తెలంగాణ

telangana

Regulation of public places: ఆక్రమణల్లోని ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ.. ఇదే లాస్ట్​ ఛాన్స్​

By

Published : Feb 15, 2022, 5:14 AM IST

Regulation of public places: ఆదాయం పెంచుకునే మార్గాలను రాష్ట్రప్రభుత్వం వేగవంతం చేసింది. ఇటీవలే ఆస్తుల మార్కెట్ విలువలు పెంచిన సర్కార్.. ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ కోసం మరోమారు దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది. భూముల అమ్మకం ప్రక్రియ కొనసాగిస్తున్న ప్రభుత్వం.. గనుల లీజు, ఇసుక రీచుల ద్వారా మరింత ఆదాయం వచ్చేలా గనుల శాఖలో త్వరలో సంస్కరణలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.

ఆక్రమణల్లోని ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ.. ఇదే లాస్ట్​ ఛాన్స్​
ఆక్రమణల్లోని ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ.. ఇదే లాస్ట్​ ఛాన్స్​

Regulation of public places: ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నిర్మాణాలు చేసుకుని ఉంటే వారికి ఆ భూమిని క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జీవో ఎం.ఎస్‌. నం.14ను జారీ చేసింది. ఇంతకుముందు క్రమబద్ధీకరణ ప్రక్రియ నిర్వహించిన జీవో ఎంఎస్‌ నం.58, 59లలో పేర్కొన్న నిబంధనలనే అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను పేదలకే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించి దానికి అనుగుణంగా పురపాలక మంత్రి కె.టి.రామారావు నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉప సంఘం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. ఇంతకుముందు 2014లో 125 గజాల లోపు విస్తీర్ణం ఉన్నవి 91,639 దరఖాస్తులు, 125 గజాలకు పైన విస్తీర్ణానికి సంబంధించి 17,065 దరఖాస్తులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. భూమిని క్రమబద్ధీకరించుకునేందుకు ఆక్రమణదారులు ఈ నెల 21 నుంచి మార్చి 31లోపు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూములను ఆక్రమించినవారికి ఇదే చివరి అవకాశమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

రాష్ట్ర ఆవిర్భావానికన్నా ముందున్న వారికే..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీ 2014 జూన్‌ 2కు ముందు ఆ స్థలంలో నివాసం ఉన్నవారికే మాత్రమే ఈ క్రమబద్ధీకరణలో అవకాశం కల్పించనున్నారు. మొదటిదశ క్రమబద్ధీకరణ సందర్భంగా జారీ చేసిన జీవోలు ఎంఎస్‌.నెం.58, 59లలోని నిబంధనలనే ఇప్పుడూ అమలు చేయనున్నారు.
* ఆక్రమిత స్థలంలో నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్నట్లు ఆధారాలు చూపాలి.
* వ్యక్తిగత ధ్రువీకరణకు ఆధార్‌కార్డుతోపాటు ఇతర ధ్రువీకరణలు సమర్పించాలి.
* ఆక్రమిత స్థలంలో నివాసం ఉన్నట్లు ధ్రువీకరించేందుకు రిజిస్టర్‌ డాక్యుమెంట్‌, ఆస్తి పన్ను రసీదు, విద్యుత్‌ బిల్లు, నల్లా బిల్లు లేదా ఇతర ఆధారాలు సమర్పించాలి.
* దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న పేదలకు 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు.
* ఆపై నిర్మాణాలు ఉన్న ఆక్రమణ స్థలాలకు రిజిస్ట్రేషన్‌ ధరల్లో 50 నుంచి వంద శాతం వరకు వసూలు చేస్తారు.
* 250 గజాల వరకు రిజిస్ట్రేషన్‌ ధరలో 50 శాతం చెల్లించాల్సి ఉంటుంది.
* 500 గజాల వరకూ స్థలంలో నివాసం ఉండి ఉంటే రిజిస్ట్రేషన్‌ ధరలో 75 శాతం చెల్లించాలి
* 500 గజాలు పైన ఉన్న స్థలంలో నివాసం ఏర్పరుచుకుని ఉంటే 100 శాతం రిజిస్ట్రేషన్‌ ధర చెల్లించాల్సి ఉంటుంది.
* వాణిజ్య అవసరాల కోసం వాడుకునే స్థలం పరిమాణంతో నిమిత్తం లేకుండా రిజిస్ట్రేషన్‌ ధర చెల్లించాలి.

ఇదీ చూడండి: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

ABOUT THE AUTHOR

...view details