తెలంగాణ

telangana

ఎమ్మెల్యేలకు ఎర కేసులో మలుపు.. తుషార్‌, న్యాయవాది శ్రీనివాస్‌లకు సిట్‌ నోటీసులు

By

Published : Nov 17, 2022, 7:24 PM IST

Updated : Nov 18, 2022, 7:18 AM IST

MLAs Poaching Case Updates: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ బృందం దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌కు నోటీసులు జారీ చేసింది. ఈనెల 21న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

MLAs Poaching Case updates
MLAs Poaching Case updates

MLAs Poaching Case Updates: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు హైకోర్టు సింగిల్‌ జడ్జి పర్యవేక్షణలో జరుగుతుండడంతో పాటు.. ఈ నెల 29లోపు పురోగతిని సీల్డ్‌కవర్‌లో అప్పగించాల్సి ఉండడంతో సిట్‌ విచారణలో వేగం పెంచింది. ఇప్పటికే తెలంగాణ, ఏపీ సహా అయిదు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించగా.. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ రాజకీయ నేత తుషార్‌ వెల్లాపల్లితోపాటు కరీంనగర్‌కు చెందిన న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌కు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేసింది. ఈ నెల 21న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని సిట్‌ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని, తమ సెల్‌ఫోన్లను తప్పనిసరిగా తీసుకురావాలని స్పష్టం చేసింది. మరోవైపు ప్రధాన నిందితుడు రామచంద్రభారతి నివసించే ఫరీదాబాద్‌లో సిట్‌ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తుషార్‌ కార్యదర్శికి నోటీసు అందజేత

మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో గత నెల 26న రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే రామచంద్రభారతి తుషార్‌ వెల్లాపల్లితో ఫోన్‌లో మాట్లాడారని, ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డితోనూ మాట్లాడించారని ఆరోపణ. దీని ఆధారంగా సిట్‌ సభ్యురాలు, నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి నేతృత్వంలోని బృందం కేరళలోని కొచ్చి, కొల్లాం ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేసి.. కీలక ఆధారాల్ని సేకరించింది. కొచ్చి సమీపంలోని ఏలూర్‌లో ఇద్దరు స్వామీజీలను విచారించింది. రామచంద్రభారతిని తుషార్‌కు పరిచయం చేయడం వెనక వీరిద్దరితోపాటు కేరళ వైద్యుడు డా.జగ్గుస్వామి పాత్ర ఉందనే కోణంలో ఆరా తీస్తోంది. అలప్పుజలోని తుషార్‌ ఇంటికి వెళ్లిన రెమా రాజేశ్వరి బృందం.. ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యదర్శికి నోటీసు అందించింది.

విమాన టికెట్‌ కొనుగోలు ఆరోపణలు

నిందితుడు సింహయాజి ఫామ్‌హౌస్‌కు వచ్చేందుకు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు విమానంలో ప్రయాణించారు. ఆ విమాన టికెట్‌ను బుక్‌ చేసింది కరీంనగర్‌కు చెందిన బూసారపు శ్రీనివాస్‌ అనే అరోపణలున్నాయి. ఆయనకు ఓ జాతీయ పార్టీ రాష్ట్రస్థాయి కీలకనేతతో బంధుత్వం ఉండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీనివాస్‌కు నోటీసులు అందించేందుకు పోలీసులు గురువారం కరీంనగర్‌ వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో నోటీసును తలుపులకు అతికించారు.

న్యాయవాది శ్రీనివాస్‌కు సిట్ అధికారుల నోటీసులు

ఇవీ చదవండి:'ఎమ్మెల్యేలకు ఎర కేసు' దర్యాప్తునకు హైకోర్టు అనుమతి.. మీడియాకు లీకులు ఇవ్వరాదని స్పష్టం

ఎమ్మెల్యేలకు ఎర కేసు... డబ్బు ఎక్కడిదని సిట్​ ఆరా..

గంటన్నర పాటు సచివాలయ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్

శ్రద్ధ హత్య కేసు నిందితుడికి నార్కో టెస్ట్.. మరో ఐదు రోజులు పోలీస్​ కస్టడీ

Last Updated : Nov 18, 2022, 7:18 AM IST

ABOUT THE AUTHOR

...view details