తెలంగాణ

telangana

Revanthreddy on Kaleshwaram Project : 'కాళేశ్వరం ఓ తెల్ల ఏనుగు.. రాష్ట్ర వనరులను కరిగిస్తోంది'

By

Published : Jul 3, 2023, 9:18 PM IST

Revanthreddy fires on BRS Ministers : ఖమ్మంలో రాహుల్‌ గాంధీ జనగర్జన సభ అనంతరం.. బీఆర్​ఎస్, బీజేపీ నేతల ఆరోపణలపై.. కాంగ్రెస్‌ నేతలు భగ్గుమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను సమర్థిస్తూ... మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు చర్చకు సిద్ధమా అంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఐటీ, ఈడీ దాడులను నుంచి తప్పించుకునేందుకే.. మంత్రి కేటీఆర్‌ దిల్లీ వెళ్లారని రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ తెల్ల ఏనుగంటూ... ఆయన ఆరోపించారు.

Revanth
Revanth

Revanthreddy fires on BRS : ఖమ్మంలో రాహుల్‌గాంధీ సభ అనంతరం.. రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్​ఎస్, బీజేపీ నేతలు.. రాహుల్‌ గాంధీ లక్ష్యంగా చేసిన ఆరోపణలపై... టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. తెలంగాణలో రాహుల్‌గాంధీకి తిరిగే అర్హతలేకపోతే.. ప్రధాని మోదీకి ఉంటుందా అంటూ నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ ఇచ్చిన నివేదికపై చర్చకు సిద్ధమా అంటూ... మంత్రులు కేటీఆర్, హరీశ్​రావులకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మాట్లాడిన అయన... ఖమ్మం సభను అడ్డుకోవడానికి... ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.

Revanthreddy Comments on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండగా మారిందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఖమ్మంలో ఉన్న మంత్రి... సైకో విన్యాసాలు చేశారని దుయ్యబట్టారు. సభను అడ్డుకోవడానికి... ప్రభుత్వ అధికారులు ప్రయత్నించడం దారుణమన్నారు. కాళేశ్వరం ద్వారా 16 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామన్న ప్రభుత్వం... ఏ ఏడాదిలోనూ 75 వేల ఎకరాలకు మించి నీళ్లివ్వలేదన్నారు. కాళేశ్వరం కోసం ఏటా 25 వేల కోట్ల రూపాయల ఖర్చు వస్తోందన్న రేవంత్‌... కేసీఆర్‌ కుటుంబానికి కాళేశ్వరం తెల్ల ఏనుగులాగా మారిందన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర వనరులను కరిగిస్తోందంటూ.. లెక్కలతో సహా వివరించారు.

'దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబానికి తెలంగాణలో పర్యటించే అర్హత లేదనడం బీఆర్​ఎస్ అవివేకం. గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం. మీలా అవినీతి కుటుంబం కాదు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా.. రాహుల్‌ గాంధీ పదవి తీసుకోలేదు. గాంధీ కుటుంబం దేశం కోసం ప్రధాని పదవినే త్యాగం చేసింది. రాహుల్‌ కంటే ఇంకెవరికైనా తెలంగాణలో పర్యటించే అర్హత ఉందా? అసలు రాహుల్‌ అర్హత గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది ?'-రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

కాళేశ్వరం ప్రాజెక్టు ఓ తెల్ల ఏనుగు : ఉపాధిహామీ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆర్టీఐ, ఆహార భద్రత చట్టంతోపాటు హైదరాబాద్‌లో ఐటీ సంస్థలు, ఓఆర్‌ఆర్‌, ఎయిర్‌పోర్టు, ఫార్మా సంస్థలను తీసుకొచ్చింది కాంగ్రెస్సేనని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రూపొందించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్‌ చేసి కాళేశ్వరంగా పేరు మార్చారని రేవంత్‌ విమర్శించారు. రీ డిజైన్‌ తర్వాత ఆయకట్టు ప్రాంతం పెరగకపోగా.. ఆ ప్రాజెక్టు రాష్ట్ర వనరులను కరిగిస్తోందని ఆయన ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్‌ రిపోర్టుపై చర్చకు సిద్ధమా?: రేవంత్‌రెడ్డి

'కాళేశ్వరం ప్రాజెక్టు ఓ తెల్ల ఏనుగు. ఎంత ఖర్చు పెట్టినా దానికి సరిపోవడం లేదు. ఇది నేను చెప్పిన మాట కాదు.. కాగ్‌ తన రిపోర్టులో పేర్కొంది. ఈ రిపోర్టుపై చర్చించేందుకు కాంగ్రెస్‌ నుంచి ఇద్దరం వస్తాం.. బీఆర్​ఎస్ నుంచి హరీశ్‌రావు, కేటీఆర్‌ సిద్ధమా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి. 2014 జూన్‌2 నాటికి కేసీఆర్‌ కుటుంబ ఆస్తులెన్ని? 2023 జులై 2 నాటికి వారి ఆస్తులు ఎంతకు పెరిగాయో చర్చించేందుకు వారిద్దరూ సిద్ధంగా ఉన్నారా?'-రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details