తెలంగాణ

telangana

Niranjan reddy: 'వ్యవసాయ ప్రగతిపై త్వరలోనే ప్రత్యేక కార్యక్రమం'

By

Published : Sep 8, 2021, 7:44 PM IST

హైదరాబాద్ బషీర్‌బాగ్‌ వ్యవసాయ కమిషనరేట్‌లో ఈ ఏడాది వానాకాలం సీజన్ పురోగతిపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్షించారు. వానాకాలం పంటల విస్తీర్ణం, సరళి, ఉత్పత్తి, రాబోయే ధాన్యం కొనుగోళ్లు, యాసంగి విత్తన ప్రణాళిక వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

Minister niranjan reddy
సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

రాష్ట్రంలో పంటల నమోదు పక్కాగా జరగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Agriculture Minister Niranjan reddy) అన్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌ వ్యవసాయ కమిషనరేట్‌లో ఈ ఏడాది వానాకాలం సీజన్ పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు, ఎఫ్‌సీఐ జీఎం దీపక్ శర్మ, టీఎస్ ఆగ్రోస్ ఎండీ కె.రాములు, సీడ్స్ ఎండీ కె.కేశవులు, పీజేటీఎస్‌ఏయూ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

వానాకాలం పంటల విస్తీర్ణం, సరళి, ఉత్పత్తి, రాబోయే ధాన్యం కొనుగోళ్లు, యాసంగి విత్తన ప్రణాళిక వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. పంటల నమోదు ప్రక్రియలో 100 శాతం కచ్చితత్వం ఉండాలని ఆదేశించారు. మూడేళ్లుగా రైతుల వారీగా పంటల నమోదు ఉండేదని... ఈసారి మరింత కచ్చితత్వంగా ఉండేందుకు క్షేత్రస్థాయిలో ధరణిలో సర్వే నంబర్ల వారీ మ్యాపుల ఆధారంగా పంటల నమోదు చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభమైన పంటల నమోదు క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఉన్నతాధికారులు వెంటనే జిల్లాలలో పర్యటించాలని ఆదేశాలు జారీ చేశారు.

తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప వ్యవసాయ అధికారులకు ఇతర పనులు అప్పజెప్పవద్దని సూచించారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పంటలన్నీ వేసి ఉన్న నేపథ్యంలో పంటల నమోదు మూలంగా కచ్చితత్వం పెరుగుతుందని స్పష్టం చేశారు. పంటల నమోదు మరో పది రోజుల్లో సంపూర్ణంగా పూర్తి కావాలని, ఆ తదిపరి వ్యవసాయ ప్రగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యక్రమం ప్రకటిస్తారని వెల్లడించారు. యాసంగిలో ఆరుతడి పంటలైన వేరుశెనగ, ఇతర నూనెగింజల పంటలైన ఆవాలు, నువ్వులు, కుసుమ, పొద్దుతిరుగుడు సహా పప్పు శనగ ప్రోత్సహించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో ఎఫ్‌సీఐ నుంచి పరిమితంగానే వరి ధాన్యం కొనుగోళ్లు చేస్తామని ఆ సంస్థ జనరల్ మేనేజర్ దీపక్ శర్మ అన్నారు. ఈ వానాకాలం పంటల నుంచి కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించారు. అందులో కూడా బాయిల్డ్ ధాన్యానికి ఉపయోగించే దొడ్డు వడ్ల రకాలు కొనుగోలు చేయబోమని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో సైతం దొడ్డు వడ్ల రకాలును సేకరించడం కుదరదని తేల్చిచెప్పారు. సన్నవడ్లను మాత్రమే సేకరిస్తామని తెలిపారు. రాబోయే ఈ యాసంగిలో వీలైనంత వరకు వరి పంటను సాగు చేయవద్దని జీఎం పేర్కొన్నారు.

ఇదీ చదవండి:రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్‌జీటీకి కేంద్రం నివేదిక

ABOUT THE AUTHOR

...view details