రతిపక్షాల భేటీలో థర్డ్ ఫ్రంట్​పై చర్చించలే'

ABOUT THE AUTHOR

...view details