తెలంగాణ

telangana

జీవో 317, స్పౌజ్‌ బదిలీలపై టీచర్ల పోరుబాట

By

Published : Jan 23, 2023, 9:24 PM IST

Teachers fight for Spouse Transfers: ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సర్కార్ కసరత్తు జరుపుతున్న వేళ టీచర్లు ఆందోళన బాట పట్టారు. 317 జీవో రద్దు చేయడంతో పాటు, 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. టీచర్లు అడుగుతున్నవి న్యాయబద్దమైన కోరికలేనంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు వారికి మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వం పరిష్కరించకపోతే... మరో సకల జనుల సమ్మె ఖాయమని బండి సంజయ్ హెచ్చరించారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చినట్లు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు వెల్లడించారు.

Teachers fight
Teachers fight

జీవో 317, స్పౌజ్‌ బదిలీలపై టీచర్ల పోరుబాట

Teachers fight for Spouse Transfers: 317 జీవో రద్దు, 13 జిల్లాల్లో ఆగిపోయిన స్పౌజ్ బదిలీలు చేపట్టాలనే డిమాండ్‌తో గత కొన్ని రోజులుగా చేస్తున్న ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనలకు బీజేపీ, కాంగ్రెస్‌ బాసటగా నిలిచాయి. జీఓ 317ను సవరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఉత్తర్వులతో ఉపాధ్యాయులు, వారి కుటుంబసభ్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్న సంజయ్... ఇప్పటికే 34 మంది టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. గురువులు జీతాలు అడుక్కునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవచూపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తక్షణమే ప్రగతి భవన్ ఈ ఘటనపై కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని విజ్ఞప్తి చేశారు. సీఎం క్షమాపణ చెప్పే వరకు బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. 317 జీవో, ఉపాధ్యాయ, ఉద్యోగుల బదిలీల అంశంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చిస్తామని ప్రకటించారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల పక్షాన పోరాడేందుకు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. దీనిని తప్పనిసరిగా సవరించాల్సిందే అని స్పష్టం చేశారు.

"నిన్న ప్రగతి భవన్ ముట్టడి కోసం వెళ్లిన ఉపాధ్యాయులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం. ఉపాధ్యాయుల కుటుంబాలను ఛిన్నాభిన్నం కోసం తెచ్చిన జీవో 317. టీచర్లు జీతాలు కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది. పాఠశాలల్లో స్కావెంజర్లను తీసేయడం దారుణం. టీచర్లకు పీఆర్సీలు, డీఏలు, పదోన్నతులు లేవు. టీచర్లకు నాలుగు డీఏలు బకాయి పెట్టారు."- బండి సంజయ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

సమస్య రోజురోజుకీ జఠిలమవుతున్న దృష్ట్యా పరిష్కారంపై సర్కార్‌ దృష్టి సారించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును కలిసిన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలకు భరోసా ఇచ్చారు. ఖాళీలు తక్కువగా ఉండడం వల్లే 13 జిల్లాల్లో స్పౌజ్‌ బదిలీల సమస్య వచ్చిందన్న పీఆర్టీయూ అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి... సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం గత కొన్నాళ్లుగా ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు.

జీఓ 317 తక్షణమే రద్దు చేయాలి : ఉపాధ్యాయులకు మద్దతుగా 317 జీవోను వ్యతిరేకిస్తూ .. హైదరాబాద్ లక్డికాపుల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని భాజపా మైనార్టీ మోర్చా నేతలు ముట్టడించారు. లోపలికి వెళ్లేందుకు యత్నించిన నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు ... నాంపల్లి ఠాణాకు తరలించారు. 317జీవోను సవరించకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారిన జీవో 317 తక్షణం రద్దు చేయాలని కోరుతూ బీజేవైఎం నేతలు ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నించారు. ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు యువ మోర్చా నేతలు అదుపులోకి తీసుకుని సమీప ఠాణాకు తరలించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details