తెలంగాణ

telangana

వైకాపా పరిపాలన ఆంధ్రప్రదేశ్​కి హానికరమన్న పవన్​ కల్యాన్

By

Published : Aug 22, 2022, 10:37 PM IST

వైకాపా నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయటమే తమ లక్ష్యమని జనసేన అధినేత పవన్ అన్నారు. రాజకీయాల్లో ఒక కులాన్ని పట్టుకుని ముందుకెళ్లలేమని, అన్ని కులాల సహకారంతోనే ముందుకెళ్తున్నామని చెప్పారు.ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అలంకార పదవులు దక్కుతున్నాయని ఆయన విమర్శించారు.

Etv Bharat
Etv Bharat

వైకాపా పరిపాలన ఆంధ్రప్రదేశ్​కి హానికరమన్న పవన్​ కల్యాన్

వైకాపా పరిపాలన ఆంధ్రప్రదేశ్​కి హానికరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వైకాపా నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే తమ లక్ష్యమని ఆయన వ్యాఖ్యనించారు. సెప్టెంబరు నుంచి పార్టీలో నిర్మాణ లోపాలు సరిదిద్దుకుంటామని చెప్పారు. పార్టీలో క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీలో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాజకీయాల్లో ఒక కులాన్ని పట్టుకుని ముందుకెళ్లలేమని..,అన్ని కులాల సహకారంతోనే ముందుకెళ్తున్నామని చెప్పారు. అన్నింటికీ పాదయాత్ర పరిష్కారం కాదని చెప్పారు. ప్రస్తుతం జీరో బడ్జెట్ ఎన్నికలు సాధ్యం కాదని..,డబ్బు ప్రమేయం లేకుండా ఎన్నికలు జరుగుతాయా? అని ప్రశ్నించారు.

"ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అలంకార పదవులు దక్కుతున్నాయి. అధికారం చూడని కులాలకు మా పార్టీలో ప్రాధాన్యం ఇస్తాం. వక్ఫ్‌ బోర్డు ఆస్తులు కబ్జాకు గురవుతున్నాయి. దివ్యాంగుల సంక్షేమానికి మా మ్యానిఫెస్టోలో ప్రత్యేక స్థానం. జనవాణి, కౌలురైతుల భరోసా ద్వారా కొత్త సమస్యలు తెలిశాయి. సమసమాజాన్ని, మానవత్వాన్ని మేం కోరుకుంటున్నాం. ఉపాధి కల్పించాలని రాయలసీమ ప్రజలు అడుగుతున్నారు. రాయలసీమలో పరిశ్రమ పెట్టాలంటే స్థానిక నేతలకు కప్పం కట్టాలి. కప్పం కట్టకుంటే ఏమవుతుందో కియా పరిశ్రమ అనుభవం చూశాం." - పవన్, జనసేన అధినేత

అమరావతి అందరిది: అమరావతి అన్ని కులాల వారిదని పవన్ కల్యాణ్‌ అన్నారు. జనసేన కార్యాలయానికి వచ్చిన రాజధాని రైతులు.. రెండోవిడత పాదయాత్రకు పవన్​ను ఆహ్వానించారు. ఉన్న సమస్య పరిష్కరించకుండా 3 రాజధానుల సమస్య తెచ్చారని ప్రభుత్వంపై జనసేనాని మండిపడ్డారు. రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలని.., అది అమరావతే కావాలన్నారు. రాజధాని రైతులకు సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారు. రైతుల పాదయాత్రకు జనసేన మద్దతు ఉంటుందని వెల్లడించారు. టిడ్కో ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details