ETV Bharat / city

Inter Results: ఇంటర్​ ఫలితాల్లో ఈసారీ కూడా బాలికలదే పైచేయి

author img

By

Published : Jun 28, 2022, 11:06 AM IST

Updated : Jun 28, 2022, 9:32 PM IST

Intermediate Results
Intermediate Results

10:58 June 28

Telangana Inter Results Released : రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల

ఇంటర్​ ఫలితాలు విడుదల.. ఈసారీ కూడా బాలికలదే పైచేయి

ఇంటర్మీడియెట్ పరీక్షల్లో బాలికలు మరోసారి సత్తా చాటారు. మొదటి, రెండో సంవత్సరాల్లోనూ బాలుర కన్నా బాలికలే ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ, బైపీసీలో ఉత్తీర్ణత శాతం 70శాతానికి పైగా ఉండగా సీఈసీ, హెచ్​ఈసీలో సగం మంది కూడా పాస్ కాలేదు. కరోనా వల్ల గతేడాది అందరినీ పాస్ చేసినప్పటికీ... 2020తో పోలిస్తే మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం పెరగ్గా రెండో సంవత్సరం స్వల్పంగా తగ్గింది.


ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేశారు. కరోనా వల్ల గతేడాది అందరినీ ఉత్తీర్ణుల్ని చేశారు. అంతకు ముందు 2020తో పోలిస్తే మొదటి సంవత్సరం ఉత్తీర్ణత కొంత పెరిగితే ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత స్వల్పంగా తగ్గింది. ప్రథమ సంవత్సరంలో జనరల్, ఒకేషనల్ కలిపి 4 లక్షల 64వేల 892 మంది పరీక్ష రాయగా 63.32 శాతం 2 లక్షల 94వేల 378 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరంలో జనరల్, ఒకేషనల్ కలిపి 4 లక్షల 42వేల 895 మంది పరీక్ష రాయగా... 67.16 శాతం... 2 లక్షల 97వేల 458 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి, రెండో సంవత్సరాల్లో ఈ ఏడాది కూడా బాలికలు పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో బాలుర ఉత్తీర్ణత శాతం 54.25 కాగా.. బాలికలు 72.33 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 59.21 శాతం బాలురు ఉత్తీర్ణులు కాగా... 75.28 శాతం బాలికల పాసయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో సగానికి పైగా ఏ గ్రేడ్ సాధించారు. మొదటి సంవత్సరంలో లక్షా 93 వేల 925 మంది.. రెండో సంవత్సరంలో లక్షా 59 వేల 432 మందికి ఏ గ్రేడ్ దక్కింది.


అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 1 నుంచి 10 వరకు నిర్వహించాని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. జులై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయు. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ కోసం ఈనెల 30 నుంచి జులై 6 వరకు కళాశాలల ద్వారా ఫీజు చెల్లించాలి. ఆగస్టు చివరికల్లా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను ప్రకటించారు. రీ కౌంటింగ్, జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 30 నుంచి జులై 6 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. రీకౌంటింగ్ కోసం వంద రూపాయలు, జవాబు పత్రాల నకలు, రీ వెరిఫికేషన్ కోసం 600 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మేడ్చల్ జిల్లా అగ్రస్థానంలో నిలవగా.. మెదక్ జిల్లా చివరి స్థానంలో ఉంది.

'కరోనా వల్ల గడిచిన రెండేళ్లు అందరం ఇబ్బందిపడ్డాం. విద్యార్థులకు నష్టం జరగకుండా ఆన్‌లైన్‌లో విద్యా బోధన చేశాం. ఈ ఏడాది 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించాం. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు కౌన్సిలింగ్‌లు కూడా నిర్వహించాం. పరీక్షల తేదీలు 2, 3 సార్లు మారటం వల్ల విద్యార్థులు కొంత ఇబ్బందిపడ్డారు.' -- సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

ఎంపీసీ, బైపీసీలో ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉండగా.. సీఈసీ, హెచ్ఈసీలో సగానికి పైగా ఉత్తీర్ణత సాధించలేక పోయారు. మొదటి సంవత్సరంలో ఎంపీసీలో 76.3 శాతం, బైపీసీలో 71.9శాతం, ఎంఈసీలో 64.7 శాతం, సీఈసీలో 44.4శాతం, హెచ్ఈసీలో 31.8శాతం ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరంలో ఎంపీసీలో 79.6శాతం, బైపీసీలో 75.3శాతం, ఎంఈసీలో 69.4శాతం, సీఈసీలో 47.7శాతం, హెచ్ఈసీలో 45.7శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Last Updated :Jun 28, 2022, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.