తెలంగాణ

telangana

Fire Safety Week : రేపటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు.. ఫలితమిచ్చేనా..!

By

Published : Apr 13, 2023, 3:44 PM IST

Fire Safety Week 2023 : రాష్ట్రంలో జరిగే అగ్నిప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏడాది నిర్వహించే వారోత్సవాలను అగ్నిమాపక శాఖ చేపట్టబోతుంది. ఈ నెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక శాఖ అధికారులు అగ్ని ప్రమాదాలపై వారోత్సవాలు జరపబోతున్నారు. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నారు.

Fire Accidents Safety
Fire Accidents Safety

Fire Safety Week 2023 : ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహించనుంది. ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే వారోత్సవాలు 20 వరకు కొనసాగనున్నాయి. 1944లో జరిగిన అగ్నిప్రమాదం దృష్ట్యా చేస్తున్న ఈ వారోత్సవాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండాపోతోంది. ప్రతి ఏటా అగ్నిప్రమాదాలు రాష్ట్రంలో పెరిగిపోవడం కలకలం రేపుతోంది. మృతుల సంఖ్యతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంటుంది. ఎలాంటి చర్యలు, జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రతి ఏడాది ప్రమాదాలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ఎంతో ఆర్భాటంగా వారోత్సవాలు నిర్వహించే అధికారులు ప్రమాదాలు నియంత్రించడంలో మాత్రం విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సిబ్బంది కొరతే కారణం:ప్రతి సంవత్సరం వారోత్సవాలు నిర్వహించే అగ్నిమాపక శాఖ అధికారులు.. ప్రమాదాలను అరికట్టడంలో అలసత్వం వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఇతర శాఖలతో సరైన సమన్వయం లేకపోవడం, సిబ్బంది కొరత వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అగ్నిమాపక శాఖలో దాదాపు రెండు వేల మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న ప్రాంతాలు, పరిశ్రమల దృష్ట్యా మరో వెయ్యి నుంచి పదిహేను వందల మంది సిబ్బంది అవసరమని నిపుణులు చెబుతున్నారు. అసలు సమస్యలను ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అగ్నిమాపక వారోత్సవాలు జరపడానికి కారణం:1944 ఏప్రిల్‌ 14న బాంబే పోర్టులో విక్టోరియా పేరిట భారీ పడవలో జరిగిన అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఏప్రిల్‌ 14న అగ్నిమాపక శాఖ అధికారులు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అదే రోజు ప్రమాదాల్లో మృతి చెందిన అగ్నిమాపక సిబ్బందికి నివాళులర్పిస్తూ వస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఏటా పెరుగుతున్న ప్రమాదాలు:2021లో 85 భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2022లో వీటి సంఖ్య 104కు చేరింది. 2021లో 25 మంది ప్రమాదాల్లో మృతి చెందగా.. 2022లో 45 మంది మృతి చెందారు. 2021లో ప్రమాదాల్లో చిక్కుకున్న 19 మంది, 2022లో 213 మందిని అగ్నిమాపక శాఖ అధికారులు కాపాడారు.

రూ.కోట్ల ఆస్తి నష్టం:2021లో రూ.996.75 కోట్లు, 2022లో రూ.723.14 కోట్ల ఆస్తులను ప్రమాదాల్లో కాపాడారు. 2022లో సికింద్రాబాద్‌ క్లబ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో రూ.15 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది. అదే ఏడాది సికింద్రాబాద్‌ బోయిగూడ తుక్కు గోదాంలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మృత్యువాతపడ్డారు. సనత్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ గోదాంలో జరిగిన ప్రమాదంలో రూ.14 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది. సికింద్రాబాద్‌ రూబీ హోటల్​లో జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. 11 మంది గాయపడ్డారు. ఈ ఏడాది డెక్కన్‌ మాల్​లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు గల్లంతు కాగా.. ఒకరి మృతదేహం అవశేషాలు లభ్యమయ్యాయి. స్వప్నలోక్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు.

ఈ సారి వారోత్సవాల్లో:ఈ నెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక శాఖ అధికారులు అగ్నిప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి గోడ పత్రికల ఆవిష్కరణ, అవగాహన కల్పించడం, బాల బాలికలకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, మాక్‌ డ్రిల్స్‌ వంటివి నిర్వహించనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details