ETV Bharat / state

ట్ర'యాంగ్రి'ల్ స్టోరీ.. ఎవరు ఎవర్ని లవ్ చేశారు? ఎవరు బలయ్యారు?

author img

By

Published : Feb 25, 2023, 8:07 PM IST

Updated : Feb 26, 2023, 7:39 AM IST

naveen killed by hariharakrishna full story
ట్ర'యాంగ్రి'ల్ స్టోరీ.. ఎవరు ఎవర్ని లవ్ చేశారు? ఎవరు బలయ్యారు?

naveen murder case update: ప్రేమించిన యువతి కోసం తోటి స్నేహితుడినే హత్య చేశాడు ఓ కిరాతకుడు. గొంతు నులిమి చంపిన తర్వాత మృతుడి తలను, మొండెం నుంచి వేరు చేశాడు. తన ప్రేయసిని బెదిరించాడని గుండెను చీల్చాడు. చేతి వేళ్లను నరికాడు, మర్మాంగాలను కోశాడు. పేగులు పెకిలించివేశాడు. హత్య చేసిన 2 రోజుల తర్వాత మృతుడి తండ్రికి ఫోన్ చేసి ఏమీ తెలియనట్లు మాట్లాడాడు నిందితుడు. సైకోలా మారి హత్యకు పాల్పడిన తీరును చూసి పోలీసులే నివ్వెరపోయారు. అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలోని నిర్మానుష ప్రాంతంలో ఈ హత్య చోటు చేసుకుంది.

naveen murder case update: ప్రేమ ముందు స్నేహం ఓడిపోయింది. ప్రేమించిన యువతిని వేధిస్తున్నాడనే నెపంతో.. ప్రాణ స్నేహితుడినే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌కు చెందిన హరిహర కృష్ణ.. ఫిర్జాదీగూడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితుడు నవీన్ నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయంలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరూ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ జూనియర్ కళాశాలలో చదువుకునే సమయంలో మంచి స్నేహితులు.

ఇంటర్ చదివే సమయంలో సమీపంలోని శ్రీ చైతన్య కళాశాలలో చదువుతున్న ఓ యువతితో నవీన్‌కు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇంజినీరింగ్‌కు వెళ్లినా ఆమెతో నవీన్ ప్రేమాయణం కొనసాగింది. ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చి రెండేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత హరిహర కృష్ణతో ఆ యువతి స్నేహం కొనసాగించింది. ఈ విషయం తెలుసుకున్న నవీన్... తన స్నేహితురాలిని ప్రశ్నించాడు. తరచూ ఫోన్ చేయడంతో పాటు వాట్సాప్ సందేశాలు పంపించాడు. నవీన్ ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ఆ యువతి హరిహర కృష్ణకు తెలిపింది.

దీంతో హరిహర కృష్ణ, నవీన్‌పై ద్వేషం పెంచుకున్నాడు. ఎలాగైనా నవీన్‌ను అంతం చేయాలని కుట్ర పన్నాడు. గత మూడు నెలలుగా దీనికోసం పలు క్రైం వెబ్ సిరీస్‌లు చూశాడు. యూట్యూబ్‌లలోనూ హత్యలకు సంబంధించిన దృశ్యాలు చూశాడు. ఆ తర్వాత నవీన్ హత్యకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఈ నెల 17వ తేదీన నవీన్‌కు ఫోన్ చేసిన హరిహర కృష్ణ... హైదరాబాద్‌కు రావాల్సిందిగా సూచించాడు. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామని సూచించడంతో నల్గొండ నుంచి 17వ తేదీన ఉదయం హరిహర కృష్ణ వద్దకు వచ్చాడు. ఇద్దరూ కలిసి హరిహర కృష్ణ స్కూటీపై ఇంటర్ స్నేహితుడికి దగ్గరికి వెళ్లారు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి భోజనం చేసి సినిమాకు వెళ్లారు. సినిమా తర్వాత స్నేహితుడు తన ఇంటికి వెళ్లిపోయాడు.

హరిహరకృష్ణ, నవీన్‌ను మూసారాంబాగ్‌లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. నవీన్ నల్గొండ వెళ్తానని చెప్పగా... ద్విచక్ర వాహనంపై ఇద్దరూ బయల్దేరారు. ఎల్బీనగర్ మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్ వైపు వెళ్లారు. నిర్మానుష ప్రాంతంలోకి వెళ్లాక.. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత తమ స్నేహితురాలి గురించి ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇద్దరూ ఒకరినొకరు నెట్టుకున్నారు. తోపులాటలో కిందపడిపోయిన నవీన్‌పై కూర్చున్న హరిహర కృష్ణ గొంతు నులిమి ఊపిరాడకుండా చేశాడు. నవీన్ మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత తన వెంట తెచ్చుకున్న కత్తితో నవీన్ తల, మొండెం వేరు చేశాడు. ఈ తర్వాత గుండె చీల్చాడు. పొట్ట భాగాన్ని పెకిలించి పేగులు బయటకు తీశాడు. మర్మాంగాలను కోశాడు.

