తెలంగాణ

telangana

KISHAN REDDY: రేపు హైదరాబాద్​కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

By

Published : Jul 17, 2021, 1:16 PM IST

Updated : Jul 17, 2021, 1:28 PM IST

కేంద్ర కేబినెట్​ మంత్రి హోదాలో కిషన్​రెడ్డి రేపు తొలిసారిగా హైదరాబాద్​ రానున్నారు. పనిచేసే వారికి పట్టం కట్టాలి అన్న ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కేంద్ర కేబినెట్​లోకి తీసుకోవడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు.

KISHAN REDDY: కేబినెట్​ మంత్రిగా తొలిసారి హైదరాబాద్​కు రానున్న కిషన్​రెడ్డి
KISHAN REDDY: కేబినెట్​ మంత్రిగా తొలిసారి హైదరాబాద్​కు రానున్న కిషన్​రెడ్డి

కేంద్ర కేబినెట్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా హైదరాబాద్​కు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి రానున్నారు. ఆదివారం ఆయన నగరానికి రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు, నాయకులు కిషన్​రెడ్డికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర కేబినెట్​లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నేతకు తొలి సారిగా కేబినెట్ హోదా లభించిన తర్వాత... నగరానికి విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై మాజీ ఎమ్మెల్యే చింతల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఎనిమిది మంది నేతలు హైదరాబాద్​లో సమావేశమయ్యారు.

ఈ నెల 18న కిషన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు చింతల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా కేబినెట్ హోదా కిషన్ రెడ్డికి దక్కడం ఎంతో గర్వకారణమన్నారు. పనిచేసే వారికి పట్టం కట్టాలి అన్న ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కేంద్ర కేబినెట్​లోకి తీసుకోవడం అభినందనీయమన్నారు. కేంద్ర కేబినెట్​లోకి కిషన్​రెడ్డిని తీసుకోవడం తెలంగాణకే గర్వకారణమని... తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమం కోసం కిషన్ రెడ్డి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఆ శ్రమను గుర్తించే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.

కిషన్​ రెడ్డి ప్రస్థానం

విద్యార్థి దశ నుంచే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన గంగాపురం కిషన్‌రెడ్డి (Gangapuram Kishan reddy)రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లోని ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. జయప్రకాశ్ నారాయణ్, వాజ్‌పేయి ఆదర్శాలకు ఆకర్షితుడై.... విద్యార్థి దశలోనే జనతా పార్టీలో చేరారు. టూల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన కిషన్‌రెడ్డి... 1980 నుంచి 1994 వరకు భాజపా (Bjp) కార్యాలయంలోనే నివాసముంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1980లో భాజపా రంగారెడ్డి జిల్లా యువమోర్చా కన్వీనర్‌ బాధ్యతలతో ప్రారంభం కాగా... 2002లో యువమోర్చా జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు.

2004లో మొదటిసారి ఎమ్మెల్యే...2004లో తొలిసారి హిమాయత్ నగర్ నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్లిన కిషన్‌రెడ్డి... 2009లో అంబర్‌పేట్ శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2010లో ఉమ్మడి రాష్ట్ర భాజపా పగ్గాలు స్వీకరించి... నాలుగేళ్ల పాటు ఏపీ అధ్యక్షుడిగా, 2014 నుంచి 2016 వరకు తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భాజపా చివరి అధ్యక్షుడిగా.. తెలంగాణ తొలి అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత కిషన్ రెడ్డికి దక్కింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా... మరుసటి ఏడాది 2019లో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికై పార్లమెంట్​లో అడుగుపెట్టారు. తొలిసారి ఎంపీ అయిన కిషన్‌రెడ్డికి మోదీ మంత్రివర్గంలో కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా స్థానం దక్కింది. అనంతరం ప్రధాని మోదీ ఆయనను కేంద్ర కేబినెట్​లోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: Irrigation Projects : ఆరు నెలల్లో అనుమతులు.. ఆచరణ సాధ్యమేనా?

Last Updated : Jul 17, 2021, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details