తెలంగాణ

telangana

తెలుగు అకాడమీ విభజనపై ఏకాభిప్రాయానికి రావాలి: సుప్రీం

By

Published : Mar 22, 2021, 3:20 PM IST

Updated : Mar 22, 2021, 7:22 PM IST

తెలుగు అకాడమీ ఉద్యోగులు, ఆస్తుల పంపకాలపై సుప్రీం విచారణ చేపట్టింది. నెలరోజుల్లో ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని సూచించింది. అకాడమీ విభజనపై ఏకాభిప్రాయానికి రాకపోతే తామే విచారణ చేపడతామని తెలిపింది.

supreme-court-hearing-on-telugu-academy-issue
తెలుగు అకాడమీ విభజనపై ఏకాభిప్రాయానికి రావాలి: సుప్రీం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తెలుగు అకాడమీ విభజనపై నెల రోజుల్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమావేశమై ఏకాభిప్రాయానికి రావాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. తెలుగు అకాడమీ ఉద్యోగుల విభజన, ఆస్తులు, అప్పుల పంపకాలపై తెలంగాణ హైకోర్టు జనవరిలో ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విభజన చట్టంలోని 10వ షెడ్యూల్‌లో ఉన్న తెలుగు అకాడమీ అంశం న్యాయపరిధిలోకి రాదని .. అలాంటప్పుడు విభజనపై హైకోర్టు ఆదేశాలు ఎలా ఇస్తుందంటూ తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదించారు. ఏపీలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు జీతం కోసం దాఖలు చేసిన పిటిషన్‌లో హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఒప్పంద ఉద్యోగులను కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ కోర్టుకు తెలిపారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం.. నెలరోజుల్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని తెలుగు అకాడమీ విభజనపై ఏకాభిప్రాయానికి రావాలని సూచించింది. ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే మళ్లీ విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:ఆ విషయంలో దేశంలోనే నంబర్‌ వన్​గా తెలంగాణ: ఇంద్రకరణ్

Last Updated : Mar 22, 2021, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details