తెలంగాణ

telangana

Nellore rains: నెల్లూరును వణికిస్తున్న వర్షాలు.. చెరువులను తలపిస్తున్న పొలాలు

By

Published : Nov 30, 2021, 1:12 PM IST

Heavy Rains in Nellore: ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వరదతో జిల్లాలోని జలాశయాలు, చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. పొలాలు అన్ని నీట మునిగాయి.

heavy-rains-in-nellore
నీట మునిగిన పొలాలు

Heavy Rains in Nellore: ఏపీలోని నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు-మనుబోలు మధ్య పంభలేరు వరద ప్రవాహంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. కండలేరు డ్యామ్ నుంచి వరద నీరు రావడంతో సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు చెరువు నిండుకుండలా మారింది. చెర్లోపల్లి గ్రామంలో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. కాలువలు బలహీనపడి పలు ఇళ్లలోకి నీరు చేరడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళ నీట మునిగిన తన ఇంటిని చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. చెరువు తూము చెక్కలను పైకి లేపకపోవడంతో నష్టం జరిగిందని వాపోయారు.

నాయుడుపేట పరిసరాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలకు పంటల పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఊళ్లకు ఆనుకుని భారీగా నీరు చేరటంతో నివాసాల పరిస్థితి దయనీయంగా మారింది. పశువులు ఆహారం కోసం అలమటిస్తున్నాయి. బయట మేసేందుకు ఎక్కడ చూసినా నీరు నిలిచి ఉండటంతో మృతి చెందే పరిస్థితి ఏర్పడింది. వెంకటగిరి నియోజకవర్గంలో కుండపోత వర్షం కురుస్తోంది. బాలాయపల్లి మండలంలో వరద ప్రవాహం కొనసాగుతోంది. కైవల్య నది కాజ్​ వే పై వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కడగుంట- నిండలి మార్గంలో మూడో రోజు రాకపోకలు నిలిచిపోయాయి.

మర్రిపాడు మండలంలో..

మర్రిపాడు మండలం‌ పి.నాయుడు పల్లి, చుంచులూరు గ్రామ ప్రజలకు వరదల అవస్థలు తప్పడం లేదు. మన్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఇరు గ్రామాలకు రెండు రోజుల నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

సోమశిలకు కొనసాగుతున్న ప్రవాహం...

నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం ఇన్​ఫ్లో 96,569 క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 1,15,396 క్యూసెక్కులుగా ఉంది. సోమశిల జలాశయం పూర్తి నీటి నిల్వ 77.98 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 68.37 టీఎంసీలుగా ఉంది.

నీట మునిగిన పొలాలు

ఇదీ చదవండి:Heavy rains in andhra pradesh: ఎడతెరిపి లేని వాన.. పంటలకు అపార నష్టం

ABOUT THE AUTHOR

...view details