తెలంగాణ

telangana

తెలంగాణ టీడీపీ మొదటి రెండు సీట్లు ఆ వర్గాల వారికే: చంద్రబాబు

By

Published : Feb 26, 2023, 5:27 PM IST

Chandrababu comments on Telangana TDP: పార్టీ నేతలు ఎన్టీఆర్ భవన్ చుట్టూ కాకుండా గ్రామాల్లో తిరగాలని టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. పేదలను నాయకులుగా పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం మాత్రమేనని అన్నారు. ప్రజల్లో ఉన్న నాయకులను మాత్రమే పార్టీ గౌరవిస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రజల జీవ‌న ప్రమాణాలను మెరుగుపరిచిన పార్టీ టీడీపీ అని.. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందని వెల్లడించారు. తెలంగాణలో టీడీపీ మొదటి సీటును నాయీ బ్రాహ్మణులకు, రెండో సీటు రజకులకు ఇస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Chandrababu comments on Telangana TDP
తెలంగాణ టీడీపీ మొదటి రెండు సీట్లు ఆ వర్గాల వారికే: చంద్ర బాబు

తెలంగాణ టీడీపీ మొదటి రెండు సీట్లు ఆ వర్గాల వారికే: చంద్ర బాబు

Chandrababu comments on Telangana TDP: తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణలో పెట్టిన పార్టీ తెలుగుదేశం అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ''ఇంటింటికీ తెలుగుదేశం'' ప్రచార కార్యక్రమాన్ని చంద్రబాబునాయుడు ప్రారంభించి.. ప్రచార కిట్లను పార్టీ శ్రేణులకు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Intintiki Telugudesham Program in Telangana తెలంగాణలో టీడీపీ ఎక్కడుందనే వారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందని చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలను చూపించారు. తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమం కోసం వచ్చిన వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణలో జీవిత ప్రమాణాలు పెంచిన పార్టీ టీడీపీ అని అన్నారు.

నగరంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రారంభించారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన పార్టీ టీడీపీ మాత్రమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆహార భద్రత పథకానికి నాంది పలికిందే ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. నలభై ఏళ్ల కిందటే ఆహార భద్రతను అమలు చేశారని తెలిపారు. రూ.2 కిలో బియ్యం పథకంతో ఎంతో మంది పేదల కడుపు నింపారని వెల్లడించారు.

''ఇంటింటికి వెళ్లి టీడీపీ విశిష్టత చెప్పాలి. కుల సంఘాలు, వృత్తి సంఘాలు టీడీపీను బలపరిచేలా చూడాలి. సామాజిక న్యాయానికి మారుపేరు టీడీపీ. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనేది టీడీపీ లక్ష్యం. ఎన్టీఆర్‌కు భారతరత్న అనేది తెలుగువాడి ఆకాంక్ష.. దేశానికి గౌరవం. నాయకత్వాన్ని ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం. సృష్టించిన సంపదను పేదవాళ్లకు అందించడమే లక్ష్యం. ప్రజల్లో ఉండాలనే సంకల్పం అందరూ తీసుకోవాలి. నాయకుల చుట్టూ తిరగడం కాదు.. ప్రజల వద్ద ఉండాలి.'' - చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత

గ్రామాల్లో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి... నిజమైన స్వాతంత్య్రాన్ని తెలంగాణలోని మారుమూల పల్లెలకు ఎన్టీఆర్ పరిచయం చేశారని చంద్రబాబు తెలిపారు. మాండలిక వ్యవస్థకు శ్రీకారం చుట్టి... భూమి శిస్తు రద్దు చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. మహిళా సాధికారతపై ఇప్పుడు అన్ని పార్టీలు, నేతలు మాట్లాడుతున్నారని... నలభై ఏళ్ల క్రితమే మహిళల కోసం ఎన్టీఆర్ ఆలోచించారని స్పష్టం చేశారు. మహిళలకు రిజర్వేషన్లు, ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు కల్పించామన్నారు.

మార్చి 29వ తేదీన పరేడ్ గ్రౌండ్స్‌లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ సభకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రావడం దేశానికే గౌరవం అని అన్నారు. తెలంగాణ అధ్యక్షుడిగా జ్ఞానేశ్వర్ నియామకం అయిన తర్వాత పార్టీ పరుగులు పెడుతుందన్నారు.

''తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీను స్థాపించారు. 41 ఏళ్లుగా తెలుగు వాళ్ల కోసం పని చేస్తున్న పార్టీ తెలుగుదేశం. పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అమలు చేసిన పార్టీ టీడీపీ. సంక్షేమ పథకాలు తెదేపాతోనే ప్రారంభమయ్యాయి. పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేదవారికి ఎన్టీఆర్‌ స్వాతంత్ర్యం అందించారు. రైతుల కోసం భూమి శిస్తు రద్దు చేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. తెలుగుదేశం ఎక్కడ ఉంది అనేవారికి ఖమ్మం సభ తర్వాత సమాధానం దొరికింది. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారికోసం టీడీపీ పనిచేస్తుంది. '' - చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత

తెలంగాణలో టీడీపీ మొదటి సీటును నాయీ బ్రాహ్మణులకు, రెండో సీటు రజకులకు ఇస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఐటీ ఉద్యోగం రావటానికి కారణమైన టీడీపీకి ఐటీ యువత అండగా ఉండాలని కోరారు. విభజన తర్వాత లేనిపోని సమస్యలు పెట్టుకోవటం సరైంది కాదన్నారు. విభజన తర్వాత కూడా టీడీపీకి తెలంగాణలో 15 అసెంబ్లీ స్థానాలొచ్చాయని గుర్తుచేశారు. టీడీపీని కాపాడుకోవటం చారిత్రాత్మక అవసరమని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details