తెలంగాణ

telangana

BALKA SUMAN: 'దళిత బంధు పథకాన్ని అడ్డుకునేందుకు భాజపా కుట్ర'

By

Published : Aug 6, 2021, 7:38 PM IST

ఎవరు అడ్డుకున్నా దళిత బంధు పథకం ఆగదని ప్రభుత్వ విప్​ బాల్క సుమన్​ స్పష్టం చేశారు. దళిత సాధికారిత కోసం ప్రవేశపెట్టిన ఈ పథకంపై చిల్లర రాజకీయాలు చేస్తే.. దళిత జాతి క్షమించదని ధ్వజమెత్తారు. మరోవైపు సింగరేణి ఏరియాలో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారందరికీ క్రమబద్ధీకరణ చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులను సవరించిందని స్పష్టం చేశారు.

BALKA SUMAN: 'దళిత బంధు పథకాన్ని అడ్డుకునేందుకు భాజపా కుట్ర'
BALKA SUMAN: 'దళిత బంధు పథకాన్ని అడ్డుకునేందుకు భాజపా కుట్ర'

దళిత బంధు పథకాన్ని అడ్డుకునేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. భాజపాది మొదటి నుంచీ దళిత వ్యతిరేక సిద్ధాంతం, భావజాలమేనని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ తరహా దళిత బంధు పథకం కావాలని దేశ వ్యాప్తంగా ఒత్తిడి, ఉద్యమాలు వస్తాయన్న భయం భాజపా నేతల్లో మొదలై.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో భాజపా కాళ్ల కింద అధికారం కదులుతోందని.. అందుకే ఎన్నికల కోసమే దళిత బంధు అంటూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు దమ్ముంటే ప్రధాని మోదీతో మాట్లాడి దళిత బంధు అమలు కోసం రూ.50 వేల కోట్లు తీసుకురావాలని సవాల్​ విసిరారు. ఎవరు అడ్డుకున్నా దళిత బంధు పథకం ఆగదని ఆయన స్పష్టం చేశారు. వాసాలమర్రిలో ఇప్పటికే మొదలైందని.. ఈ నెల 16న హుజూరాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరిన్ని వివరాలు వెల్లడిస్తారని తెలిపారు.

దళిత బంధు పథకం ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన పథకం కాదని.. దళిత సాధికారిత కోసం రూ.వెయ్యి కోట్లను మార్చి నెలలోనే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పొందుపర్చారన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సైతం హర్షం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. దళిత బంధుపై చిల్లర రాజకీయాలు చేస్తే దళిత జాతి క్షమించదని బాల్క సుమన్ ధ్వజమెత్తారు.

BALKA SUMAN: 'దళిత బంధు పథకాన్ని అడ్డుకునేందుకు భాజపా కుట్ర'

'దళిత బంధు పథకం ఈరోజు వచ్చింది కాదు. గత బడ్జెట్​లోనే ప్రభుత్వం ఈ పథకానికి రూ.1,000 కోట్లు కేటాయించింది. ఇది ఎప్పుడో మొదలు కావాల్సిన కార్యక్రమం.. కానీ కరోనా వల్ల కొంత ఆలస్యమైంది తప్ప ఓట్ల కోసం తెచ్చిన పథకం కాదు. ఇది నచ్చని భాజపా పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రజలు అంతా గమనిస్తున్నారు.

- బాల్క సుమన్​, ప్రభుత్వ విప్

జీవో 76ను సవరిస్తూ మెమో..

సింగరేణి ఏరియాలో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారందరికీ క్రమబద్ధీకరణ చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులను సవరించిందని బాల్క సుమన్ తెలిపారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవో 76ను సవరిస్తూ ప్రభుత్వం మెమో ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రావిర్భావం నాటికి ఉన్న ఇళ్లకు నీటి పన్ను, విద్యుత్ బిల్లు వంటివి లేకపోయినా... పొజిషన్​లో ఉన్న వారందరికీ క్రమబద్ధీకరణ చేసేలా అనుమతివ్వడం గొప్ప ఉపశమనమని బాల్క సుమన్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆనందం వ్యక్తం చేశారు. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం, తెరాస పార్టీ ఎప్పుడూ అండగా ఉంటాయని తెలిపారు.

సింగరేణి వైద్య కళాశాలలో కార్మికుల పిల్లలకు 25 శాతం కేటాయించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ను కోరినట్లు తెలిపారు. త్వరలో కోల్ ఏరియా ప్రజాప్రతినిధులు, సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారన్నారు.

Dalitha Bandhu: వాసాలమర్రికి విడుదలైన దళితబంధు నిధులు.. సంబురాల్లో గ్రామస్థులు

Vinod kumar: "దళిత బంధు'పై బడ్జెట్ సమావేశాల్లోనే సీఎం ప్రకటన"

ABOUT THE AUTHOR

...view details