తెలంగాణ

telangana

TSLPRB: పోలీస్‌ అభ్యర్థులకు అలర్ట్​... అమల్లోకి కొత్త విధానం

By

Published : Dec 3, 2022, 7:41 AM IST

TSLPRB New Decision: ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియామక ప్రక్రియలో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈవెంట్స్​లో ఒక అంశంలో ఉత్తీర్ణులైతేనే మరో దానికి.. అవకాశం ఇవ్వనుంది. తొలుత పరుగుపందెంలో ఉత్తీర్ణులైతేనే శారీరక కొలతల అంకానికి అనుమతించనున్నారు. తొలిసారిగా టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఈ వడబోత ప్రక్రియను చేపట్టనుంది.

TSLPRB
TSLPRB

TSLPRB New Decision: ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియామక ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఈసారి కీలకమైన అంశాల(ఈవెంట్స్‌) నిర్వహణలో వడబోత విధానం అమలు చేయబోతోంది. గతంలోలా అన్నింటిలో పాల్గొనే అవకాశమిచ్చేందుకు బదులు ఈసారి వడబోతను అనుసరించబోతోంది. ఈనెల 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 12 వేదికల్లో ఈవెంట్లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

వీటిలో తొలుత పరుగుపందెం నిర్వహించనున్నారు. పురుషులు 1,600 మీటర్లు, మహిళలు 800 మీటర్ల పరుగును నిర్ణీత కాలంలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ, ఇందులో గట్టెక్కలేకపోతే ఇక వెనుదిరగాల్సిందే. తదుపరి పోటీలకు అవకాశం లభించదు. గతంలో ఇలా ఉండేది కాదు.. అప్పట్లో తొలుత అభ్యర్థుల శారీరక కొలతల్ని తీసుకునేవారు. పురుష అభ్యర్థుల ఎత్తు, ఛాతీ కొలతలు.. మహిళా అభ్యర్థుల ఎత్తును పరిగణనలోకి తీసుకునేవారు. అవి నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే తదుపరి ఈవెంట్లలో పాల్గొనేందుకు అనుమతించేవారు.

కొలతల్లో అర్హత పొందిన పురుష అభ్యర్థులు 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌, హైజంప్‌, 800 మీటర్ల పరుగు పోటీల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేవారు. ఈ క్రమంలో మొదటి పోటీలో అర్హత సాధించకపోయినా తదుపరి పోటీలకు అనుమతించేవారు. చివరకు అయిదు ఈవెంట్లలో ఏవేని మూడింటిలో ఉత్తీర్ణులైతే సరిపోయేది. అలాగే మహిళా అభ్యర్థులు 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ అంశాల్లో పాల్గొనేవారు. ఏవేని రెండింటిలో అర్హత సాధిస్తే ఉత్తీర్ణులైనట్లు పరిగణించేవారు.

ఈసారి మాత్రం తొలుత పరుగుపందెంలో ఉత్తీర్ణులైతేనే శారీరక కొలతల అంకానికి అనుమతించనున్నారు. అవి కూడా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ పోటీలకు అర్హత దక్కుతుంది. అనంతరం ఈ రెండు ఈవెంట్లను విజయవంతంగా పూర్తి చేయగలిగితేనే తుది రాతపరీక్షకు అవకాశం ఉండనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తొలుత పరుగు పోటీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరమేర్పడింది.

మండలికి తగ్గిన కసరత్తు:నియామక మండలి చేసే కసరత్తు తాజా నిర్ణయంతో చాలావరకు తగ్గనుంది. గతంలో అయితే శారీరక కొలతల్లో అర్హులందరికీ 5 ఈవెంట్లను నిర్వహించాల్సి వచ్చేది. ఈసారి తొలుత పరుగుపందెం పోటీలు జరగనుండటంతో అక్కడే పలువురు అభ్యర్థుల వడబోతకు అవకాశం ఏర్పడింది. అలాగే శారీరక కొలతల రూపేణా మరింత శ్రమను తగ్గించేందుకు వెసులుబాటు లభించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గతంలో ప్రతీ పురుష అభ్యర్థి ఛాతి కొలతల్ని తీసుకోవాల్సివచ్చేది. ఈసారి దాన్ని తొలగించడమూ శ్రమ తగ్గే కారణాల్లో ఒకటిగా నిలిచింది.

ఇవీ చదవండి:దిల్లీ లిక్కర్​ స్కామ్​.. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు

మోదీ ఇంట కమలానికి పరీక్ష.. 2017లో అవమానం.. తర్వాత ఊరట.. మరి ఈసారి?

ABOUT THE AUTHOR

...view details