తెలంగాణ

telangana

హైదరాబాద్​ సహా శివారు ప్రాంతాల్లో భారీ వర్షం.. ప్రజల ఇక్కట్లు

By

Published : Aug 1, 2020, 5:15 PM IST

Updated : Aug 1, 2020, 9:47 PM IST

అల్పపీడన ద్రోణి, నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల హైదరాబాద్ సహా శివారు​లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఫలితంగా రహదారుల పైకి వర్షపు నీరు చేరి.. వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

heavy rain in hyderabad city
రాజధాని సహా శివారు ప్రాంతాల్లో భారీ వర్షం.. ప్రజల ఇక్కట్లు

హైదరాబాద్​ సహా శివారు ప్రాంతాల్లోని చాలా చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్​రోడ్, చిక్కడపల్లి, విద్యానగర్, అడిక్‌మెట్, కవాడిగూడ, భోలక్‌పూర్‌, యూసఫ్‌గూడ, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్‌, బేగంపేట్, ప్యారడైజ్ సెంటర్, చిలకలగూడ, రామంతాపూర్‌, జీడిమెట్ల, చింతల్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సుచిత్ర, కొంపల్లి, కూకట్‌పల్లి, మూసాపేట, ప్రగతి నగర్‌, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్‌, ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్‌, మల్కాజిగిరి, కుషాయిగూడ, చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడ, అబిడ్స్, కోఠి, బేగం బజార్, సైఫాబాద్, లక్డీకపూల్, బషీర్​బాగ్, నారాయణగూడ, హిమాయత్​నగర్, సుల్తాన్‌ బజార్, నాంపల్లి, మెహదీపట్నం, విజయనగర్ కాలనీ, లంగర్​హౌస్, గోల్కొండ, ఎల్బీ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో వర్షం పడింది.

‌ఉప్పల్, మేడిపల్లి, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాధిగూడ, ఘట్​కేసర్, పోచారం ప్రాంతాల్లో వర్షం కారణంగా వీధుల్లో భారీ ఎత్తున నీరు ప్రవహిస్తోంది. బోడుప్పల్, పీర్జాధిగూడ నగర పాలక సంస్థలు, పోచారం, ఘట్​కేసర్ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల మురుగు నీరు ఇళ్లలోకి చేరింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు ప్రవహించడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

కూకట్​పల్లి మూసాపేట్​లోని వసుంధర ఆసుపత్రి సమీపంలో నాలా పొంగిపొర్లింది. ఫలితంగా పక్కనే ఉన్న అపార్ట్​మెంట్ సెల్లార్​లోకి భారీగా నీరు చేరింది. దీంతో అపార్ట్​మెంట్​ వాసులు తమ సామగ్రితో రోడ్డుపైకి వచ్చారు.

నీట మునిగిన కాలనీలు..

బోయిన్​పల్లిలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఓల్డ్ బోయిన్​పల్లిలోని శ్రీ సాయి కాలనీ, స్వర్ణదామనగర్, పీవీ ఎంక్లేవ్​ రోడ్డు, రామన్నకుంట చెరువు సమీపంలోని ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోయింది. సమస్యను ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోయిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

తప్పిన ప్రమాదం..

భారీ వర్షం కారణంగా జూబ్లీహిల్స్ రోడ్​నెంబర్ 45లోని రామకృష్ణారెడ్డి అనే ఓ వ్యక్తి ఇంటిపై పెద్ద బండరాయి విరిగి పడింది. ప్రమాదంలో ఇంటి గోడ, పలు సామగ్రి ధ్వంసం అయ్యాయి. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ ఇంటి సమీపంలో రాళ్లు బ్లాస్టింగ్ చేస్తున్నారని రామకృష్ణారెడ్డి హైకోర్టులో కేసు వేసినట్లు సమాచారం.

విద్యుత్​కు అంతరాయం..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి జీడిమెట్ల, చింతల్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, జగద్గిరిగుట్ట, గాజులరామారం, నిజాంపేట్, ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్​కు అంతరాయం ఏర్పడింది.

రాకపోకలకు అంతరాయం..

ఖైరతాబాద్ ప్రధాన రహదారితో పాటు రాజ్​భవన్ మార్గంలో ఎగువ నుంచి వచ్చిన వరద కారణంగా నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎర్రమంజిల్ కూడలిలో మురుగు కాలువలపై మ్యాన్ హోల్స్ మూసుకుపోవడం వల్ల రహదారిపై మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. రాజ్​భవన్ ప్రధాన మార్గంలోనూ వరద నీరు నిలిచిపోవడం వల్ల కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. పలుచోట్ల రాకపోకలు స్తంభించిపోయాయి. వరద నీరు నిలిచిన ప్రాంతాలకు జీహెచ్ఎంసీ అత్యవసర సిబ్బంది చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

రాజధాని సహా శివారు ప్రాంతాల్లో భారీ వర్షం.. ప్రజల ఇక్కట్లు

ఇదీచూడండి: భూతవైద్యం పేరుతో చిత్రహింసలు.. ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు

Last Updated : Aug 1, 2020, 9:47 PM IST

ABOUT THE AUTHOR

...view details