తెలంగాణ

telangana

'ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే.. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి'

By

Published : Jun 29, 2022, 9:49 AM IST

వైాకాపా ప్రభుత్వాన్ని ఎంపీ రఘురామ హెచ్చరించారు. జులై 4న భీమవరంలో జరుగనున్న ప్రధాని సభలో తనను అరెస్టు చేయటానికి ఏపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. అక్కడ పిచ్చివేషాలకు పాల్పడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు. కావాలంటే తనను పార్టీ నుంచి బహిష్కరించాలని సూచించారు.

raghurama
raghurama

Raghurama Warns to Govt: స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్​ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు హాజరుకానున్న ప్రధానమంత్రి మోదీ సభలో పోలీసులు తనను అరెస్టు చేయడం వంటి పిచ్చివేషాలకు పాల్పడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సభకు తన దారిన తాను వచ్చి వెళ్లిపోతానని.. ప్రభుత్వ పెద్దలు ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే తన రక్షణపై ప్రధానమంత్రిని అభ్యర్థించాల్సి ఉంటుందన్నారు. తనకు ప్రభుత్వం, పోలీసుల నుంచి ఉన్న హానిని గుర్తించి ప్రతిపక్ష నాయకులు, తమ పార్టీలో అల్లూరి స్ఫూర్తితో పని చేసేవారు రక్షణగా నిలవాలని కోరారు. అల్లూరి విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు కొందరు వెళితే ఒకరిద్దరిని పక్కకు పిలిచి రఘురామ సభకు రాకుండా చూడాల్సిన బాధ్యత మీదేనంటూ విజ్ఞప్తి లాంటి హెచ్చరిక చేసినట్లు తెలిసిందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు ఇవ్వలేదని తెలిపారు. సభాస్థలిలో రెండు వర్గాల మధ్య వైషమ్యాలను సృష్టించి, వాటికి కారణం తానేనని కేసులు పెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

రఘురామను టీవీ చర్చలకు రానివ్వకండి: సంసద్‌ (పార్లమెంట్‌) టీవీ చర్చల్లో ఎంపీ రఘురామకృష్ణరాజును అనుమతించవద్దని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంసద్‌ టీవీ ముఖ్య కార్యనిర్వహణాధికారికి (సీఈవో) లేఖ రాశారు. చర్చల్లో రఘురామను వైకాపా ఎంపీగా చూపుతున్నారని తెలిపారు. ఆయన వైకాపా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించడం లేదని పేర్కొన్నారు. ఆయనపై అనర్హతకు సంబంధించిన పిటిషన్‌ సభాపతి వద్ద పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ఈ లోక్‌సభ కాలపరిమితి ముగిసే వరకు రఘురామను చర్చల్లో భాగస్వామిని చేయొద్దని కోరారు.

బహిష్కరించకుండా లేఖలా:తనను పార్టీ నుంచి బహిష్కరించకుండా చర్చల్లో అనుమతించొద్దంటూ లేఖలు రాయలేరని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. విజయసాయిరెడ్డి లేఖపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కావాలంటే తనను బహిష్కరించాలని సూచించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details