తెలంగాణ

telangana

పుట్టిన వాళ్లంతా చనిపోతున్నారని.. పిల్లలను చంపేసిన తల్లి

By

Published : Feb 21, 2023, 12:57 PM IST

Mother kills kids in Alwal: కవలలుగా జన్మించిన పండంటి ఆడ, మగ బిడ్డలను చూసి ఆ కుటుంబం ఆనందానికి అవధులులేవు. వారిలో మగ శిశువు అనారోగ్యానికి గురికావడాన్ని మాత్రం తల్లి తట్టుకోలేకపోయింది. గతంలో మాదిరిగానే ఈ పిల్లలు చనిపోతారనే భయంతో తొమ్మిది రోజుల వయసున్న పసిపిల్లలను సంపులో పడేసి.. తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌ అల్వాల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది.

Etv Bharat
Etv Bharat

Mother kills kids in Alwal in Hyderabad: హైదరాబాద్​లో డ్రైవర్‌గా పనిచేసే నర్సింగ్‌రావుకు అన్నానగర్‌కు చెందిన సంధ్యారాణి(29)తో 2012లో మేనరిక వివాహం జరిగింది. ప్రస్తుతం కానాజిగూడ పరిధిలోని శివనగర్‌లో దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి 2017లో కవల పిల్లలు జన్మించారు. వారికి పుట్టుకతోనే ఓ శిశువుకు వైకల్యం ప్రాప్తించగా, మరొకరికి గుండెలో రంధ్రాలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. తర్వాత వారం వ్యవధిలో కవల పిల్లలు ఇద్దరూ చనిపోయారు. 2018లో మరోసారి సంధ్యారాణి గర్భం దాల్చింది. కడుపులోనే శిశువు మృతి చెందడంతో గర్భస్రావం జరిగింది.

అప్పట్నుంచి ఆమె పిల్లలు దూరమయ్యారనే మానసికంగా వేదనకు గురవుతోంది. ఈ క్రమంలో మరోసారి గర్భం దాల్చిన ఆమె..ఈ నెల 11వ తేదీన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కవల పిల్లలకు (మగ, ఆడ) జన్మనిచ్చింది. పూర్తిగా నెలలు నిండకముందే ప్రసవం కావడం, పిల్లలు బరువు తక్కువగా ఉన్న కారణంగా మగ శిశువును మూడు రోజులు ఐసీయూలో ఉంచడం వంటి పరిణామాలు తల్లిని మనోవేదనకు గురిచేశాయి. ఈ నెల 14వ తేదీన తల్లీబిడ్డలు ఇంటికి చేరుకున్నప్పటికీ ఆమెను పాత జ్ఞాపకాలు వెంటాడాయి. గతంలో మాదిరిగానే ఇప్పుడు పుట్టిన బిడ్డలూ అనారోగ్యంతో చనిపోతారనే భయం ఆమెను కుంగిపోయింది.

ఆదివారం అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటి సంపులో బిడ్డలను పడేసి, తానూ అందులోనే దూకి ఆత్మహత్య చేసుకుంది. ఉదయం నిద్ర మేల్కొన్న భర్త భార్య,బిడ్డలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురై వెదికాడు. ఇంటి ఆవరణలో తెరిచి ఉన్న నీటి సంపులో భార్యాబిడ్డల మృతదేహాలను గుర్తించి హతాశుడయ్యారు. ‘బిడ్డల ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం.. గతంలో మాదిరి జరిగిన ఘటనలే తన ఆత్మహత్యకు కారణమంటూ’ మృతురాలు రాసిన లేఖను ఇంట్లో గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details