తెలంగాణ

telangana

TSPSC Group 1 Prelims Hall Ticket : గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్‌ టికెట్లు సిద్ధం

By

Published : Jun 4, 2023, 9:21 AM IST

Group 1 Prelims Hall Tickets : రాష్ట్రంలో గ్రూప్​-1 ఉద్యోగాల భర్తీకి ఈ నెల 11న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష హాల్​ టికెట్లు సిద్ధమయ్యాయి. నేటి నుంచి హాల్ ​టికెట్లను డౌన్​లోడ్ చేసుకోవాలని కమిషన్ సూచించింది. ఈ నెల 11న ప్రిలిమినరీ పరీక్ష యధావిధిగా జరుగుతుందని తెలిపింది.

TSPSC Group-1 Prelims Hall Tickets 2023
TSPSC Group-1 Prelims Hall Tickets 2023

TSPSC Group 1 Prelims Hall Ticket 2023 : తెలంగాణ రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ నెల 11న నిర్వహించనున్నప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు సిద్ధమయ్యాయి. అభ్యర్థుల వివరాల ర్యాండమైజేషన్‌ తర్వాత కమిషన్ వాటిని వెబ్‌సైట్​లో పొందుపరిచింది. అభ్యర్థులు నేటి నుంచి తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కమిషన్‌ సూచించింది. ఈ నెల 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపింది. అక్టోబరు 16 నాటి పరీక్ష కోసం డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లు ఇప్పుడు పని చేయవని, తాజాగా మళ్లీ కొత్తగా డౌన్​లోడ్​ చేసుకోవాలని సూచించింది.

Group 1 Prelims Hall Tickets 2023 :గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై వారం రోజుల నుంచి టీఎస్‌పీఎస్సీ బోర్డు సమాలోచనలు చేసి.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో 503 గ్రూపు-1 సర్వీసుల ఉద్యోగాలకు గత సంవత్సరం ఏప్రిల్‌లో కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనికిగానూ రాష్ట్రవ్యాప్తంగా 3.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. గతేడాది అక్టోబరు 16న జరిగిన ప్రిలిమినరీ పరీక్షను ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో రద్దు చేసి.. జూన్‌ 11వ తేదీన నిర్వహించనున్నట్లు రెండున్నర నెలల క్రితమే కమిషన్ ప్రకటించింది. పరీక్షల్లో మరింత పారదర్శకత పెంచేందుకు గానూ ఇప్పటికే కమిషన్‌ పలు చర్యలు చేపట్టింది.

TSPSC Group-1 Prelims Hall Tickets 2023 :పోలీసు కంప్యూటర్‌ సెల్‌, ఇతర సైబర్‌ నిపుణులు, వర్సిటీల ప్రొఫెసర్లతో కూడిన కమిటీలు చేసిన సిఫార్సుల మేరకు కమిషన్‌లోని సైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థను కూడా పటిష్ఠం చేసింది. అలాగే మరిన్ని ఫైర్‌వాల్స్​ను ఉపయోగించింది. టీఎస్​పీఎస్సీ యూపీఎస్సీ సిఫార్సులతో పరీక్షల నిర్వహణకు ప్రత్యేకంగా కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ పోస్టును సృష్టించింది. పరీక్షల విభాగం అంతటా ఆ అధికారి నేతృత్వంలోనే నడుస్తుంది. యూపీఎస్సీ సిఫార్సులతో రాష్ట్రేతర స్థానికత కలిగిన ఐఏఎస్‌ అధికారి నియామకం చేపట్టింది.

అభ్యర్థులకు రెండంచెల తనిఖీలు..:ప్రిలిమినరీ పరీక్షలో పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులను రెండంచెలుగా తనిఖీలు చేయనుంది. మెటల్‌ డిటెక్టర్లు, ఇతర పద్ధతుల్లో వచ్చే అభ్యర్థుల్ని రెండుసార్లు.. రెండు బృందాలు పూర్తిగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనుంది. అభ్యర్థులంతా గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని టీఎస్​పీఎస్సీ సూచిందింది. తనిఖీల తర్వాత అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేయనుంది.

లైవ్‌ ఫొటో తీసుకుని వచ్చిన అభ్యర్థి నిజమైన వ్యక్తి అవునో కాదోనని నిర్ధారణ.. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ సహాయంతో గుర్తించనుంది. ఫొటోలు తీసుకునేప్పుడు గుర్తింపు కార్డుల వివరాలను పొందుపరచనుంది. అన్ని పూర్తి అయ్యాకే.. పరీక్ష గదుల్లోకి అభ్యర్థులను అనుమతించాలని నిర్ణయించింది. ప్రతి పరీక్ష కేంద్రంలో అదనంగా భద్రతా సిబ్బందిని నియమించేందుకు అవసరమైన పోలీసు యంత్రాంగాన్ని సమకూర్చుకుంటోంది. పరీక్ష గదిలోకి వెళ్లిన తర్వాత అక్కడి రోల్స్‌లోని అభ్యర్థుల ఫొటోతో ఇన్విజిలేటర్లు అభ్యర్థులను నిర్ధారించనున్నారు. అలాగే పరీక్ష కేంద్రంలోనూ ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించని అభ్యర్థులను బయటకు పంపించడంతో పాటుగా వారిపై పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details