తెలంగాణ

telangana

సామాన్యులపై 'టోల్' భారం.. యాజమాన్యాలే భరించాలంటూ జనం గగ్గోలు..!

By

Published : Apr 3, 2023, 9:01 AM IST

Toll Fee Hike Problems : మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా మారింది వాహనదారుల పరిస్థితి. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలతో జీవనం భారంగా మారుతుండగా.. కేంద్రం మరోసారి టోల్‌ ప్లాజా ఛార్జీలు పెంచడంపై వాహనదారులు మండిపడుతున్నారు. వెంటనే పెంచిన భారాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం టోల్‌ ప్లాజా ఛార్జీలు పెంచిందని ఆర్టీసీ అదనపు మొత్తం వసూలు చేయడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. పెరిగిన భారాన్ని యాజమాన్యమే భరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Increased toll plaza charges are RTC problems
Increased toll plaza charges are RTC problems

టోల్‌ఛార్జీల పెంపు అమలుతో వాహనదారులపై మోయలేని భారం

Toll Fee Hike Problems : ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన పెరిగిన టోల్‌ ఛార్జీలపై వాహనదారులు, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల పునర్నిర్మాణాన్ని ప్రారంభించిన కేంద్రం.. వివిధ రకాలైన రహదారులను అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న రోడ్లకు నిర్మాణ వ్యయాన్ని బట్టి నిర్ణీత కాల వ్యవధికి టోల్‌ వసూలు చేసే బాధ్యతను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులపై నిర్మల్‌ జిల్లాలో 7, హైదరాబాద్‌లో 11, వరంగల్‌లో 5, ఖమ్మంలో 5 చొప్పున టోల్‌ ప్లాజాలున్నాయి.

వాటికి అదనంగా మరో నాలుగు టోల్ ప్లాజాలు ఉన్నట్లు జాతీయ రహదారుల శాఖ వెల్లడించింది. ఇప్పటికే పెరిగిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలతో అదనపు భారం పడుతుండగా ఏటా టోల్‌ పెంచడంతో వాహనాలు తిప్పలేని పరిస్థితి ఏర్పడిందని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టోల్‌ పెంపుతో అన్ని రకాల ధరలు పెరుగుతాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం టోల్‌ఛార్జీలను 5 శాతం పెంచడంతో ఆ భారాన్ని ఆర్టీసీ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తోంది. ఆర్డినరీ నుంచి గరుడ ప్లస్ వరకు బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై రూ.4 పెంచినట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.

నాన్‌ ఏసీ స్లీపర్ బస్సులో 15, ఏసీ స్లీపర్ బస్సులో రూ.20 చొప్పున ప్రయాణికుల నుంచి టోల్‌ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించింది. టోల్‌ప్లాజాల మీదుగా హైదరాబాద్ నుంచి సమీప ప్రాంతాలకు వెళ్తున్న కొన్ని సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ టికెట్ ధరను రూ.4 పెంచినట్లు ఆర్టీసీ పేర్కొంది. టోల్‌ ఛార్జీల పెంపుతో విధిలేకనే ఆ భారాన్ని ప్రయాణికులపై వేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే నిత్యావసర ధరలు రోజురోజుకూ పెరుగుతుండగా.. టోల్‌ట్యాక్స్‌ పెంపుతో అన్ని రకాల ధరలూ పెరుగుతాయని లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి జనంపై వేయడం వల్ల ఆర్థికంగా భారంగా మారుతోందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన మొత్తాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. టోల్‌ పెంచడంతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"మేము అందోల్​​ నుంచి హైదరాబాద్​ వెళ్లాలంటే 3 టోల్​ప్లాజా ఛార్జీలు కట్టాలి. అంటే సుమారు రూ.700 కట్టాలి. పెట్రోల్​ సుమారు రూ.1000 అవుతోంది. ఇలా అయితే సామాన్యులు ఎలా బతకాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఆలోచించి టోల్​ గేట్​ ఛార్జీలు, పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గించాలని కోరుకుంటున్నాం". - వాహనదారుడు

ఇవీ చదవండి:

నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి

స్కూటీని ఢీకొట్టి రాజధాని బస్సు దగ్ధం.. ఒకరు మృతి

TSRTCలో ఇకపై 'డైనమిక్‌' బాదుడు.. ఈ నెల 27 నుంచే ఆ మార్గాల్లో..

ABOUT THE AUTHOR

...view details