తెలంగాణ

telangana

అందుకే.. పెళ్లైనా ఫ్రెండ్స్ సర్కిల్ ఉండాలట!

By

Published : Jan 11, 2023, 12:43 PM IST

Friendship after marriage : ప్రతి ఒక్కరికీ స్కూల్, కాలేజ్ రోజుల్లో స్నేహితులు ఉండే ఉంటారు. కానీ, పెళ్లయ్యాక వారితో గడిపే అవకాశాలు తక్కువే. పెళ్లై, పిల్లలు పుట్టినా మనకంటూ ఓ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ ఉండాలంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. కొత్త వాతావరణం, అందరూ కొత్త మనుషులు.. జీవిత భాగస్వామితో సమస్యలు.. అందుకే స్నేహ బంధాన్ని కొనసాగించడం వల్ల వ్యక్తిగతంగా మనకు కాస్త సమయం దొరకడంతో పాటు ఇతర ప్రయోజనాలూ చేకూరతాయంటున్నారు.

Friendship relation
స్నేహబంధం

Friendship after marriage : స్నేహబంధం అమూల్యమైనది. జీవితంలో ప్రతి దశలోనూ మన కష్టసుఖాలు పంచుకోవడానికి ప్రాణ స్నేహితులుండాలంటారు. అయితే వృత్తి-ఉద్యోగాలు, పెళ్లి, పిల్లలు, ఇతర కుటుంబ బాధ్యతల రీత్యా చాలామంది మహిళలు తమ స్నేహితుల్ని కలుసుకునే సందర్భాలు తగ్గిపోతుంటాయి. కొంతమందికి కనీసం ఫోన్లో మాట్లాడుకునేందుకు కూడా సమయం దొరక్కపోవచ్చు. దీనివల్ల వారి మధ్య అనుబంధం కూడా సన్నగిల్లుతూ వస్తుంది. నిజానికి చాలామంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు కానీ.. పెళ్లై, పిల్లలు పుట్టినా మనకంటూ ఓ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ను కొనసాగించడం మంచిదంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. దీనివల్ల వ్యక్తిగతంగా మనకు కాస్త సమయం దొరకడంతో పాటు ఇతర ప్రయోజనాలూ చేకూరతాయంటున్నారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందామా..!

మాటతో మద్దతిస్తారు : దాంపత్య బంధంలో భార్యాభర్తల మధ్య పొరపచ్ఛాలు, గొడవలు సహజం. కారణాలేవైనా కొన్నిసార్లు అత్తింటి వారితోనూ మనస్పర్థలు రావచ్చు. ఈ సమయంలో మనసు కకావికలమవుతుంటుంది. పోనీ.. ప్రతి సమస్యా తల్లిదండ్రులతో పంచుకుందామంటే.. ‘ఇంత చిన్న విషయాలకే వాళ్లను టెన్షన్‌ పెట్టడమెందుకు?’ అనిపిస్తుంటుంది. అలాగని వాటిని మనలోనే దాచుకుంటే ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక సమస్యల బారిన పడక తప్పదు. ఇలాంటప్పుడే ‘మన బాధను పంచుకోవడానికి ఓ స్నేహితురాలుంటే బాగుండేది కదా!’ అనిపిస్తుంటుంది. అయితే ఎంత స్నేహితులైనా.. ఇలా అవసరమున్నప్పుడు పలకరించడం కంటే.. ఎప్పటికీ వారితో టచ్‌లో ఉండడం, కలుసుకోవడం.. వంటివి చేస్తే.. మీ సమస్యల్ని వారితో మరింత సులభంగా పంచుకోగలుగుతారంటున్నారు నిపుణులు. ఫలితంగా మీ సమస్యకు వారి నుంచి చక్కటి పరిష్కారం కూడా దొరకచ్చంటున్నారు. కాబట్టి పెళ్లి తర్వాత కూడా గతంలోలాగే మీ స్నేహితుల కోసం తగిన సమయం కేటాయించుకునేలా ప్లాన్‌ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

