తెలంగాణ

telangana

Governor Delhi Tour: నేడు అమిత్​షాతో గవర్నర్ భేటీ.. ఆ అంశాలు చర్చించే అవకాశం..!

By

Published : Apr 5, 2022, 10:42 PM IST

Updated : Apr 6, 2022, 3:11 AM IST

Governor Delhi Tour: రాష్ట్ర గవర్నర్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిల్లీ వెళ్లారు. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తమిళిసై దిల్లీ పర్యటన చర్చనీయాంశమైంది.

Governor Delhi Tour
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

Governor Delhi Tour: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అత్యవసరంగా దిల్లీ పర్యటనకు వెళ్లారు. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ కానున్నారు. హోంశాఖ పిలుపు మేరకే గవర్నర్ దిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో గవర్నర్ పర్యటన చర్చనీయాంశమైంది. షెడ్యూల్ ప్రకారం తమిళిసై సోమవారం రాత్రి దిల్లీకి బయలుదేరాల్సి ఉండగా పర్యటన రద్దయింది.

కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఉదంతం మొదలు మండలి ప్రొటెం ఛైర్మన్ నియామకం సహా ఇతరత్రా పరిణామాల నేపథ్యంలో రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య అంతరం బాగా పెరిగింది. రాజ్​భవన్​లో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి సహా మంత్రులు హాజరు కాలేదు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా తన ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్ భవన్​లో జరిగిన ముందస్తు వేడుకలకు సీఎం, మంత్రులతో పాటు తెరాస నేతలు, ఉన్నతాధికారులు హాజరు కాకపోవడం పలు చర్చలకు దారితీసింది.

సమ్మక్క-సారలమ్మ జాతర, హన్మకొండ, యాదాద్రి పర్యటనల సందర్భంగా అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంతో విమర్శలు వచ్చాయి. వీటన్నింటితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దిల్లీలో ఉన్నప్పుడే గవర్నర్ తమిళిసై హస్తినకు వెళ్లడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపైనా గవర్నర్​తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పరిస్థితులను కేంద్ర హోంమంత్రికి తమిళిసై వివరించనున్నారు. దిల్లీలో ఇతరులను కూడా గవర్నర్ కలిసే అవకాశముందంటున్నారు.

ఇదీ చూడండి:గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ దిల్లీ పర్యటన రద్దు

Last Updated : Apr 6, 2022, 3:11 AM IST

ABOUT THE AUTHOR

...view details