తెలంగాణ

telangana

బీ అలర్ట్.. రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు..!

By

Published : Mar 27, 2023, 9:58 PM IST

Updated : Mar 28, 2023, 6:24 AM IST

Weather Report in Telangana: రాష్ట్రంలో ఈరోజు పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఇదే సమయంలో గంటకు 30నుంచి 40కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

rains
rains

Weather Report in Telangana: రాష్ట్రంలో తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో గంటకు 30నుంచి 40కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ క్రమంలోనే రాగల మూడు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం వివరించింది.

మరోవైపు కొద్ది రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలను నిలువునా ముంచాయి. ఆరుగాలం శ్రమించి.. పండించిన పంట వర్షార్పణమైంది. పంట అమ్ముకుందామనే ఆశతో ఎదురు చూసిన.. రైతులను వడగళ్లు, ఈదురు గాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. ఒక్కసారిగా విరుచుకుపడ్డ వానలు.. చేతికందాల్సిన పంటను నేలపాలు చేశాయి. దీంతో అన్నదాతపై అదనపు భారాన్ని కలిగించాయి. వాలిపోయిన పంటను తీసేందుకు యంత్రాలు, కూలీలకు రెట్టింపు ధరలు చెల్లించాల్సి రావటం కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ క్రమంలోనే వేల ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న, మిర్చి, మామిడి, బొప్పాయి, అరటి తోటలకు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎకరాకు రూ.10వేలు పరిహారం ప్రకటించిన సీఎం:రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.28లక్షల ఎకరాల పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. మొక్కజొన్న, మిర్చి వేసిన చాలా మంది అన్నదాతలు చాలా వరకు తీవ్రంగా నష్టపోయారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వారి నియోజకవర్గాల్లో పంట నష్టంపై ఆరా తీశారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పలు జిల్లాలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టంపై ఆరా తీశారు. రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. ఇందులో భాగంగానే ఎకరాకు రూ.10,000 ఆర్థికసాయాన్ని ప్రకటించారు. వెంటనే ఆయన రూ. 228కోట్లు విడుదల చేశారు.

ఈమేరకు జీవోను సైతం ప్రభుత్వం జారీ చేసింది. కౌలు రైతులు సహా.. పంట నష్టపోయిన రైతులకు ఆ సాయం అందనుంది. ఏప్రిల్‌ 15 నుంచి రైతులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలుస్తోంది. సీఎం ప్రకటనకు అనుగుణంగా త్వరితగతిన సర్కార్‌ ఉత్తర్వులు వెలువడటంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. తదుపరి పంట పెట్టుబడికి ఈ సాయం ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.

Last Updated : Mar 28, 2023, 6:24 AM IST

ABOUT THE AUTHOR

...view details