17వ తేదీన వెళ్లిన నవీన్ రెండు రోజులైనా యూనవర్శిటీ హాస్టల్‌కు రాకపోవడంతో తోటి విద్యార్థులు హరిహరకృష్ణకు 19వ తేదీ ఫోన్ చేశారు. 17వ తేదీ రాత్రే తన దగ్గరి నుంచి వెళ్లినపోయినట్లు హరిహర కృష్ణ, నవీన్ హస్టల్ ఫ్రెండ్స్‌కు చెప్పారు. నవీన్ హాస్టల్‌కు రాలేదని తోటి విద్యార్థులు ఆయన తండ్రికి చెప్పారు. నవీన్ సమీప బంధువు చనిపోవడంతో వాళ్ల తల్లిదండ్రులు ఆ బాధలో ఉన్నారు. 20వ తేదీన హరిహర కృష్ణ, నవీన్ తండ్రి శంకర్‌కు ఫోన్ చేశాడు. నవీన్ కనిపించడం లేదని... పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దామని ఏమీ ఎరుగనట్లు చెప్పాడు. స్నేహితుల ఇంటికి వెళ్లి ఉండొచ్చులే అని భావించిన నవీన్ తండ్రి శంకర్, మరుసటి రోజు వరకు ఎదురు చూశాడు. తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి నవీన్ గురించి ఆరా తీశాడు.

ఆచూకీ లేకపోవడంతో 21వ తేదీన హరిహర కృష్ణకు ఫోన్ చేసిన నవీన్ తండ్రి శంకర్... హైదరాబాద్ వస్తున్నామని చెప్పాడు. నగరానికి చేరుకున్న తర్వాత హరిహరకృష్ణకు శంకర్ ఫోన్ చేశాడు. గంటలో వస్తున్నానని దిల్‌సుఖ్‌నగర్‌లో వేచి ఉండండని చెప్పిన హరిహరకృష్ణ ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసి పెట్టుకున్నాడు. దీంతో శంకర్.. నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఈ నెల 21వ తేదీ సాయంత్రం ఫిర్యాదు చేశారు. 22వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, నవీన్ కాల్ డేటాను సేకరించారు. చివరగా హరిహరకృష్ణ నెంబర్‌ను ఫోన్ వచ్చినట్లు గుర్తించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. 22వ తేదీనే పోలీసులు హరిహర కృష్ణ ఇంటికి వెళ్లారు. ఇంట్లో అతను లేకపోవడంతో... తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు.

పోలీసులు నిఘా పెట్టిన విషయాన్ని తెలుసుకున్న హరిహర కృష్ణ 24వ తేదీ రాత్రి అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. తమ స్నేహితురాలు తనతో మాట్లాడుతున్నందుకు నవీన్ బెదిరించడంతోనే ఈ హత్య చేసినట్లు హరిహరకృష్ణ ఒప్పుకున్నట్లు తెలిసింది. ఘటనా స్థలానికి నిందితునికో కలిసి వెళ్లిన పోలీసులు.. అక్కడ నవీన్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహంతో పాటు తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నవీన్ హత్య గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు.

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్రతండాకు చెందిన నవీన్ తల్లిదండ్రులు సన్నకారు రైతులు. వ్యవసాయంతో పాటు కూలీ పని చేసుకుంటూ ఇద్దరు కుమారులను చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు నవీన్ నల్గొండలో మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయంలో బీటెక్ చివరి సంవత్సరం. రెండో కుమారుడు కల్వకుర్తిలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నవీన్, హరిహర కృష్ణ ఇద్దరు ప్రాణ స్నేహితులని తండ్రి శంకర్ అంటున్నాడు. నిందితుడు హరిహరకృష్ణ ఎస్బీఐ కాలనీలోని మూసారాంబాగ్‌లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఫిర్జాదీగూడలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నాడు.

నవీన్‌ను హత్య చేసేందుకు హరిహర కృష్ణ పలు క్రైం వెబ్ సీరీస్‌లతో పాటు, యూట్యూబ్‌ చూసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. నవీన్ మృతదేహం నుంచి అవయవాలు వేరు చేసే సమయంలో చేతికి గ్లౌజు వేసుకొని కత్తిని పట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా మృతదేహం ఆనవాళ్లు గుర్తించకుండా నవీన్ వేసుకున్న దుస్తులను విప్పి ఓ బ్యాగులో పెట్టుకున్నాడు. అంతే కాకుండా నవీన్ ఉపయోగించిన చరవాణిని ధ్వంసం చేసి దాన్ని తన వెంట తీసుకెళ్లాడు. హరిహరకృష్ణను అరెస్ట్ చేసిన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు, హయత్ నగర్ కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు పంపించారు.

ఇవీ చదవండి:

Last Updated :Feb 26, 2023, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.