తెలంగాణ

telangana

KTR Tweet On Karnataka Result : 'తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఉండగా.. కర్ణాటక ఫలితాలు రిపీట్‌ కావు'

By

Published : May 13, 2023, 5:22 PM IST

Updated : May 13, 2023, 7:10 PM IST

KTR
KTR

KTR Tweet On Karnataka Election Result : కర్ణాటక ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపుతాయని రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ట్విటర్‌ వేదికగా బదులిచ్చారు. కన్నడ ఫలితాలు ఇక్కడ రిపీట్‌ కావని స్పష్టం చేశారు. బీజేపీని తరిమి కొట్టిన కర్ణాటక వాసులకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

KTR Tweet On Karnataka Election Result : కర్ణాటక ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవని పురపాలక శాఖా మంత్రి, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. తాజాగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ట్విటర్‌లో కేటీఆర్ స్పందించారు. కర్ణాటక ప్రజలపై ప్రభావం చూపడంలో 'ది కేరళ స్టోరీ' ఎలా విఫలమైందో అదే విధంగా కర్ణాటక ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపబోవని ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపారు.

బీజేపీని కర్ణాటక నుంచి తరిమికొట్టి నీచమైన, విభజన రాజకీయాలను కన్నడ ప్రజలు తిరస్కరించారని వారికి కేటీఆర్‌ ధన్యవాదాలు చెప్పారు. భారతదేశం మంచి కోసం పెట్టుబడులు, మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు హైదరాబాద్, బెంగళూరు ఆరోగ్యంగా పోటీ పడాలని ఆకాంక్షించారు. కర్ణాటకలో ఏర్పడనున్న కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు చెప్పారు.

కర్ణాటక తీర్పుతో బీజేపీ నుంచి దక్షిణ భారతానికి విముక్తి: దక్షిణాది నుంచి బీజేపీ పతనం ప్రారంభమైందని, అన్ని చోట్లా ఆ పార్టీ ఖాతా ముగుస్తుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కవని వ్యాఖ్యానించారు. కర్ణాటక తీర్పుతో బీజేపీ నుంచి దక్షిణ భారతదేశానికి విముక్తి లభించిందని.. ఈ చరిత్రనే కొనసాగుతుందని మంత్రి హరీశ్ రావు ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. కర్ణాటకలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

తెలంగాణలోనూ.. కాంగ్రెస్‌దే విజయం:అంతకు ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కర్ణాటక ఫలితాలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ ఎన్నికల్లో ఇదే పునరావృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రజలు బీజేపీ, జేడీఎస్‌ పార్టీలను తిరస్కరించారని తెలిపారు. ఐదేళ్ల బీజేపీ విద్వేష రాజకీయాలకు దగ్గరుండి గమనించిన కన్నడనాట ప్రజలు చరమగీతం పాడారని పేర్కొన్నారు. కన్నడ ప్రజలు బీజేపీని ఓడించి మోదీకి.. జేడీఎస్‌ను ఓడించి కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పారని వివరించారు.

కర్ణాటకలో విజయం.. తెలంగాణలో జోష్‌: ఎన్నో ఉత్కంఠల మధ్య కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తీ ఆధిపత్యాన్ని సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. కర్ణాటకలో విజయం సాధించినందుకు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ కాంగ్రెస్‌ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు టపాకాయలు కాల్చుతూ.. కాబోయే ప్రధాని రాహుల్‌ గాంధీ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలోని బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ వంటి వారు కూడా కర్ణాటక ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. వారితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంత మంది సినీ తారలు కూడా అక్కడి ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :May 13, 2023, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details