తెలంగాణ

telangana

మెడికల్ కాలేజీలపై గవర్నర్, హరీశ్​రావు మధ్య ట్వీట్ వార్

By

Published : Mar 5, 2023, 5:48 PM IST

Updated : Mar 6, 2023, 6:57 AM IST

Harishrao fire on governor: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వైద్యకళాశాల కేటాయింపు అంశం మరోసారి ట్వీట్‌ వార్‌కు దారితీసింది. ఇప్పటి వరకు బీఆర్​ఎస్​, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే.. ఇప్పుడు గవర్నర్‌ తమిళిసై చేసిన ట్వీట్‌కు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించడంతో రాజకీయంగా వేడి రాజుకుంది.

Harishrao fire on governor
Harishrao fire on governor

Harishrao fire on governor: గవర్నర్‌, బీఆర్​ఎస్​ సర్కార్‌ మధ్య ఇప్పటికే విభేదాలు కొనసాగుతున్న వేళ.. ఓ ట్వీట్‌ మరోసారి వీటిని తారస్థాయికి చేర్చింది. గవర్నర్‌ తమిళిసై, మంత్రుల మధ్య కొనసాగిన ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇటీవల అసెంబ్లీ సెషన్‌తో కాస్తా సద్దుమణిగినట్లు కనిపించింది. ఐతే పెండింగ్‌ బిల్లుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో మరోసారి విభేదాలు తెరపైకి వచ్చాయి. దీనిపై తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత శాంతికుమారి ఒక్కసారి కూడా రాజ్‌భవన్‌కి రాలేదని గవర్నర్‌ తమిళిసై ట్విటర్‌ వేదికగా స్పందించారు.

దీనిపై మంత్రి జగదీశ్‌రెడ్డి సహా పలువురు నేతలు గవర్నర్‌ వైఖరిని తప్పుపట్టారు. ఇది ఇలా కొనసాగుతుండగానే తెలంగాణకు ఎన్ని మెడికల్ కళాశాలలు ఇచ్చారంటూ ట్విటర్​లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు గవర్నర్ తమిళిసై సమాధానం మరోసారి రాజకీయంగా వేడిని రాజేసింది.

ప్రధాన మంత్రి స్వాస్థ్ సురక్షా యోజన కింద కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ పిలుపుమేరకు అన్ని రాష్ట్రాలు కొత్త వైద్య కళాశాలల కోసం దరఖాస్తు చేసుకున్నాయన్నారు. ఆ సమయంలో సకాలంలో దరఖాస్తు చేసుకోవటంలో రాష్ట్రం విఫలమైందని ఆమె పేర్కొన్నారు. తమిళనాడుకు ఒకే ఏడాదిలో 11 మెడికల్ కాలేజీలు లభించాయని తెలిపారు. మీరు నిద్రపోయి ఆలస్యంగా మేల్కొని ఆ తర్వాత ఇవ్వమని అడుగుతారంటూ ట్వీట్‌ చేసిన వ్యక్తిని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు జోడించారు.

గవర్నర్‌ తమిళిసై ట్వీట్‌కు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌ వేదికగానే సమధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్న కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విన్నవించినా తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా కేటాయించలేదని తెలిపారు. ఈ మేరకు అప్పటి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్రాన్ని మెడికల్ కాలేజీలు కోరారని అందుకు కేంద్రం సైతం సానుకూలంగా ఉందని ప్రకటించిన వీడియోను జతచేశారు. ఇప్పుడు కాలేజీల కేటాయింపులో కేంద్ర మంత్రులు పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని ట్యాగ్‌ చేశారు.

దేశంలోనే ప్రతి లక్ష మందికి 19 మెడికల్ సీట్లతో తెలంగాణ అగ్ర స్థానంలో ఉందని పేర్కొన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర నిధులతో 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసున్నట్లు తెలిపారు. కేంద్రం, గవర్నర్ అనవసరంగా విమర్శలు మానుకొని ఒకే రోజు 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన తెలంగాణను అభినందించాలని పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్‌కు నిధుల కొరత ఉందన్న మంత్రి.. దేశవ్యాప్తంగా ఎయిమ్స్ అభివృద్ధి కోసం రూ.1365 కోట్లు కేటాయిస్తే.. అందులో కేవలం రూ. 156 కోట్లే తెలంగాణకు మంజూరు చేయటానికి గల కారణం ఏంటని ప్రశ్నించారు.

గుజరాత్ ఎయిమ్స్​కు 52 శాతం, తెలంగాణ 11.4 శాతం నిధులు ఇచ్చిన కేంద్రం తెలంగాణపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ గవర్నర్ తన పంధాను మార్చుకుని ట్రైబల్ యూనివర్శిటీ, రైల్ కోచ్​లు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తే తెలంగాణ ప్రజలకు మేలు చేసిన వారవుతారని హరీశ్ సూచించారు.

ఇవీ చదవండి:

హైదరాబాద్​లో త్వరలోనే మరో నాలుగు సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రులు: హరీశ్​రావు

సీపీఆర్ శిక్షణ విజయవంతమైతే ఎంతోమంది ప్రాణాలను కాపాడొచ్చు: హరీశ్​రావు

అధికారంలోకి రాగానే ఆ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేస్తాం: రేవంత్‌

Last Updated : Mar 6, 2023, 6:57 AM IST

ABOUT THE AUTHOR

...view details