నచ్చింది చేసేయచ్చు :పెళ్లయ్యాక కూడా భర్తలు తమ స్నేహాల్ని కొనసాగించడం, ఆయా సందర్భాల్లో వారిని కలుసుకోవడం, వారితో కలిసి సినిమాలు-షికార్లు-షాపింగ్‌.. వంటివి చేయడం మనం చూస్తుంటాం. కానీ ఇలా చేసే భార్యలు చాలా తక్కువమందే అని చెప్పాలి. ఇందుకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పలు కారణాలుంటాయి. అలాగని వాటి మూలంగా మీ వ్యక్తిగత స్వేచ్ఛను, ఇష్టాయిష్టాల్ని త్యాగం చేస్తూ మానసికంగా ఇబ్బంది పడడం కంటే.. స్నేహితులకు కాస్త సమయం కేటాయించడం మంచిదంటున్నారు నిపుణులు. దీనివల్ల కలిసి షాపింగ్‌కి, సినిమాలకు వెళ్లొచ్చు.. అలాగే ఎప్పుడూ కుటుంబంతోనే కాకుండా.. అప్పుడప్పుడూ వెకేషన్‌కీ ప్లాన్‌ చేసుకోవచ్చు. తద్వారా స్నేహితులతో అనుబంధం పెరుగుతుంది. మరోవైపు మనసుకు నచ్చిన పనులు, నచ్చిన వారితో కలిసి చేయడం వల్ల మనసూ ఉత్తేజితమవుతుంది.

ఆ సమస్యకో సలహా :వైవాహిక జీవితంలోనే కాదు.. వ్యక్తిగతంగానూ కొన్ని సమస్యలు మనకు సవాలు విసురుతుంటాయి. అలాంటి వాటిలో కొన్ని స్నేహితులతో పంచుకుంటేనే పరిష్కారం దొరుకుతుందనిపిస్తుంది. ముఖ్యంగా.. పెళ్లైన కొత్తలో ఎదురయ్యే లైంగిక సమస్యలు, అప్పుడే పిల్లలు పుట్టకుండా వాయిదా వేసుకునే మార్గాలు.. ఇలాంటి విషయాల గురించి డాక్టర్‌తో చర్చించడం కంటే ఫ్రెండ్స్‌తో సులభంగా పంచుకోగలుగుతాం. వారూ తమ అనుభవంతో కొన్ని సలహాలివ్వగలుగుతారు.. అవి విన్న వెంటనే మనసుకు ఊరట కలుగుతుంది. కాబట్టి ఇలాంటప్పుడు స్నేహితులు మనకు ఎంతో మద్దతుగా నిలుస్తుంటారు. అయితే ఆరోగ్యానికి సంబంధించిన ఇలాంటి విషయాల్లో స్నేహితుల ద్వారా ప్రాథమిక సలహా తీసుకున్నప్పటికీ.. ఆయా సమస్యల గురించి సంబంధిత డాక్టర్‌తో చర్చించి ముందుకెళ్లడం మంచిదంటున్నారు నిపుణులు.

ముందే తెలుసుకోండి :వ్యక్తిగతంగానైనా, ఎమోషనల్‌గానైనా.. స్నేహితులు మనకు అన్ని వేళలా అండగా ఉంటారు. అయితే పెళ్లి తర్వాత కొంతమంది మహిళలు ఒంటరితనంతో బాధపడుతుంటారు. ఇందుకు వాళ్లు స్నేహితులకు దూరమవడం కూడా ఓ కారణమంటున్నారు నిపుణులు. భర్త, అత్తింటి వారు నిరాకరించడంతో తమ ఫ్రెండ్స్‌ సర్కిల్‌కు దూరంగా ఉండే వారు మరికొందరుంటారు. దీనివల్ల జీవితంలో ప్రశాంతత కోల్పోవడంతో పాటు దాంపత్య బంధంలోనూ గొడవలు తప్పవు. అందుకే ఈ సమస్య రాకూడదంటే పెళ్లికి ముందే మీ ఫ్రెండ్స్‌ సర్కిల్‌, స్నేహబంధాల గురించి మీకు కాబోయే వారితో చర్చించండి. అలాగే వారి స్నేహితుల గురించీ అడిగి తెలుసుకోండి. తద్వారా పెళ్లి తర్వాత ఈ విషయంలో ఎలాంటి గొడవలకు తావుండదు. ఇక ఆపై స్నేహాన్ని, కుటుంబ బాధ్యతల్ని, వృత్తిఉద్యోగాల్నీ.. ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడమూ ముఖ్యమే!

ABOUT THE AUTHOR

...view details