తెలంగాణ

telangana

ఈనెల 18 నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం

By

Published : Jan 4, 2023, 3:58 PM IST

Second Phase Kanti Velugu Programme: రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్నిపాలిటీల్లోని వార్డుల్లో... ఈనెల 18 నుంచి రెండో విడత కంటివెలుగు క్యాంపులు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిర్వహణా తేదీలను.. రేషన్ దుకాణాలు, పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రదర్శిస్తామని తెలిపింది. కంటి వెలుగు సన్నద్ధతపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. వంద రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేసి.. గిన్నిస్ రికార్డు సాధిద్దామని సూచించారు. సీఎం కేసీఆర్‌ కలైన అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యాన్ని సాకారం చేద్దామని కోరారు.

Kanti Velugu
Kanti Velugu

Second Phase Kanti Velugu Programme: కంటివెలుగు రెండో విడత సన్నద్ధతపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ బీఆర్కేభవన్ నుంచి మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో దృశ్యమాధ్యమం ద్వారా సమీక్షించారు. కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ బుక్‌లెట్‌ను మంత్రులు ఆవిష్కరించారు. మొదటి దఫా కంటివెలుగు... ప్రపంచంలోనే పెద్ద కార్యక్రమంగా నిలిచిందన్న మంత్రి హరీశ్‌రావు.. కోటీ 54 లక్షల మందికి స్క్రీనింగ్ చేసి, 50 లక్షల కళ్లద్దాలు ఉచితంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ఈనెల 18 నుంచి రెండో దఫా ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు కేంద్రంగా క్యాంపుల నిర్వహణ ఉంటుందన్న హరీశ్‌రావు... అవసరం ఉన్న వారందరికీ కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్షలతోపాటు మందులు, కళ్లద్దాలు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని వంద రోజుల్లోనే పూర్తి చేయాలని హరీశ్‌రావు అధికారుల్ని ఆదేశించారు. మొత్తం 1500 బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి... సాయంత్రం నాలుగు గంటల వరకు క్యాంపులు నిర్వహణ ఉంటుందని చెప్పారు. పరీక్షల అనంతరం అవసరమైన వారందరికీ ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. 30 లక్షల రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్క్రిషన్ గ్లాసెస్‌ను ముందుగానే ఆయా జిల్లాలకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. పరీక్షలు చేసిన నెల రోజుల్లోపే ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేయాల్సి ఉంటుందని... అధికారులకు స్పష్టం చేశారు.

ప్రజా కోణంలో ఆలోచించి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన కంటి వెలుగు రెండో విడతకు 200 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. రోజు వారీ వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈనెల 12వ తేదీలో అన్ని జిల్లాల్లో మంత్రుల నేతృత్వంలో... కంటి వెలుగు సమావేశాలు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశాల్లో షెడ్యూల్‌ ఖరారు చేసి... పంపిణీ చేయాలని సూచించారు. రేషన్‌ దుకాణాలు, పంచాయతీ కార్యాలయాల్లో కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ తేదీలను ప్రచురించాలని ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కంటి వెలుగు విజయవంతం చేసేందుకు.. అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. క్యాంపు నిర్వహించిన రోజు పరీక్షలకు హాజరుకాలేని వారి కోసం మళ్లీ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి ఒక్కరికి కంటి స్క్రీనింగ్ పూర్తి చేసి... గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యేలా అందరమూ కృషి చేద్దామని హరీశ్‌రావు మంత్రి పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details